శనివారం రాత్రి టెంపర్ పార్టీ ఫీవర్ చాలా గట్టిగానే సోకింది. టెంపర్ సక్సెస్ సందర్భంగా పార్క్ హయాత్ లో హీరో సచిన్ జోషి మాంచి కాక్ టైల్ పార్టీ ఇచ్చారు. టెంపర్ సినిమా ఏంటీ? సచిన్ జోషీకి సంబంధం ఏమిటి అన్న చచ్చు అనుమానాలు అక్కరలేదు. ఎందుకంటే టెంపర్ సక్సెస్ తరువాత అకస్మాత్తుగా సచిన్ జోషి పేరు పైకి వచ్చింది. ఆ సినిమా తమిళ, హిందీ రైట్లు అతని దగ్గరే వున్నాయి. సినిమాకు బ్యాక్ బోన్ అతనే అని వేదికపైనే సెలబ్రిటీలు పొగుడుతున్నారు.
పైగా ఈ పార్టీ ఇచ్చిన పార్క్ హయాత్ లో, ఓ హోర్డింగ్ లో టెంపర్ సినిమా పైన పరమేశ్వర ఆర్ట్స్ పేరుతో పాటు సచిన్ బ్యానర్ అయిన వైకింగ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ పేరు కూడా చోటు చేసుకోవడం విశేషం.
సరే ఈ సంగతి అలా వుంచితే..ఈ కాక్ టైల్ పార్టీకి పూరి జగన్నాధ్ సర్కిల్ మొత్తం హాజరయింది. రామ్ గోపాల్ వర్మ, రవితేజ, బ్రహ్మాజీ, కుంచెరఘు, శివనాగేశ్వరరావు, బివిఎస్ రవి, తేజస్విని ఇలా టీమ్ అంతా. ఇక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రామ్ గోపాల్ వర్మతో సంబంధం వున్న వారు కూడా హాజరయ్యార. జగపతి బాబు, రాజమౌళి, రమా రాజమౌళి, నిర్మాతలు ఎన్ వి. ప్రసాద్, దిల్ రాజు, సందీప్ కిషన్, బివివిఎస్ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, కూడా హాజరయ్యారు.
పార్టీకి బండ్లగణేష్, పాటల రచయిత విశ్వ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించారు. విశ్వ డ్యాన్స్ లే డ్యాన్సులు..బండ్ల గణేష్ కౌగిలింతలు..ముద్దులు. టెంపర్ విజయం అంత ఆనందాన్నిచ్చింది బండ్ల గణేష్ కు. ఇంతకీ టెంపర్ విజయంలో కీలకపాత్రధారి అయిన ఎన్టీఆర్ మాత్రం ఈ పార్టీకి హాజరు కాలేదు.అంతకు ముందు ఆవాస హోటల్ లో టెంపర్ సక్సెస్ మీట్ జరిగింది. హీరో ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి వచ్చారు.