పాపం, నిర్మాత బన్నీ వాస్ టైమ్ నడవడం లేదు. సరైన హిట్ కొడదాం అన్న కోరిక అందకుండా ఊరిస్తూనే వుంది. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక్కటీ సరిగ్గా కలిసిరావడం లేదు.
ఇలాంటి టైమ్లో కోటబొమ్మాళి పిఎస్ సినిమాను స్టార్ట్ చేసారు. నిజానికి ఈ సినిమాను తెలుగులోకి అందించడం కాస్త రిస్క్ నే. ఎందుకంటే కమర్షియల్ కథ కాదు, సినిమా కాదు. కానీ మంచి సినిమా ను జనం ఆదరిస్తారు అనే నమ్మకంతో బన్నీ వాస్ రంగంలోకి దిగారు.
సినిమా కోసం చేసిన ఓ పాట వైరల్ అయిపోయింది. జనం దృష్టి ఈ సినిమా మీదకు బాగా వచ్చేసింది. అలాంటి టైమ్ లో మాంచి సోలో డేట్ కూడా దొరికింది. నవంబర్ 24. అంతా బాగుంది అనుకంటే కథ అడ్డం తిరిగేలా వుంది. ఇప్పుడు అదే డేట్ లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమా వస్తోంది.
రెండు సినిమాలే కదా, వేరు వేరు జానర్లు కదా, ఇలా కారణాలు చెప్పుకోవడానికి అనేకం వుండొచ్చు. కానీ ఓపెనింగ్ టికెట్ చిన్న సినిమాలకు సోలోగా వస్తేనే తెగడం కష్టం. అలాంటిది అటు శ్రీలీల-వైష్ణవ్ తేజ్.. పాటలు, ఫైట్లు, డ్యాన్స్ లు అంటే దృష్టి అటే వుంటుంది. ఓపెనింగ్ అటే పడుతుంది.
ఇలాంటి టైమ్ లో నిలదొక్కుకోవాలి అంటే యునానిమస్ పాజిటివ్ టాక్ తో పాటు, చూడాలి అనిపించేలా వుండాలి. అప్పుడు మాత్రమే ఆ పోటీని తట్టుకోగలదు. డేట్ వేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వేసి వుంటే బాగుండేదేమో?