గురు సినిమాతో కెరీర్ లో మరో మంచి హిట్ అందుకున్నాడు వెంకటేష్. వసూళ్ల పరంగా చూసుకున్నా, విమర్శల పరంగా చూసుకున్నా.. ఈ సినిమా హిట్టే. ఇలాంటి సక్సెస్ తర్వాత వెంటనే మరో సినిమా స్టార్ట్ చేస్తే బాగుండేది. కనీసం కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ చేసినా సరిపోయేది. కానీ వెంకీ మాత్రం టోటల్ సైలెంట్ అయిపోయాడు.
గురు సినిమా థియేటర్లలోకొచ్చి ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులైంది. అయినా ఇప్పటివరకు ఇంకో సినిమా ఎనౌన్స్ చేయలేకపోయాడు వెంకీ. నిజానికి వెంకీ నెక్ట్స్ సినిమా చుట్టూ కొంతమంది దర్శకుల పేర్లు వినిపించాయి. గురు సినిమా కంటే ముందే కిషోర్ తిరుమల చెప్పిన కథకు ఓకే చెప్పాడు వెంకీ. ఒకరిద్దరు హీరోయిన్లను కూడా ఫైనలైజ్ చేశారు. కానీ ఎందుకో ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. కిషోర్ తిరుమల ఇప్పుడు మళ్లీ రామ్ తోనే సినిమా చేస్తున్నాడు.
అటు పూరి జగన్నాధ్ కూడా అంతే. గురు సినిమా సెట్స్ పై ఉన్న టైమ్ లోనే పోకిరి స్టయిల్ లో మంచి మాస్ సబ్జెక్ట్ ఒకటి వెంకీకి వినిపించాడనే వార్త బాగానే చక్కర్లుకొట్టింది. కట్ చేస్తే, పూరి జగన్నాధ్ ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.
ఈ లిస్ట్ లో క్రిష్ కూడా ఉన్నాడు. వెంకీ-క్రిష్ కాంబోలో చారిత్రక నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ క్రిష్ ఇప్పుడు కంగనా రనౌత్ హీరోయిన్ గా మణికర్ణిక అనే ప్రాజెక్టు స్టార్ట్ చేసే ప్లాన్స్ లో ఉన్నాడు. దీంతో వెంకీ నెక్ట్స్ సినిమాపై సేమ్ సస్పెన్స్ కొనసాగుతోంది.