హిందీ చిత్రసీమలో రచయితగా, విలన్‌గా, కారెక్టర్ యాక్టర్‌గా, కమెడియన్‌గా ఖ్యాతి పొందిన కాదర్ ఖాన్ గతించి రెండు సంవత్సరాలైంది. తెరపై కాదర్‌ను చూడగానే చికాకు వేసేది. పర్శనాలిటీ, కంఠస్వరం బావున్నా, రూపం బాగుండదు. మొహమంతా గంట్లు కొట్టినట్లు వుండేది. గోవిందా, యితనూ కలిసి వేసిన సినిమాల్లో యిద్దరూ కామెడీ అంటూ లొడలొడ మాట్లాడుతూ కంపరం పుట్టించేవారు.
సినిమా తెరకు కావలసిన అండర్‌యాక్టింగ్ ఏ కోశానా కనబడేది కాదు. ఏదో నాటకమో, తమాషాయో చూస్తున్న ఫీలింగు కలిగేది. ఇతని హాస్యం చాలా లౌడ్‌గా వుండడంతో బాటు డైలాగుల్లో అశ్లీలత, ద్వందార్థాలు కొట్టవచ్చినట్లు కనబడేవి. అతను మంచి పవర్‌ఫుల్ రచయిత అని తెలిసి గౌరవించినా, కమ్మర్షియల్ సినిమాలలో విలువలు దిగజారడంతో అతనూ దిగజారాడని అనుకునేవాణ్ని. అతను చనిపోయాకే చాలా విషయాలు తెలిశాయి.
అతను అఫ్గనిస్తాన్‌కు చెందిన పఠాన్. 1937లో కాబూల్‌లో పుట్టాడు. అక్కడ గడవక కుటుంబం బొంబాయికి తరలి వచ్చింది. దారిద్ర్యం వలన కాబోలు, కామాటిపురా అనే ప్రాంతంలో నివసించేది. అది రెడ్‌లైట్ ఏరియా. దొంగసారాయి, గంజాయి అమ్మేవాళ్లు, తార్పుడుగాళ్లు, వేశ్యలు, సకల రకాలైన నేరగాళ్లు రాత్రీ, పగలూ తేడా లేకుండా తిరిగే చోటది. ఇతనికి నాలుగేళ్లుండగా తలిదండ్రులు విడిపోయారు. తల్లి మారుమనువు వలన దాపురించిన సవతి తండ్రి రోజూ తాగొచ్చి ఇతన్ని చావగొడుతూ వుండేవాడు.
ఇలాటి వాతావరణంలో పెరిగినా కాదర్ బాగా చదువుకుని సివిల్ ఇంజనీరింగ్ పాసయ్యాడు. చుట్టూ వున్న వాతావరణాన్ని తట్టుకోవడానికి అతను సాహిత్యాన్ని, మతాన్ని, నటనను ఆశ్రయించాడు. అవే అతనికి పేరు తెచ్చిపెట్టాయి. ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించాడు. నటనపై యిష్టం వున్నా, తనకు అవకాశాలు యిచ్చేవాళ్లు ఎవరూ లేరు కాబట్టి దగ్గర్లో వున్న యూదుల స్మశానానికి వెళ్లి, సమాధుల నుద్దేశించి, డైలాగులు చెపుతూ, తన వాయిస్‌ను మెరుగు పరుచుకునేవాడు. అది చూసి నాటకసమాజాలు తమ ట్రూపులో చేర్చుకున్నాయి.
చదువు పూర్తయ్యాక తను చదువుకున్న సాబూ సిద్దిఖ్ కాలేజీలోనే మాథమాటిక్స్, అప్లయిడ్ మెకానిక్స్ లెక్చరరుగా చేరాడు. హాబీగా నాటకాలు రాస్తూ, ప్రదర్శిస్తూ వుండేవాడు. విదేశీ భాషల్లో వున్న క్లాసిక్స్‌ను ఉర్దూ నాటకాలుగా మలిచి, దానిలో వేషాలు వేస్తూ హిందీ సినిమారంగంలో ప్రముఖుల దృష్టిని ఆకర్షించాడు. రాజీందర్ బేదీ ‘‘జవానీ దివానీ’’ (1972) సినిమా తీస్తూ డైలాగులు రాయించుకుని రూ.1500 యిచ్చాడు. ‘‘దాగ్’’ (1973)లో చిన్న వేషం వేశాడు. దిలీప్ కుమార్ యితని నటనను మెచ్చి తన ‘‘సగీనా’’ (1974), ‘‘బైరాగ్’’ (1976) సినిమాల్లో చిన్న పాత్రలు యిప్పించాడు. ‘‘జవానీ దివానీ’’ సినిమా హిట్ కావడంతో ‘‘రఫూ చక్కర్’’ (1972) ‘‘ఖేల్ ఖేల్ మేఁ’’ (1972) సినిమా డైలాగులు రాయించుకుని తలా రూ.21000 యిచ్చారు.
