ఎవరికైనా ఎవార్డు వచ్చినా, ఎవరైనా పోయినా వారి గురించి రాయండి అని కొందరు పాఠకులు నాకు మెయిల్స్ రాస్తూ వుంటారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ యిలాటి వారిపై నాకు గౌరవం వున్నా పత్రికలలో, టీవీల్లో వచ్చేదాని కంటె భిన్నంగా, అదనంగా చెప్పడానికి ఏమీ లేనప్పుడు నాకేమీ రాయబుద్ధి కాదు. అందరూ రాసేది మనమూ రాయడం దేనికి? మనకంటూ అదనపు సమాచారం లేకపోతే మానె కనీసం భిన్నదృక్పథం వుంటేనైనా రాయవచ్చు, లేకపోతే వూరుకుంటే మేలు అనుకుంటాను. బాలచందర్ గురించి కాస్త ఆలస్యంగానైనా వ్యాసం రాశాను – తక్కినవాళ్లు ఆ పాయింట్లు మిస్ చేస్తున్నారని తోచి! అలాగే ఆర్ కె లక్ష్మణ్. ఆయన పోయిన దగ్గర్నుంచి చూస్తున్నాను – అందరూ ఆయన కార్టూన్ కళ గురించి, కామన్ మ్యాన్ గురించి రాశారు కానీ ఆయన రచనల గురించి రాయలేదు. ఆయనను ఆ కోణంలో పరామర్శిస్తూ యిది రాస్తున్నాను.
లక్ష్మణ్‌ను ఒక యింటర్వ్యూలో ఎవరో అడిగారు – మీకూ రచనావ్యాసంగం వుంది కదా, దాన్ని వదిలిపెట్టేశారేం? అని. 'మా అన్నయ్య ఆర్‌కె నారాయణ్‌తో పోల్చి చూస్తున్నారు. అందుకని మానేశా..' అన్నాడాయన. లబ్ధప్రతిష్టులతో బంధుత్వం వుంటే యిదే చిక్కు. ఆర్ కె నారాయణ్ జగమెరిగిన రచయిత, ఆయనతో పోలిస్తే ఎలా? ఆయన లక్ష్మణ్‌లా కార్టూన్లు వేయలేడుకదా! లక్ష్మణ్‌వి కార్టూన్ల పుస్తకాలు చాలా వున్నాయి. రచనల విషయానికి వస్తే ఆయన కలెక్టెడ్ వర్క్‌స్ (2000 పెంగ్విన్ ప్రచురణ) ఒకటే ఆన్‌లైన్‌లో కనబడుతోంది. దానిలో ''ద హోటల్ రివియేరా'', ''ద మెస్సెంజర్'' అనే రెండు నవలలు, ''ద టన్నెల్ ఆఫ్ టైమ్'' అనే ఆయన ఆత్మకథ వున్నాయని బ్లర్బ్‌లో తెలుస్తోంది. నేనా పుస్తకం చూడలేదు. హోటల్ రివియేరా అనే హోటల్ చుట్టూ తిరిగే పాత్రలతో రాసిన ''సారీ, నో రూమ్'' అనే పుస్తకం నా దగ్గర వుంది. (1969, ఐబిఎచ్ ప్రచురణ) ''ద హోటల్ రివియేరా'' పేరుతో పెంగ్విన్ వాళ్లు 1989లో వేసినదీ అదీ ఒకటేనేమో తెలియదు. నా దగ్గరున్న నవల చదివితే, ఆ పాత్రల తీరు చూస్తే ఆర్‌కె నారాయణ్ రాసినట్లే వుంటుంది. లక్ష్మణ్ సన్నిహితులు ఆ ముక్క ఆయన దగ్గరా అన్నారేమో, ఒళ్లు మండి మానేసి వుంటారు. లక్ష్మణ్ రచనాశైలి పరిచయం చేయడానికి నేను ఒక కథను ఎంచుకుంటున్నాను. ''ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా'' 1975 మే 11 సంచికలో ''ఏన్ యాక్సిడెంట్'' అనే కథ బాగా నచ్చింది. కట్ చేసి దాచుకున్నాను. ఆయన యిలాటి చిన్న కథలను ''ఐడిల్ అవర్స్'' (1982-ఐబిఎచ్ ప్రచురణ)లో చేర్చారనుకుంటా. తెలియదు. ఆ పుస్తకం నా వద్ద లేదు. ఈ కథ థీమ్ చిన్నదే. హత్య చేయడం యింత సులభమా అనిపిస్తుంది. నేరేషన్, భాష ఏదీ క్లిష్టంగా వుండదు. అలవోకగా రాసినట్లు వుంటుంది. ఆ కథను తెలుగులో సంగ్రహంగా చెప్తాను –
