Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబు వెన్నుపోటు.. ఆర్జీవీ ఎన్నికల పోటు

బాబు వెన్నుపోటు.. ఆర్జీవీ ఎన్నికల పోటు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో వెన్నుపోటు రాజకీయాల్ని ప్రజల ముందుంచుతానంటూ చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. వెన్నుపోటు పాటతో కేసుల దాకా వెళ్లిన ఈ దర్శకుడు, రివర్స్ కేసులు పెట్టి దేనికీ భయపడేది లేదని నిరూపించుకున్నాడు. ఆమధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ పాత్రల్ని పరిచయం చేస్తూ చంద్రబాబు పోలిన నటుడి ఫొటోని రిలీజ్ చేసి మరింత కాక రేపాడు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఫొటో పక్కనే ఆ నటుడి ఫొటో చేర్చి వయసుతో పాటు 'అది' మరింతగా పెరిగిందని, తనదైన శైలిలో క్యాప్షన్ పెట్టి వదిలాడు.

అంతేనా.. చంద్రబాబు పిక్ పాకెటర్ అని ఎవరో అంటున్న వీడియో లింక్ ని పోస్ట్ చేసి, దీనిలో మాట్లాడినవారిపై కేసెందుకు పెట్టరంటూ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు. మొత్తానికి ఎన్నికల సమయానికి సోషల్ మీడియా వేదికగా బాబు పరువుని పూర్తిగా బజారుకీడుస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడో మామని వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు దాన్ని జనాలకు గుర్తు చేసి మరీ ఎన్నికల ముందు తన పరువు తీస్తున్నాడని వర్మపై గుర్రుగా ఉన్నాడు చంద్రబాబు.

ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా రాజకీయ లాభం పొందాలని చూశాడు చంద్రబాబు. అయితే లక్షీస్ ఎన్టీఆర్ సినిమా ఆ లాభానికి చిల్లు పెడుతుందని భయపడుతున్నాడు. చంద్రబాబు అనుమానమే నిజమయ్యేలా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ఆల్రెడీ వర్మ మంచి పాపులారిటీ తెచ్చాడు. బయోపిక్ ఫస్ట్ పార్ట్ కి డివైడ్ టాక్ రావడంతో రెండో భాగంపై కూడా పెద్ద అంచనాలు లేవు. ఇక వర్మ తీసే సినిమాపైనే అందరి దృష్టీ. అందుకే మరింత కసిగా ఒక్కో స్టిల్ వదులుతూ, టీడీపీ నేతలతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.

ఇప్పటికే కొంతమంది టీడీపీ పెద్దలు, వర్మ సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారని వినికిడి. అయితే ఎవరిమాటా వినని రామ్ గోపాల్ వర్మ, ఈ విషయాలని కూడా పబ్లిసిటీకి వాడుకుంటాడని తెలిసి ఆయన దగ్గరకు వెళ్లడానికి జంకుతున్నారు. మొత్తానికి వర్మ రాజేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కుంపటి బాగానే మండుకుంటోంది. ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా ఆగాల్సిందే.

ఎందుకంటే టీజర్లు, ట్రైలర్లు చూసి వర్మ సినిమాలపై అంచనాలు పెంచుకునే రోజులు ఇప్పుడు లేవు. వర్మ బ్రాండ్ నేల చూపులు చూస్తోంది. మరీ వన్ సైడ్ గా లేకుండా.. వాస్తవానికి దగ్గరగా చూపిస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా, మహానాయకుడిని తలదన్నడం గ్యారెంటీ.

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?