తన కంటే వయసులో 18 ఏళ్ల పెద్దవాడైన నటుడు రాహుల్ దేవ్(52)తో నటి ముగ్దా గాడ్సే సహజీవనం చేస్తోంది. వీరి ప్రేమ బంధానికి త్వరలో 8 ఏళ్లు నిండనున్నాయి. జూమ్‌లో మాట్లాడిన ముగ్దా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తమ బంధానికి వయోభేదం అడ్డంకి కాలేదన్నారు. తామెంతో సంతోషంగా ఉంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇది తన స్వీయానుభవంతో చెబుతున్నానన్నారు. భాగస్వామిని ఎంచుకోవడం అంటే షాపింగ్ చేయడం లాంటిది కాదన్నారు.
ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య పుడుతుందో ఎవరికీ తెలియదని ఆమె సెలవిచ్చారు. ప్రేమ అనేది ఎవరికైనా అనుభవంలోకి వస్తే దాని అనుభూతి అర్థం కాదన్నారు. ప్రేమకు, వయసుకు అసలు సంబంధం ఉండదని ముగ్ద మనోహరంగా చెప్పుకొచ్చారామె.
ఇదిలా ఉండగా విలన్‌గా రాహుల్ దేవ్ మంచి గుర్తింపు పొందాడు. ఈయన భార్య రీనా 2009లో క్యాన్సర్‌తో మృతి చెందింది. వీరికి సిద్ధాంత్ అనే కుమారుడున్నాడు. భార్య మరణంతో ఒంటరి జీవితం గడుపుతున్న రాహుల్‌కు ఓ పెళ్లిలో ముగ్దా పరిచయం ప్రేమ, ఆ తర్వాత సహజీవనానికి దారి తీసింది.
వయసులో 18 ఏళ్ల పెద్ద వాడైన రాహుల్‌తో ముగ్ద సహజీవనంపై గతంలో అనేక విమర్శలొచ్చాయి. కానీ వాటిని ఆ జంట లెక్కచేయకుండా హాయిగా ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.