'కైలాశ్ అనే వ్యక్తి డాగా అనే దుర్మార్గుడి నుండి పారిపోతున్నాడు. ఒక మహా నగరం నుంచి కారులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతూంటే హైవేకు పక్కగా వున్న రోడ్డు ఒక అడవిలోకి దారి తీసినట్లు కనబడింది. అటు పోనిచ్చాడు. కొన్ని గంటల తర్వాత పెట్రోలు బంక్ కనబడింది. కారులో పెట్రోలు కొడుతూ వుంటే వెళ్లి న్యూస్ పేపరు కొని, పేజీలు గబగబా తిరగేశాడు. తను మిస్ అయినట్టు ఎక్కడా ఏ ప్రస్తావనా లేదని చూసుకుని నిట్టూర్చాడు. చీకటి పడేలోపున ఏదైనా వూరు చేరితే మంచిదనుకుని స్పీడు పెంచాడు. అంతలో సడన్‌గా అతనికి మతి పోయినట్లు అనిపించింది. కళ్లముందు ఏమీ కనబడడం మానేసింది. ఏమిటో, ఎక్కడున్నాడో ఏమీ తెలియలేదు. అప్రయత్నంగా కాలితో సడన్ బ్రేకు వేశాడు. కారు జర్క్‌తో పక్కకు స్కిడ్ అయింది. పక్కనుంచి సరసరా వాహనాలు హారన్ కొట్టుకుంటూ వెళ్లి గుండెలు అదరగొట్టాయి. కొన్ని క్షణాల్లో అర్థమైంది – తన ముఖాన్ని న్యూస్ పేపరు మూసేసిందని. చేతులతో దాన్ని లాగి పారేశాడు. చదివి, కారు వెనుకసీటులో పడేసిన దినపత్రిక పేపరు విప్పుకుని పోయి కాగితాలు చెల్లాచెదురై అటూయిటూ ఎగిరి ఒకటి స్టీరింగుపై పడగా, మరొకటి తన ముఖాన్ని పూర్తిగా కప్పేసింది. దాంతో అతను గందరగోళ పడిపోయాడు. కాస్త వుంటే ఎదురుగా వున్న పెద్ద చింతచెట్టును గుద్దేసి వుండేవాడు. కాస్సేపు నిస్తేజంగా కూర్చుని, నీళ్లు తాగి తమాయించుకుని, కాగితాలన్నీ నలిపి, అవతల పారేసి, మళ్లీ డ్రైవింగ్ మొదలుపెట్టాడు. తను కొద్దిలో చావు తప్పించుకున్నాడు. ఇలా చచ్చిపోయినా బాగుండేదేమో, డాగా చేతిలో ఘోరమైన చావు కన్నా.. అనుకోగానే అతని ఆలోచనలు గతంలోకి వెళ్లాయి.
'తనూ, డాగా యిద్దరూ కలిసి బిల్డింగు కాంట్రాక్టు వ్యాపారం చేసేవారు. తను చిన్న భాగస్వామి. డాగాకు క్లయింట్ల దగ్గర్నుంచి విపరీతంగా బ్లాక్ మనీ తీసుకోవడం, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వ్యసనాలు పాలు చేయడం, యిదీ పని. అవన్నీ తనకూ మప్పాడు. నీ వాటా అంటూ డబ్బు యివ్వడం, తన చేత తాగుడికి, అమ్మాయిలకు ఖఱ్చు పెట్టించడం. డాగా పోనుపోను స్మగ్లింగే కాదు, మరీ దుర్మార్గంగా హత్యలు కూడా చేసే స్థితికి దిగజారాడు. ఈ జీవితంపై విసుగుపుట్టి తను మారిపోదామన్నాడు. కానీ డాగా అలా వదిలేరకం కాదు. తన మాటకు ఎవరైనా ఎదురాడినా, గుప్పిట్లోంచి తప్పించుకున్నా ప్రాణాలు తీస్తాడు. కొద్దిపాటి అనుమానంతో థాబ్దాలుగా తనకు సేవ చేసిన కణ్ణన్ అనే అతన్ని అలాగే చంపేసి రైలుపట్టాల మీద పడేశాడు. అతనికి టైపిస్టు డోరిన్ మీద కూడా అనుమానం వుంది. ఓ రోజు తను తాగి, డోరిన్‌తో పక్కలో వుండగా యిద్దరం పారిపోదాం, మన దగ్గర వున్నదానితో మిగిలిన జీవితాన్ని నిర్భయంగా అనుభవిద్దాం అన్నాడు. కొద్ది రోజులకే ఆమె విడిగా పారిపోయింది. ఇక తనూ పారిపోకపోతే డాగా అనుమానంతోనైనా చంపేస్తాడని భయపడ్డాడు. మూడు రోజుల క్రితం డాగా చిత్తుగా తాగి మత్తుగా పడివున్నపుడు యిదే ఛాన్సని కారు, చేతికందిన స్మగుల్డ్ వస్తువులు పట్టుకుని వుడాయించాడు. దాన్ని అమ్మి డబ్బు చేసుకున్నాడు.'
