సన్నాఫ్ సత్యమూర్తి సినిమా బన్నీ ఫ్యాన్స్ కు పండగలా కనిపిస్తోంది. చాలా ఆశలు పెట్టుకున్నారు. రేసు గుర్రం రేంజ్, జులాయి ఎంటర్ టైన్ మెంట్ కలిసి సత్యమూర్తిని ఓ రేంజ్ కు తీసుకెళ్తాయని భావిస్తున్నారు. అభిమానులు ఆ మాత్రం ఆశ పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అభిమానులు సినిమా థియేటర్ల వారీగా కొనుగోలు చేస్తున్నట్లు బోగట్టా. ఇది చాలా జిల్లాల్లో సాధారణమైన సంగతే.
అయితే ఈ కొనుగోలు అన్నది ఓ రేంజ్ దాటిపోయిందని తెలుస్తోంది. రేసుగుర్రం రేట్ల కన్నా చాలా అధికంగా చెల్లించి థియేటర్ల వారీగా ప్రదర్శన హక్కులు కొంటున్నారు. అంటే మరి ఏం రేంజ్ లో సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయో? చూడాలి. ఇటీవల పెద్ద సినిమాలకు వివిధ ప్రభుత్వ శాఖలను మేనేజ్ చేసి, తొలివారం, ఒకటే తరహా టికెట్ ను, అదీ అధికధరలకు అమ్మడం అన్నది అలవాటైంది.
అంటే నేలా బెంచీ అన్నది సంబంధం లేకుండా, మల్టీ ఫ్లెక్స్ మాదిరిగా నూరు, నూటాయాభై వంతున బి సెంటర్లలో కూడా అమ్మడం అన్నమాట. ఈ విధంగా అయినా కూడా పెద్ద హిట్ అయి, వారం పొడవునా, ఎగస్ట్రా సీటింగ్ వేస్తే తప్ప, కిట్టుబాటు కానీ రేట్లకు కొంటున్నారని తెలుస్తోంది. మరి ఇది అభిమానమా? వ్యాపారమా? జూదమా?