ఉడ్తా టాలీవుడ్: రెండో జాబితాలో ‘ఆ ముగ్గురు’?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రవితేజ, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, చార్మి, నవదీప్ లాంటి సినీప్రముఖుల్ని ఇంటరాగేట్ చేసిన సిట్ అధికారులు.. మరో 3 రోజుల్లో ఈ…

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రవితేజ, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, చార్మి, నవదీప్ లాంటి సినీప్రముఖుల్ని ఇంటరాగేట్ చేసిన సిట్ అధికారులు.. మరో 3 రోజుల్లో ఈ వ్యవహారంపై మొదటి ఛార్జ్ షీట్ ను దాఖలు చేయబోతున్నారు. ఇప్పటివరకు విచారించిన వ్యక్తులందరి పేర్లను చార్జిషీట్ లో పెడతామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. అంతేకాదు.. త్వరలోనే మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశముందంటూ చిన్న హింట్ కూడా ఇచ్చారు.

పరిశ్రమలో మరికొంతమందికి కూడా నోటీసులు అందే అవకాశాలున్నాయంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మరో స్మగ్లర్ కమింగాను కూడా అరెస్ట్ చేయడంతో.. కెల్విన్, కమింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా నోటీసులు అందించే ఛాన్స్ ఉంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు ప్రముఖుల్ని కావాలని తప్పించారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఇద్దరు బడా నిర్మాతల కొడుకులు, మరో బడా నటుడి కుమార్తెను కావాలనే జాబితా నుంచి తప్పించారనే విమర్శలు ఎక్కువయ్యాయి. సిట్ విచారణలో భాగంగా కొందరు సినీప్రముఖులు వీళ్ల పేర్లను కూడా బయటపెట్టినట్టు తెలుస్తోంది. అందుకే పార్ట్-2లో భాగంగా వీళ్లకు కూడా నోటీసులు ఇస్తామంటూ పరోక్షంగా సంకేతాలు అందించారు అకున్ సబర్వాల్.

అయితే వీళ్లకు టచ్ చేయడం అంత ఈజీకాదనే విషయం ఇప్పటికే సిట్ కు అర్థమైపోయింది. స్వయంగా అకున్ కు బెదిరింపు కాల్స్ రావడంతో పాటు రాజకీయంగా కూడా ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. పైన చెప్పుకున్న “ఆ ముగ్గురు” వ్యక్తులతో పాటు మరికొందరు పారిశ్రామికవేత్తలు ఇప్పటికే కోటరీగా ఏర్పడి, తెరవెనక వ్యవహారాన్ని చక్కబెడుతున్నారట.