మొదటి రోజుకే అడ్వాన్స్ బుకింగ్స్ లో చతికిలపడిన ఫ్యామిలీ స్టార్, రెండో రోజుకు మరింత ఘోరంగా తయారైంది. బుక్ మై షోలో ఓ మోస్తరుగా బుక్ అయిన స్క్రీన్స్ ను వేళ్లపై లెక్కించొచ్చు. ఇక హౌజ్ ఫుల్ సంగతి దేవుడెరుడు. వీకెండ్ లోనే పరిస్థితి ఇలా ఉందంటే, సోమవారం నుంచి ఈ సినిమా పరిస్థితేంటనేది అగమ్యగోచరంగా మారింది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. సాయంత్రానికి అది కాస్తా నెగెటివ్ టాక్ గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ తమ సినిమాకు కనెక్ట్ అవుతున్నారంటూ యూనిట్ చెప్పుకున్నప్పటికీ, బుకింగ్స్ లో ఆ ట్రెండ్ కనిపించడం లేదు.
అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడంతో, ఫ్యామిలీ స్టార్ సినిమాకు మొదటి రోజు అటుఇటుగా ఐదున్నర కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. విజయ్ దేవరకొండ గత చిత్రం ఖుషి ఓపెనింగ్ తో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ.
ట్రేడ్ లెక్కల్లో చెప్పాలంటే, మొదటి రోజు ఫ్యామిలీ స్టార్ మూవీ కేవలం 10శాతం మాత్రమే రికవర్ అయింది. ఇది బ్రేక్ ఈవెన్ అవ్వావాలంటే కచ్చితంగా పుంజుకోవాల్సిందే. అటు టిల్లూ స్క్వేర్ సినిమా మాత్రం అస్సలు తగ్గడం లేదు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి కీలకమైన సెంటర్లలో ఫ్యామిలీ స్టార్ కంటే ఎక్కువగా టిల్లూకే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.
ఫ్యామిలీ స్టార్ ను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు త్వరలోనే ఇంటింటి ప్రచారం చేపట్టబోతోంది యూనిట్. దీనికి సంబంధించి ఓ ఫామ్ ఇస్తున్నారు. అది నింపి వాళ్లకు పంపిస్తే, అందులోంచి కొన్ని ఎంపిక చేసి, వాళ్ల ఇంటికి నేరుగా విజయ్ దేవరకొండ, మృణాల్ వెళ్తారు. అలా కొన్ని ప్రాంతాల్లో ఇంటింటి పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదేమైనా ఫలితాన్నిస్తుందేమో చూడాలి.