ఎన్నికలు వచ్చాయి అంటే ఎవరి ఆస్తులు ఎంతో, ఎవరి అప్పులు ఎంతో క్లారిటీ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ వేసారు. ఆస్తులు అప్పులు బయటకు వచ్చేలోగానే పార్టీ నుంచి ఓ నోట్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు.
గత అయిదేళ్లలో జస్ట్ 114 కోట్లు మాత్రమే సంపాదించారట. అందులో 74 కోట్లు టాక్స్ లు కట్టేసారట. 20 కోట్లు విరాళాలు ఇచ్చేసారట. పవన్ కు మిగిలింది బ్యాంకులకు 18 కోట్లు, వివిధ వ్యక్తులకు 47 కోట్లు అప్పులు వున్నాయట. ఈ 47 కోట్లు వివిధ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకున్నట్లు పవన్ తెలిపారు.
పార్టీ పరంగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఆస్తుల వివరాలు లేవు. అవి నామినేషన్ తో ఇచ్చే వుంటారు. ఎలాగూ బయటకు వస్తాయి. కానీ అసలు సంగతి ఏమిటంటే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజి సినిమాలు నాలుగూ గడచిన అయిదేళ్లలో కొత్తగా ఒప్పుకుని చేసినవే. హరి హర, ఉస్తాద్ సినిమాలు అంటే పాత అడ్వాన్స్ లు. అందువల్ల వాటిని లెక్క పెట్టక్కరలేదు.
మరి నాలుగు సినిమాలకు పవన్ ఆదాయం జస్ట్ 117 కోట్లేనా? అంటే సినిమాకు 30 కోట్లు అన్నమాట సగటున? ఇది నమ్మే విషయమేనా? టాలీవుడ్ లో ఎవర్ని అడిగినా ఆఫ్ ది రికార్డుగా చెబుతారు పవన్ రెమ్యూనిరేషన్ 60 నుంచి 70 కోట్లు అని. పోనీ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు 50 వంతున తీసుకున్నా, 100 కోట్లు అక్కడే అయింది. తరువాత రెండు సినిమాలకు 140 కోట్లు. వెరసి 240 కోట్లు ఆదాయం అని టాలీవుడ్ లో లెక్కలు వినిపిస్తాయి.
ఇదిలా వుంటే అప్పులు ఇచ్చిన జనాలు ఎవరో.. అసలు అప్పులు ఎందుకు తీసుకున్నారో, అఫిడవిట్ పూర్తి వివరాలు బయటకు వస్తే తెలుస్తుంది.