హిట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్‌గా డిజప్పాయింటింగ్ ఫస్ట్ హాఫ్!
గత రెండు మూడేళ్లుగా దేదీప్యమానంగా శోభిల్లుతోన్న తెలుగు సినిమా విపణి ఈ ఏడాది తొలి సగంలో మాత్రం ఆశించినంత గొప్పగా సాగలేదు. ఆరు నెలలలో దాదాపు మూడు నెలల పాటు బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల కరవు తాండవించగా, పెద్ద సంఖ్యలో పెద్ద సినిమాలు విడుదల కాని లోటు బాగా ఇబ్బంది పెట్టింది.
షాకింగ్ స్టార్ట్!
బయోపిక్స్‌కి ఇండియన్ సినిమాలో లభిస్తోన్న ఆదరణకి తోడు, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథపై వుండే ఆసక్తి 'ఎన్టీఆర్'కి విజయాన్ని కట్టబెడుతుందని అంచనా వేసారు. కానీ ఈ యేడాదికి తొలి చిత్రంగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ మొదటి భాగం 'కథానాయకుడు' అన్ని అంచనాలని తల్లక్రిందులు చేస్తూ అనూహ్యంగా పరాజయం పాలయింది. 'మహానటి' నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు బాగా వుండడంతో బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ రేట్లకి అమ్ముడయింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత బాలకృష్ణ, క్రిష్ కలిసి 'ఎన్టీఆర్'తో చరిత్ర సృష్టిస్తారని అనుకుంటే రెండవ భాగాన్ని విడుదల చేస్తారా, లేదా అనేంత దారుణమైన పరాజయం పాలయింది.
'కథానాయకుడు' ఫెయిల్యూర్‌నుంచి కోలుకోక ముందే బోయపాటి శ్రీను – రామ్ చరణ్ కలిసి మరో షాకిచ్చారు. మూస సినిమా తీసినా కానీ పాస్ అయిపోయే సీజన్‌లో వచ్చిన ఈ మాస్ చిత్రం అంచనాలని అందుకోలేకపోవడం అటుంచి ప్రేక్షకులని చిత్ర హింసలకి గురి చేసింది. సంక్రాంతికి రావడం వల్ల భారీ డిజాస్టర్‌ని తప్పించుకోగలిగినా కానీ 'రంగస్థలం' తర్వాత ఈ చిత్రంపై నమ్మకంతో కోట్ల పెట్టుబడి పెట్టిన బయ్యర్లకి చుక్కలు చూపించింది. రెండు అనూహ్యమైన పరాజయాలతో మొదలైన ఈ సంవత్సరానికి ఊరట 'ఎఫ్ 2'తో దక్కింది.
పెద్ద పండక్కి కుటుంబ సమేతంగా చూడతగ్గ వినోదాత్మక చిత్రాన్ని అందించడం ఎంత సేఫ్ గేమ్ అనేది ఈ చిత్రం నిరూపించింది. మిగిలిన రెండు చిత్రాల దారుణ పరాజయంతో 'ఎఫ్ 2' అంచనాలని మించిపోయింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్‌లోనే కాకుండా, దిల్ రాజు సంస్థ నుంచి వచ్చిన అతి పెద్ద విజయంగా నిలిచింది. వరుస విజయాలని అందిస్తోన్న అనిల్ రావిపూడికి ఒక్కసారిగా మిడ్ రేంజ్ సినిమాల నుంచి 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సూపర్‌స్టార్ లెవల్‌కి అప్‌గ్రేడ్ దక్కింది.
మొదటి రెండు చిత్రాల పరాజయంతో డీలా పడిన అఖిల్ ఈసారి బడ్జెట్‌ని కంట్రోల్‌లో పెట్టుకుని చేసిన లవ్‌స్టోరీ 'మిస్టర్ మజ్ను' కూడా తిరస్కారానికి గురయింది. రిలయబుల్ స్టోరీ, సేలబుల్ ఎమోషన్స్ వున్నా కానీ 'మిస్టర్ మజ్ను' ప్రేక్షకులని థియేటర్లకి రాబట్టడంలో విఫలమయింది. తొలిప్రేమతో మెప్పించిన దర్శకుడు వెంకీ అట్లూరిని సెకండ్ సినిమా సిండ్రోమ్ వేధించింది. హీరోగా మొదటి మూడు సినిమాలతో వైఫల్యాలు చవిచూసిన అఖిల్‌పై మొదటి సినిమా రాకముందు వున్న అంచనాలన్నీ కరిగిపోయాయి. తదుపరి చిత్రంతో అయినా అఖిల్‌కి సక్సెస్ హలో చెప్పకపోతే మిస్టర్ మజ్ను ట్రాక్ ఎక్కడం క్లిష్టమవుతుంది.
