అల్లరి నరేష్ సినిమాలు రెండేళ్ల ముందు వరకు వరుసగా వచ్చి పడిపోయేవి. ఏ హీరో సినిమా ఉన్నా రాకపోయినా అల్లరి నరేష్ సినిమా మాత్రం రెండు నెలలకి ఒకటైనా వచ్చి థియేటర్ల ఫీడింగ్‌కి బాగా ఉపయోగపడేది. అల్లరి నరేష్‌కి మాస్ సెంటర్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలు చూసి నవ్వుకోవచ్చని మొదటి రోజే ప్రేక్షకులు బాగా తరలి వస్తారు.
అల్లరి నరేష్ సినిమా వస్తే మూడు, నాలుగు వారాల పాటు లోటుండదని ఎగ్జిబిటర్లు గుండెల మీద చెయ్యేసుకునేవారు. సుడిగాడుతో తన కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన తర్వాత అల్లరి నరేష్ సుడి సడన్‌గా అడ్డం తిరిగింది. వరుసగా మూడు ఫ్లాప్ సినిమాల్లో నటించాడు. గత ఏడాది అతనివి రెండే సినిమాలు రిలీజ్ కాగా, రెండూ ఫ్లాపయ్యాయి.
ఈమధ్య వేగం బాగా తగ్గించిన అల్లరి నరేష్ త్వరలో ‘లడ్డుబాబు’గా రాబోతున్నాడు. మినిమమ్ గ్యారెంటీ సినిమాలు తీస్తాడనే పేరున్న రవిబాబు డైరెక్టర్ కాబట్టి దీంతో నరేష్‌కి మళ్లీ బ్రేక్ రావచ్చునని ఆశించవచ్చు. అయినా కానీ నరేష్ మరీ ఇంత నెమ్మదించకూడదని, గతంలో మాదిరిగా వరుసగా లో బడ్జెట్లో సినిమాలు చేస్తూ పోతుంటే, అవి సేఫ్ జోన్లోకి వెళ్లడం అంత కష్టమేం కాదనేది విశ్లేషకుల మాట.