చీకటి పడేవేళకు అతను అడవి మధ్యలో వున్న ఒక చిన్న పల్లెటూళ్లో ఒక లాడ్జ్‌కి చేరాడు. మర్నాడు కిటికీలోంచి చూస్తే లారీలు వరుసగా వచ్చి పక్కనున్న అడితిలో దుంగలను దింపుతున్నాయి. ఒకతను అవన్నీ రాసుకుని వేర్వేరు వూళ్లకు పంపుతున్నాడు. వెళ్లి పరిచయం చేసుకున్నాడు. అతని పేరు నాయుడు. తన పేరు కుమార్ అని చెప్పుకున్నాడు. రోజూ చాలాసేపు అతని దగ్గరే కూర్చుని కబుర్లు చెపుతూండేవాడు. మూడువారాలు గడిచేసరికి నాయుడడిగాడు – ''ఇక్కడికి 50 కి.మీ.ల దూరంలో అరణ్యమధ్యంలో హంటర్స్ లాజ్ అని ఒక గెస్ట్ హౌస్ వుంది. చుట్టూ ఎవరూ వుండరు. చెట్ల నుండి కొట్టేసిన దుంగలు అక్కడకి వచ్చి చేరతాయి. వాటి మీద నెంబర్లు పెయింటుతో రాయించి, ఆ నెంబర్లన్నీ ఒక పుస్తకంలో రాయాలి. ఆ దుంగలను వేరే లారీలకు ఎక్కించి, నా దగ్గరకు పంపాలి. నమ్మకస్తుడు ఎవరూ దొరకటం లేదు. నువ్వు అక్కడ వుంటావా? అక్కడ నీకు సాయపడడానికి ఓ పనిమనిషి వుంటాడు. కూరలూ, పాలూ పక్కనున్న గ్రామం నుంచి అతనే తెస్తాడు. నువ్వు చదువుకోవడానికి పేపర్లూ, మ్యాగజైన్లు నేను లారీ డ్రైవర్ల ద్వారా పంపిస్తాను.'' అని. కైలాశ్ ఒప్పుకుని ఆ వుద్యోగంలో స్థిరపడ్డాడు. ఏ చీకూచింతా లేకుండా ఒంటరి జీవితం బతకసాగాడు.
కొన్ని రోజులు గడిచేసరికి అతని స్మృతిపథంలో నుంచి డాగా క్రమంగా తొలగిపోసాగాడు. కానీ ఒక రోజు అందరూ వెళ్లిపోయాక చీకట్లో ఒక నల్లకారు అతని దగ్గరకి వచ్చింది. దాన్లోంచి దిగినది వేరెవరో కాదు, డాగా! తెల్లబోయి చూస్తున్న కైలాశ్ వైపు విషపు నవ్వు విసిరి ''నీ పాతస్నేహితుణ్ని లోపలికి తీసుకెళ్లి తిండీతిప్పలూ చూడవా?'' అన్నాడు. కైలాశ్ సర్దుకున్నాడు. ''నీకు తిండి కంటె ముందు తాగుడు కావాలని తెలుసుగా'' అంటూ వెళ్లి డ్రింక్స్ ఏర్పాటు చేశాడు. ఇద్దరూ కూర్చుని తాగసాగారు. కాస్సేపటికి చిత్తుగా తాగిన డాగా అసలు సంగతి ఎత్తాడు – ''నువ్వు యిక్కడ ఎంత సంపాదించావో అది చెప్పు'' అని.