డిమాండ్ పెరగడంతో అతను ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమారంగాన్ని నమ్ముకున్నాడు. రాజేశ్ ఖన్నాకు యితని డైలాగులు బాగా నచ్చి తన ‘‘రోటీ’’ (1974) సినిమాకు రాయించుకుని, దర్శకనిర్మాత మన్‌మోహన్ దేశాయి చేత లక్ష రూపాయలు యిప్పించాడు. అదీ హిట్టే. అదే సమయంలో వచ్చిన అమితాబ్ సినిమా ‘‘బేనామ్’’ (1974) కూడా హిట్టే. ఇక అప్పణ్నుంచి మన్‌మోహన్ సినిమాలన్నిటికీ ‘‘సుహాగ్’’, ‘‘ధర్మవీర్’’, ‘‘అమర్ అక్బర్ ఆంథోనీ’’, ‘‘నసీబ్’’, ‘‘కూలీ’’ లతో సహా, యితనే ఆస్థాన రచయిత.
మన్‌మోహన్‌తో పోటీగా సినిమాలు తీసిన ప్రకాశ్ మెహ్రా కూడా ఇతని చేత ‘‘అదాలత్’’, ‘‘ఖూన్ పసీనా’’, ‘‘ముకద్దర్ కా సికందర్’’ ‘‘లావారిస్’’, ‘‘శరాబీ’’ సినిమాలకు రాయించుకున్నాడు. మొదట్లో కాదర్ కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ యిచ్చాడు. ‘‘శాలీమార్’’ (1978) సినిమా హిందీ వెర్షన్‌కు మాటలు రాయడమే కాక, ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు రెక్స్ హారిసన్‌కు హిందీ డబ్బింగ్ చెప్పాడు.
ఇలా ఆఫర్లు వచ్చిపడుతున్నా చాలా క్రమశిక్షణతో, ఎవర్నీ ఎప్పుడూ యిబ్బంది పెట్టకుండా రాస్తూ రీమేకులు చేసే దక్షిణాది నిర్మాతలను, దర్శకులను ఆకర్షించాడు. ఎందుకంటే వాళ్ల చేతిలో మొత్తం స్క్రిప్టు వుంటుంది. లోకల్ ఫ్లేవర్‌తో హిందీలో డైలాగులు రాసి, గబగబా యిస్తే చాలు. అప్పటిదాకా వుండే హుందా పద్ధతి డైలాగులు మార్చేసి, బజారు భాషలో డైలాగులు రాయడం కాదర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందువలన అవి సౌత్ వాసన కొట్టకుండా, పక్కా లోకల్ అనిపించే విధంగా అనుకున్న సమయానికి రాసి యిచ్చేవాడు.
బొంబాయివాళ్లతో వ్యవహారమంటే టైము వేస్టవుతుందని భయపడే దక్షిణాది నిర్మాతలకు కాదర్ కొంగుబంగారంలా కనబడ్డాడు. పైగా బాగా చదువుకున్నవాడు. భావమేమిటో ఇంగ్లీషులో చెప్తే శుబ్భరంగా అర్థం చేసుకుని మెరుగులు దిద్దగలవాడు. అందుకే మనవాళ్లందరూ అతని చేతే రాయించుకున్నాడు. అతనికి కూడా దక్షిణాది వాళ్ల క్రమశిక్షణ, కరక్టుగా పేమెంటు యిచ్చే పద్ధతి బాగా నచ్చాయి. అందుకే రాఘవేంద్రరావు, బాపయ్య, దాసరి.. వీళ్లందరూ అతనికి ఆత్మీయులే.
ఈ సినిమాలతో సంపర్కం కారణంగానే విలనీని, కామెడీని కలపవచ్చని కాదర్‌కు తోచివుంటుంది. తమిళ సినిమాల్లో ఎంఆర్ రాధా (రాధిక తండ్రి) రోజుల్నించి అలా కలిపేవారు. దాన్ని తెలుగులో నాగభూషణం విజయవంతంగా అమలు చేశారు. అదే వరవడిలో రావు గోపాలరావు వెళ్లారు. ఈ పద్ధతి నచ్చి అప్పటిదాకా విలన్ వేషాలు వేస్తూ వచ్చిన కాదర్ ఖాన్ ‘‘హిమ్మత్‌వాలా’’లో కామెడీ ప్రయత్నించాడు.
