రక్తచరిత్ర: తుపాకీ, తూటా.. నేరమెవరిది!

నెత్తురు ఏరులై పారుతోంది. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. హత్యలు, అత్యంత పాశవికమైన హత్యలు. బహుశా శతృదేశాలకు చెందిన సైనికులు పట్టుబడినా, తీవ్రవాదులు పట్టుబడినా ఇంత దారుణంగా చంపే పరిస్థితులు వుండవేమో.. అనేంతలా హత్యలు జరుగుతున్నాయి.…

నెత్తురు ఏరులై పారుతోంది. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. హత్యలు, అత్యంత పాశవికమైన హత్యలు. బహుశా శతృదేశాలకు చెందిన సైనికులు పట్టుబడినా, తీవ్రవాదులు పట్టుబడినా ఇంత దారుణంగా చంపే పరిస్థితులు వుండవేమో.. అనేంతలా హత్యలు జరుగుతున్నాయి. పైకి జరుగుతున్న ప్రచారం మాత్రం 'ఎన్‌కౌంటర్‌ లేదంటే, ఎదురుకాల్పులు'. పోలీసుల వ్యూహాలు పోలీసులకుంటాయి, మావోయిస్టుల వ్యూహాలు మావోయిస్టులకుంటాయి. ప్రభుత్వం చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటారు.. మావోయిస్టులేమో సిద్ధాంతాలని చెబుతుంటారు. ఎవరి దారి వారిదే. అంతా కలిసి సృష్టిస్తున్నది మాత్రం మహా మారణహోమం.!

'మావోయిస్టులకీ, పోలీసులకీ వ్యక్తిగత వివాదాలేమీ లేవు. కక్షలు అసలే లేవు..' ఇది మావోయస్టులు చెప్పేమాట.. పోలీసులు చెప్పేమాట కూడా ఇదే. రాజ్యం హింసను ప్రోత్సహిస్తోంది, ప్రజల తరఫున నిలబడమంటూ మావోయిస్టులు, పోలీసులకు ఉచిత సలహాలు ఇవ్వడం చూస్తున్నాం. తుపాకీ పట్టుకుని, చట్టాల్ని ఉల్లంఘించడం సబబుకాదు.. జన జీవన స్రవంతిలోకి రమ్మని పోలీసులు సూచించడమూ చూస్తున్నాం. ఇది ఇప్పటి మాటకాదు. ఇప్పుడు కొత్తగా మొదలైన మారణహోమం అసలే కాదు. కానీ, రక్తపాతం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే వుంది. నదుల్లో నీరు ఆవిరైపోతుందేమోగానీ, ఈ మారణహోమం అనే నదిలో మాత్రం, రక్తం ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువగా పారుతోంది. ఈ మారణహోమానికి ముగింపు ఎక్కడ.? ఎవరు ముందుగా ఈ మారణహోమాన్ని ఆపాల్సి వుంటుంది.? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు.

పోలీసులు, గిరిజనులపై దాడులు ఆపాలంటారు మావోయిస్టులు. మావోయిస్టులు తుపాకీలు వదలనిదే ఈ యుద్ధం ఆగదంటారు పోలీసులు. మళ్ళీ వ్యవహారం మొదటికొచ్చేస్తోంది. కోడి ముందా.? గుడ్డు ముందా.? అన్న చర్చకు ఆస్కారమిస్తుంటుంది. ఓ మనిషి ఇంకో మనిషిని చంపడం నేరం. అదే, ఉద్యమం పేరు చెప్పి చేస్తే నేరం కాదు. అదే, ఉద్యోగ ధర్మంలో భాగంగా చేస్తే నేరం కాదు. అదెలా.? అక్కడ ప్రాణం పోతోంది కదా.! ఈ ఇంగితమే అందరిలోనూ కొరవడ్తోంది. 'పెద్ద పాత నోట్లరద్దుతో మావోయిస్టులకు దిక్కుతోచడంలేదు.. టెర్రరిస్టులకు ఊపిరాడటంలేదు..'అని కేంద్రం గొప్పగా చెప్పు కుంది. అక్కడ కాశ్మీర్‌లో మారణహోమం కొనసాగుతోంది.. ఇక్కడ, దేశం నడిబొడ్డున మావోయిస్టులు – పోలీసులకు మధ్య నెత్తుటి క్రీడకి ఆకాశమే హద్దు.. అన్నట్లుగా వుంది. ఏదీ, ఎక్కడ.? హింస తగ్గిందెక్కడ.? మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందెక్కడ.? తీవ్రవాదం తగ్గిందెక్కడ.?

తాజాగా ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు 25మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకోవడంతో కేంద్రం రగిలిపోతోంది. భారీ మూల్యం మావోయిస్టులు చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది. అంటే, రానున్న రోజుల్లో మరో నెత్తుటి క్రీడను చూడబోతున్నామన్నమాట. మొన్నీ మధ్యనే ఆంధ్రా – ఒరిస్సా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుమారు 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. 'మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది, ఇక దేశంలో మావోయిస్టులుకు చోటులేదు..' అని అంతా అనుకుంటున్న తరుణంలోనే, ఒకదాని తర్వాత ఒకటి.. వరుసగా కొద్ది రోజుల గ్యాప్‌తోనే రెండు దెబ్బలు తగిలాయి పోలీసులకి. ల్యాండ్‌మైన్‌ పేల్చి, మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మట్టుబెట్టిన ఘటన ఒకటి, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను ఉచ్చులోకి లాగి, సృష్టించిన తాజా మారణ హోమం ఇంకొకటి. అంటే, ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని ఎలాఅనుకోగలం.? ముందే చెప్పుకున్నాం కదా, ఎవరిగోల వారిదే. హింస ఎట్నుంచి మొదలైంది, ఎట్నుంచి కొనసాగుతోంది.? అన్న ప్రశ్నలకు సమాధానం వెతకడం అంత తేలిక కాదు. 

మావోయిస్టులకీ, పోలీసులకీ మధ్య వ్యక్తిగత కక్షలులేవన్న మాట వాస్తవం. మరెందుకు, ఈ హింస జరుగుతోంది.? ఓ భారతీయుడు, ఇంకో భారతీయుడ్ని అత్యంత కిరాతకంగా ఎందుకు చం పాల్సి వస్తోంది.? అంటే, కథ మళ్ళీ మొదటికే వస్తుంది. 'మా పోరాటం ప్రభుత్వమ్మీదనే..' అని చెప్పుకునే మావోయిస్టులు, పోలీసుల ప్రాణాల్ని తీయడంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అదే సమయంలో, బూటకపు ఎన్‌కౌంటర్ల విషయంలో పోలీసులూ వ్యవస్థకు సమాధానం చెప్పితీరాలి. వాళ్ళు చెప్పరు, వీళ్ళు అసలే చెప్పరు. అందుకే, ఇది రావణకాష్టంగా ఎప్పటికీ రగులుతూనే వుంటుంది. దేశంలో నీటికొరత వుంటుందేమోగానీ, ఏరులై పారడానికి రక్తం కొరత మాత్రం వుండదు.. పేలడానికి తూటాల కొరత అసలే వుండదు. పేల్చడానికి మావోయిస్టులు, పోలీసులూ.. ఇద్దరూ అత్యుత్సాహమే ప్రదర్శిస్తున్నారు కాబట్టి, ఈ మారణహోమం కొనసాగుతూనే వుంటుంది.. ఎందాకా.? అంటే, ఎందాకైనాసరే.!

వెంకట్ ఆరికట్ల