''డబ్బా? ఇక్కడ మనశ్శాంతి తప్ప వేరే ఏమీ దొరకదు.'' అన్నాడు కైలాశ్.
''నీ డోరిన్‌ను ఎక్కడ దాచావ్? దుప్పట్లోనా? సరేలే, దాన్నేం చేస్తే నాకెందుకు గానీ డబ్బేం చేశావో చెప్పు. అనాథలకు దానం చేసేశావా?''
''నా దగ్గర డబ్బేమీ లేదు. ఈ వుద్యోగంలో జేబు ఖర్చులకు పదో, పాతికో యిస్తారు తప్ప వేరే జీతమేమీ లేదు..''
''…అబద్ధాలు చెప్పకు.'' అని డాగా ఒక్కసారిగా టీపాయ్ చరిచాడు. ''నాకు ఏభైవేలు కావాలి. నా స్మగుల్డ్ వస్తువులు కొట్టేసి అమ్మేసుకున్నావ్. రేపటికల్లా రెడీ చేయి. లేకపోతే లోకంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుని పిండుకుంటాను.'' అని అరిచాడు.
అతను అన్నంత పనీ చేస్తాడని కైలాశ్‌కు తెలుసు. ''రేపటికి రేపంటే ఎలా? కాస్త టైమివ్వు..'' అని బతిమాలాడు.
''కుదరదు, నువ్విచ్చేదాకా యిక్కడే కూర్చుందును కానీ యివాళ ఓ పార్టీతో డీల్ చేసేదుంది. ఎంత రాత్రయినా సరే వెళ్లాలి. ఇక్కణ్నుంచి వంద కిలోమీటర్ల దూరం. రేపు పనేం లేదు. వచ్చి కూర్చుంటాను. తప్పించుకుందామని అనుకోకు, ప్రాణాలు తీస్తాను..'' కర్కశంగా, కచ్చితంగా చెప్పి డాగా బాత్‌రూమ్‌కు వెళ్లాడు.
కైలాశ్ నీరసంగా లేచి టీ పాయ్ మీద గ్లాసులు, కింద వున్న మ్యాగజైన్లు, నేలమీద చిందరవందరగా పడి వున్న పేపర్లు సర్దాడు. అంతలో అతనికి ఒక అయిడియా వచ్చింది. కొన్ని పేపర్లు పట్టుకెళ్లి డాగా కారు వెనకసీటులో పడేసి వచ్చాడు.
xxxxxxxxx
మర్నాడు పొద్దున్న పాలవాడు కేక వేసేదాకా కైలాశ్‌కు మెలకువ రాలేదు. చూస్తే ఎనిమిదయింది. ''ఏం యింత ఆలస్యం?'' అని గద్దించాడు.
''హైవే మీద యాక్సిడెంటు అయింది సార్. ఓ నల్లకారు చెట్టుని గుద్దేసింది. డ్రైవరు ఒక్కడే వున్నాడు. పాపం చచ్చిపోయాడు.''
''అలాగా! వయసెంత వుంటుందేమిటి?''
''ఏమో సార్, పోలీసులు అతని మొహం మీద న్యూస్‌పేపరు కప్పేశారు!''
xxxxxxxxxxxxx
తన రచనలకు లక్ష్మణే బొమ్మలు వేసుకుంటారు. ఈ కథకూ ఆయనే వేసుకున్నారు. ఇలస్ట్రేషన్ గొప్ప కళ. బొమ్మలు వేయడం వచ్చినంత మాత్రాన అది పట్టుబడదు. ఇలస్ట్రేషన్ వలన కథపై ఆసక్తి రగలాలి తప్ప దానిలో వున్న కీలకాంశం రివీల్ కాకూడదు. కానీ లక్ష్మణ్ యీ కథకు మొదటి పేజీలో వేసిన బొమ్మలో స్టీరింగ్‌కు, డ్రైవర్‌కు మధ్య పేపర్లు అడ్డురావడం బొమ్మ వేసేశారు. నేను కావాలని ఆ భాగాన్ని కట్ చేసి యిక్కడ యిచ్చాను. ఆర్‌కె నారాయణ్ రచనలెన్నిటినో అద్భుతంగా యిలస్ట్రేట్ చేసిన లక్ష్మణ్ యీ కథకు యిలా ఎందుకు చేశారో నాకైతే తట్టటం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)