పవన్కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. బాలకృష్ణతో పవన్కళ్యాణ్ సంప్రదింపులు జరిపారనీ, టీడీపీకి అత్యంత సన్నిహితుడైన ఓ మీడియా ప్రతినిథి మధ్యవర్తిత్వం వహిస్తున్నారనీ చాలా గాసిప్స్ విన్పించాయి.
టీడీపీ నేతలు కొందరు ఓ అడుగు ముందుకేసి, పవన్`నాగబాబులను టీడీపీలోకి మీడియా ముఖంగా ఆహ్వానించేశారు కూడా. పవన్ చాలా మంచోడని సర్టిఫికెట్లు, నాగబాబు టిక్కెట్ ఆశిస్తే టీడీపీ అధినేతకు ఆ విషయం విన్నవించుకోవచ్చని కబుర్లు.. అబ్బో తతంగం చాలానే జరిగింది. అయితే పవన్కళ్యాణ్ ఇప్పటిదాకా ఈ వ్యవహారంపై స్పందించలేదు. అసలాయన మీడియాలో వచ్చే కథనాలకు ఏనాడూ రెస్పాండ్ అయిన దాఖలాలే లేవు గనుక, ఈ విషయాన్నీ పవన్ లైట్ తీసుకునే వుండాలి.
కాగా, నాగబాబు మాత్రం మీడియాకి ఓ నోట్ పంపారు. ఆ నోట్లో, తాను, పవన్కళ్యాణ్ టీడీపీలో చేరతామంటూ వస్తున్న వార్తలు నిరాధారమని నాగబాబు పేర్కొన్నారు. ఆ వార్తలతో తమకు సంబంధం లేదనీ, ప్రస్తుతం తాము సినిమాల్లో బిజీగా వున్నామనీ, రాజకీయాలపై ఆసక్తి లేదని నాగబాబు స్పష్టం చేశారు.
నాగబాబు పేరుతో విడుదలైన ఆ లేఖలో పవన్కళ్యాణ్ ప్రస్తావన వుండడంతో.. మెగా ఫ్యామిలీ నుంచి పూర్తిగా టీడీపీలో చేరడంపై ఖండన వచ్చిందనుకోవాలి. పవన్ ఎటూ ఇలాంటి వ్యవహారాల్ని సీరియస్గా తీసుకోడు కాబట్టి, ఇక్కడితో ఈ గాసిప్స్ పర్వం ఆగుతుందో, లేదంటే పవన్ స్పందించలేదు కాబట్టి.. అంటూ ఇంకా కథనాలు వస్తూనే వుంటాయో వేచి చూడాల్సిందే.