ఇక ఆపై హిందీలో అటువంటి పాత్రలు వేసి పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఎన్టీయార్ ‘‘కథానాయకుడు’’ని హిందీలో ‘‘అప్నా దేశ్’’గా తీసినప్పుడు నాగభూషణం పాత్ర ఓం ప్రకాశ్ వేశారు. కానీ తెలుగులో పండినట్లుగా హిందీలో ఆ వేషం పండలేదు. కానీ కాదర్ హిందీలో యీ బ్రాండ్ పాత్రలకు పెట్టినది పేరై పోయాడు. ఇక డేవిడ్ ధావన్ సినిమాల్లో గోవిందాతో కలిసి వేషాలు వేస్తూ పామరజనాన్ని బాగా ఆకట్టుకున్నాడు.
రచయితగాను, నటుడిగానూ చాలా బిజీగా వుంటూన్న రోజుల్లోనే అతనికి తన ఇస్లాం మతం గురించి ఏదైనా చేయాలని తోచింది. కెకె (కాదర్ ఖాన్) ఫౌండేషన్ అని పెట్టి ధార్మికసాహిత్య కార్యక్రమాలు మొదలుపెట్టాడు. మదరసాలలో నేర్పే అరబిక్ పాఠాలకు, కురాన్ పఠనానికి వున్న సిలబస్ రీడిజైన్ చేయాలనుకున్నాడు. దాని కోసం ఉస్మానియా యూనివర్శిటీ నుంచి అరబిక్‌లో మాస్టర్స్ చేశాడు. ముంబయి, హైదరాబాదు, దుబాయి, టొరెంటో (కెనడాలో అతని కొడుకు పని చేసే చోట) ఇస్లామిక్ రిసెర్చి సెంటర్లు నెలకొల్పాడు.
అక్కడ అరబిక్, ఉర్దూ, పర్షియన్, హిందీలు నేర్పుతారు. పరిశోధనలు చేద్దామనుకునేవారికి స్కాలర్‌షిప్‌లు యిస్తారు. అక్కడ ఇస్లామిక్ గ్రంథాల మీదే కాక, భగవద్గీత, యితర సంస్కృత హిందూ పురాణాలపై కూడా రిసెర్చి చేస్తూంటారు. వాటిని ఉర్దూలోకి తర్జుమా చేస్తూంటారు. చాలాకాలం పాటు సినిమాల్లో వేశాక కాదర్ టీవీ సీరియళ్లలో కూడా వేశాడు. 2015లో ‘‘హోగయా దిమాగ్ కా దహీ’’ అనే సినిమా అతని ఆఖరిది. అప్పటికే అతనికి 79 ఏళ్లు. భార్యతో సహా కెనడా వెళ్లిపోయి కొడుకు దగ్గర వుంటూండగా 2018 డిసెంబరు 31న చనిపోయాడు.
నాలుగు దశాబ్దాల అతని కెరియర్‌లో అతను బాధపడే సందర్భం ఒకటి జరిగింది. మన్‌మోహన్ దేశాయి డైరక్టు చేసిన ‘‘గంగా జమునా సరస్వతి’’ (1988)కు అతను రచయితగా, నటుడిగా వున్నాడు. ఆ సినిమా సెట్స్‌పై వుండగా దక్షిణాది నుంచి ఒక నిర్మాత వచ్చి కాదర్‌ను ‘‘సారున్నారా?’’ అని అడిగాడు. కాదర్‌కు యీ సారెవరో తెలియలేదు. ‘ఎవరు?’ అని అడిగితే ఆ నిర్మాత ‘పెద్ద సారు’ అన్నాడు తప్ప పేరు చెప్పలేదు. మూడోసారి అడగ్గా ‘అమితాబ్ సార్’ అన్నాడు.
అప్పుడు కాదర్ నవ్వి ‘మేం ఆయన్ని యిక్కడ సార్ అని పిలవం. అమిత్ అంటామంతే’ అని జోక్ చేశాడు. ఈ విషయం ఆ నిర్మాత వెళ్లి అమితాబ్‌కు చెప్పడంతో అతనికి కోపం వచ్చింది. కాదర్‌ను సినిమానుంచి తీసేయాలని పట్టుబట్టాడు. మన్‌మోహన్ తీసేశాడు కూడా. కథారచనలో అతని పేరు కనబడుతుంది కానీ డైలాగు రచయితగా వేరే అతని పేరు కనబడుతుంది. వేషం ఎలాగూ పోయింది. కొసమెరుపు ఏమిటంటే ఆ సినిమా ఫ్లాపయింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
[email protected]