Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ ను తిట్టడం తప్పే.. కానీ

పవన్ ను తిట్టడం తప్పే.. కానీ

సరే, ఆర్జీవీ చేసిన పిచ్చి పనిని పక్కన పెడదాం. పిచ్చి పని అనే కన్నా, పెద్ద పదం వాడాలి. కానీ మీడియా హద్దులు వుంటాయి కదా. వదిలేద్దాం. రెండు రోజులుగా అనేకానేక మంది బయటకు వచ్చి గొంతులు సవరించుకుంటున్న వైనం చూసాం. పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి తిట్టరాని తిట్టు తిట్టగానే మహా మహా మహానుభావులు ఆవేశం కట్టలు తెంచుకుంది. మహా మహా గొప్పొళ్లు అంతా బయటకు వచ్చి కొందరు, రాకుండా కొందరు స్టేట్ మెంట్ లు విసురుతున్నారు.

కానీ వారం రోజులుగా ఈ ఇండస్ట్రీలో అమ్మాయిలను, ముఖ్యంగా జూనియర్, సబ్ జూనియర్ ఆర్టిస్టులను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు మహాప్రభో అని మీడియాకు ఎక్కి అనేక మంది తమ ఆవేదన వెళ్లగక్కుతుంటే, ఈ మహానుభావులు అంతా ఎక్కడ దాక్కున్నారు? పవన్ కళ్యాణ్ ను తిట్టిన తరువాత గానీ నాగబాబుకు, ఔట్ డోర్ షూట్ లో అమ్మాయిలకు బాత్ రూమ్ సదుపాయం వుండదని, కానీ, డ్రెస్ రూమ్ సదుపాయం వుండదని కానీ తెలియలేదా? ఈ స్పందించేది ఏదో ముందే స్పందించ వచ్చు కదా? అరవింద్ లాంటి పెద్దాయిన ఇప్పుడు కాకుండా ముందుగానే స్పందించి వుంటే గౌరవంగా వుండేది కదా?

అమ్మాయిలు మీడియాకు ఎక్కి చెప్పిన విషయాలు ఎంత దారుణంగా వున్నాయి? అమ్మాయిలను ఓరల్ సెక్స్ కు బలవంతం పెట్టడం అన్న విషయం వింటేనే ఎంత జుగుప్సగా, ఎంత నీచంగా వుంది? ఈ సినిమా జనాలా? సినిమాల్లో నీతులు చెప్పేది? అవకాశం కోసం వచ్చిన వాళ్లను డబ్బు కోసం ఎక్స్ ప్లాయిట్ చేసారంటే, కాస్త క్షమించవచ్చు.

మోసం చేస్తే, సర్లే అని ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఈ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్ ఎంత నీచం. కాటికి కాళ్లు చాచుకున్న వాళ్లు కూడా వాళ్లకు వున్న అవకాశాలు వాడుకుని, పదహారేళ్ల అభం శుభం తెలియని వారిని రాత్రంతా బాధలు పెడుతున్నారన్న విషయం తలుచుకుంటేనే గుండెలు రగిలిపోవూ?

పవన్ ను తిట్టమని చెప్పి ఆర్జీవీ తప్పు చేసి వుండొచ్చు. తిట్టి శ్రీరెడ్డి తప్పు చేసి వుండొచ్చు. కానీ వీటి పర్యవసానంగా, తమ తమ సేఫ్ జోన్ ల్లోంచి, ఏసి గదుల్లోంచి బయటకు వచ్చిన సినిమా పెద్దలు కేవలం ఈ విషయం మీద మాట్లాడి ఊరుకోకుండా, సినిమాల్లో అమ్మాయిల సమస్యల మీద కూడా పెదవి కదపాలి. అందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

అయినా టాలీవుడ్ అన్నది ఏమైనా ప్రయివేటు ప్రాపర్టీనా? అదో ప్రయివేటు సామ్రాజ్యమా? ఇంత భయంకరమైన ఆరోపణలు వచ్చినపుడు ప్రభుత్వం ఎందుకు స్పందించి, పోలీసు, ఇంటిలిజెన్స్ తదితర విభాగాలతో ఓ సిట్ ఏర్పాటుచేసి, దీని మీద ఎందుకు దర్యాప్తుకు ఆదేశించదు? నిజానిజాల నిగ్గు తీయదు? రేపు అదృష్టవశాత్తూ ఏ కోర్టు అయినా సూమోటోగా ఈ కేసు స్వీకరించి, అలా చేయమంటే ప్రభుత్వాలు చేయాల్సిందేగా? అదేదో ఇప్పుడే చేయవచ్చుగా.

అంతే కానీ, ఇదేదో ప్రయివేటు వ్యవహారం అన్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి, హోంమంత్రి తమకు పట్టనట్లు వదిలేస్తే ఎలా? విజయవాడలో కాల్ మనీ వ్యవహారం లాంటిదే ఈ టాలీవుడ్ కాస్ట్ కౌచింగ్ కూడా. దాన్ని నీరు కార్చినట్లే, దీన్ని కూడా నీరుగార్చేలా వున్నారు చూస్తుంటే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?