ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తనపై చేసిన విమర్శలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘాటైన సమాధానం ఇచ్చారు. బద్వేలులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన షర్మిల తన వెంట వివేకా కుమార్తె సునీతను వెంటబెట్టుకున్నారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు మాట్లాడుతూ వివేకాను చంపిన హంతకుడు అవినాష్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
అవినాష్‌రెడ్డిపై షర్మిల చేసిన విమర్శ ఏంటో ఆమె మాటల్లోనే… “ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడింది. మరోవైపు ఆయన తమ్ముడు వివేకానందరెడ్డిని హతమార్చిన అవినాష్‌రెడ్డి ఉన్నారు. హత్య చేసిన వారికే జగనన్న మళ్లీ టికెట్ ఇచ్చారు. అలాంటి వాళ్లను గెలిపించాలా? న్యాయం కోసం నిలబడిన రాజశేఖరరెడ్డి బిడ్డను గెలిపించాలా? అనేది మీరే ఆలోచించండి” అని షర్మిల విజ్ఞప్తి చేశారు.
షర్మిల, సునీత ఒకే రకమైన విమర్శలు చేశారు. ఇద్దరికీ కలిపి అవినాష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే…
“వివేకాను నేను చంపానని వారు చేస్తున్న విమర్శలు వినడానికే భయంకరంగా వుంది. ఇలాంటి ఆరోపణలు తగదు. వారి విజ్ఞతకే వదిలేద్దాం. ఎలా వుంటుందంటే… మసి పూస్తారు, లేదా బురద వేస్తారు…దాన్ని కడుక్కోమంటారు. ఇలా తుడుచుకుంటూ పోతే తిడుతూనే వుంటారు. దీని గురించి చర్చే అవసరం లేదు. మాట్లాడే వాళ్లు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ మనిషి పుట్టుకే అయితే తప్పకుండా విజ్ఞత, విచక్షణ , ఇంగిత జ్ఞానం వుండాలి” అని ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు.
షర్మిల, సునీత ఇష్టానుసారం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అవినాష్‌రెడ్డి హంతకుడని అక్కాచెల్లెళ్లు ఏకంగా తీర్పులిస్తున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిల, ఏదో రకంగా ప్రత్యర్థిని బద్నాం చేసి, తాను గెలవాలని పరితపిస్తున్నారు. ఇందుకు ఏం మాట్లాడ్డానికి షర్మిల రెడీ అయ్యారు. ఆమె తీరును జనం అసహ్యించకుంటున్నారు. అందుకే అవినాష్‌రెడ్డి మనిషి పుట్టుక పుట్టి వుంటే అని తీవ్రంగా స్పందించడాన్ని గమనించొచ్చు.