చంద్రబాబుకు వత్తాసు పలికేందుకు, ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థించేందుకు పవన్ కల్యాణ్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. వైసీపీని తిట్టడానికి ఎప్పుడూ ముందుండే ఈ పార్ట్ టైమ్ పొలిటీషియన్.. విమర్శలు చేసే క్రమంలో కనీసం ఆలోచించడం లేదు. తను మాట్లాడే మాటల్లో లాజిక్ ఉందో లేదో చెక్ చేసుకోవడం లేదు.
ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం పవన్ కల్యాణ్ తీసిన లాజిక్ ఏంటో తెలుసా? కరోనా టైమ్ లో వైసీపీ నాయకులు పుట్టినరోజులు చేసుకున్నారట. ఎన్నికలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు పవన్ కల్యాణ్. వ్యక్తిగత స్థాయిలో జరిగే పుట్టినరోజు వేడుకను, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికల్ని ఒకే గాటన కట్టిన అపర మేధావి మన పవన్.
పుట్టినరోజు జరుపుకోవడం అనేది వ్యక్తిగతం. ఆ వేడుకకు హాజరుకావాలా వద్దా అనేది కార్యకర్తల ఇష్టం. కానీ ఎన్నికలు అలా కాదు కదా. ఓటు వేయడం ఓటర్ బాధ్యత. నిజంగా పవన్ చెప్పినట్టు వైసీపీ నేతల పుట్టినరోజు వేడుకల్లో కరోనా సోకితే అది కార్యకర్తలు-ఆ నాయకులకే నష్టం. మరి ఎన్నికల నిర్వహణలో జరగరానిది జరిగితే అప్పుడేంటి పరిస్థితి? ఎవరికి నష్టం?
ఇలా లాజిక్ లేకుండా విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు తాజాగా కేరళలో జరిగిన ఉదంతం తెలియదా? స్థానిక ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య అమాంతం పెరిగిన విషయాన్ని పవన్ గుర్తుకు తెచ్చుకుంటే మంచిది.
కేవలం చంద్రబాబు ఎజెండాను సమర్థించేందుకు మాత్రమే పవన్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇకనైనా జనసేనాని ఓ విమర్శ చేసేటప్పుడు ముందువెనక ఆలోచించుకుంటే మంచిది.