ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాలను రాష్ట్ర ఉన్నతాధికారులు ఉప్ ఉప్ అంటూ బేఖాతర్ చేశారు. ఏపీలో జగన్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వార్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ వద్దంటున్నా ఎస్ఈసీ మాత్రం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ నేటి సాయంత్రం జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు ఆదేశాలిచ్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్లు, కొంత మంది జిల్లాస్థాయి అధికారులు మాత్రమే హాజరయ్యారు. కానీ సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కొన్ని జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు.
సాయంత్రం ఐదు గంటల వరకు వారి హాజరు కోసం ఎదురు చూస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కాగా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని ఎస్ఈసీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో, సీఎస్ స్పందిస్తూ… వాయిదా వేసుకోవాలని కోరారు.
ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సీఎస్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. అంతేకాదు, వ్యాక్సినేషన్, ఎన్నికలపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదికగా సీఎస్‌కు రాసిన ప్రత్యుత్తర లేఖలో ఎస్ఈసీ పేర్కొనడం గమనార్హం.
అందరి సహకారంతోనే ఎన్నికలను పూర్తి చేయగలుగుతామని ఆ లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో అధికారుల సహాయ నిరాకరణ విషయమై హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఎస్ఈసీ ఉన్నట్టు సమాచారం.