సువిశాల భారతదేశాన్ని పాలించాలంటే నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, ఆప్యాయంగా దీదీగా పిలుచుకునే మమతాబెనర్జీ ఆకాంక్షించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో ఆరు కిలోమీటర్ల పాదయాత్రను ఆమె నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమత మాట్లాడుతూ ఆంగ్లేయులు కోల్‌కతా నుంచే యావత్ దేశాన్ని పాలించారన్నారు.
ఇప్పుడు కూడా దేశానికి ఒకే రాజధాని ఎందుకుందని ఆమె ప్రశ్నించారు. సువిశాల భారతదేశానికి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిశల్లో నాలుగు రాజధానులు ఎందుకు ఉండకూడదని ఆమె గట్టిగా ప్రశ్నించారు. రొటేషన్ పద్ధతిలో నాలుగు రాజధా నులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
ఇప్పటికైనా మన ఆలోచనా ధోరణి మారాలని పిలుపునిచ్చారు. ఒకే నాయకుడు.. ఒకే దేశం విధానం వద్దని, పార్లమెంట్లో ఎంపీలంతా నాలుగు రాజధానుల డిమాండ్‌ను లేవనెత్తాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ నేతలకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నేతాజీ గుర్తొస్తారని తూర్పారపట్టారు.