ఈ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఫొటో చూస్తే చాలామంది గుర్తుపడతారు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తనదైన గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ బాలాజీ కన్నుమూశారు.
48 ఏళ్ల బాలాజీకి తీవ్రమైన గుండెపోటు రావడంతో, హుటాహుటిన అతడ్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఆయన టక్ జగదీశ్, ఘర్షణ, చిరుత లాంటి సినిమాల్లో నటించారు.
సీనియర్ నటి రాధిక నిర్మించి నటించిన ఓ తమిళ సీరియల్ లో కీలక పాత్ర పోషించారు బాలాజీ. ఆ సీరియల్ లో అతడు పోషించిన డేనియర్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలా డేనియల్ బాలాజీ అయ్యారు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ ఆయన్ను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మార్చారు. కాక్క కాక్క సినిమాలో సూర్యతో కలిసి పోలీసాఫీసర్ గా నటించారు.
తమిళ్ లో అవకాశాలు వస్తున్న టైమ్ లోనే తెలుగులో సాంబా సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా కంటే, చిరుత సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక మలయాళంలో బ్లాక్ అనే సినిమాతో అడుగుపెట్టారు. ఇలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 40కి పైగా చిత్రాల్లో నటించిన డేనియర్ బాలాజీ, 48 ఏళ్ల వయసులో కన్నుమూయడం బాధాకరం.
తెరవెనక హీరో… బాలాజీ ఓ విలన్ గా మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఆయన తెరవెనక చాలా మంచి మనిషి అంటారు చాలామంది. కెరీర్ ప్రారంభంలో సందీప్ కిషన్ కు ఎన్నో విధాలుగా సాయం చేశారు. సందీప్ కిషన్ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నప్పుడు, స్వయంగా బాలాజీ రిఫరెన్స్ ఇచ్చి సందీప్ ను ఎన్నో ఆడిషన్స్ కు పంపించారట.
ఇక దర్శకుడు మోహన్ రాజాకు కూడా డేనియల్ బాలాజీ స్ఫూర్తి. తను ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరడానికి బాలాజీనే కారణమని చెప్పుకొచ్చారు మోహన్ రాజా. ప్రతిసారి తనలో స్ఫూర్తిని నింపిన మంచి మనిషని చెప్పుకొచ్చాడు.
తను చనిపోయినా, తన కళ్లు జీవించే ఉండాలని భావించారు డానియల్ బాలాజీ. అందుకే తన కళ్లను దానం చేశారు. అతడి చివరి కోరిక కూడా అదే. అందుకే చనిపోయిన వెంటనే బాలాజీ నేత్రాల్ని వైద్యులు సేకరించారు. అతడి చివరి కోరికను నెరవేర్చారు.