ఆల్‌టైమ్ డిజాస్టర్!
జనవరిలో భారీ చిత్రాలు కొలువుదీరడంతో ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న సినిమాలే వెలుగు చూసాయి. బయోపిక్‌ల ట్రెండ్‌లో వచ్చిన 'యాత్ర' దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన చారిత్రిక పాదయాత్ర నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రానికి ప్రశంసలు బాగా వచ్చాయి కానీ ఆర్థికంగా గొప్ప ఫలితమేమీ రాలేదు. నిర్మాతలు స్వయంగా విడుదల చేసుకోవడంతో నాన్-థియేట్రికల్ రైట్స్‌తో కలుపుకుని సక్సెస్ అయింది. ఇక మొదటి భాగం నిరాశ పరచడంతో రెండవ భాగం తాత్సారం చేసి విడుదల చేసిన 'ఎన్టీఆర్- మహానాయకుడు' ఆల్‌టైమ్ డిజాస్టర్ అయింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే చూపించే చిత్రం కనుక దీనికి స్పందన బాగుంటుందని ఆశించారు కానీ ప్లాన్ రివర్స్ అయింది. ఎన్టీఆర్ జీవితంలోని చివరి అంకాన్ని పూర్తిగా విడిచిపెట్టడం విమర్శలకి తావిచ్చింది. విడుదలకి ముందే ఆసక్తి లేకపోవడంతో ఈ చిత్రానికి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఫిబ్రవరిలోనే విడుదలయిన 'మిఠాయి' కూడా చేదు ఫలితాన్నే చవిచూసింది.
హడలెత్తించిన మార్చి!
సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 తర్వాత మళ్లీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తెచ్చుకున్న సినిమా లేకపోవడంతో ఫిబ్రవరి అంతా డల్‌గా సాగింది. మార్చిలో కూడా భారీ చిత్రాలేవీ విడుదల కాలేదు. దీంతో రిలీజ్ అయిన వాటిలో ఒకటీ అరాతో మాత్రమే సినీ ప్రియుల తృష్ణ తీర్చుకున్నారు. కళ్యాణ్‌రామ్ నటించిన '118' ప్రేక్షకులని మెప్పించింది. భారీ విజయాన్ని అందుకోకపోయినా కానీ కళ్యాణ్‌రామ్‌కి ఊరటనిచ్చే విజయాన్ని సాధించింది. అడల్ట్ కంటెంట్ కలిసి రావడంతో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' టార్గెట్ ఆడియన్స్‌ని ఆకట్టుకుని సక్సెస్ అయింది. రామ్‌గోపాల్‌వర్మ తీసిన కాంట్రవర్షియల్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాలేదు కానీ తెలంగాణలో రిలీజ్ అయి ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
ఇరవై సినిమాలకి పైగా రిలీజ్ అయిన మార్చి నెలలో పైన చెప్పినవి తప్ప మిగతావన్నీ మిస్‌ఫైర్ అయ్యాయి. నిహారిక కొణిదెల చేసిన మరో ప్రయత్నం 'సూర్యకాంతం' ఆమె పేరిట మరో ఫ్లాప్‌ని రిజిష్టర్ చేసింది. 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అడ్రస్ గల్లంతయింది. మార్చిలో మామూలుగా వసూళ్లు తక్కువగా వస్తుంటాయి. ఈసారి ఎన్నికల ప్రభావం కూడా పడడంతో సినిమా బిజినెస్ స్లంప్‌లోకి వెళ్లింది.
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్!
రెండు నెలలకి పైగా సరయిన సినిమా లేని లోటుతో సినీ వినోదం కోసం ఆవురావురుమంటూ చూస్తోన్న సినీ ప్రియులకి ఎట్టకేలకు వెతుకుతోన్న 'మజిలీ' దొరికింది. నాగచైతన్య, సమంత పెళ్లయిన తర్వాత కలిసి నటించిన తొలి సినిమా అనే ఫ్యాక్టర్‌కి తోడు డీసెంట్ కంటెంట్ తోడవడంతో సమ్మర్‌లో ఫస్ట్‌కమర్ అడ్వాంటేజ్‌ని మజిలీ ఫుల్‌గా క్యాష్ చేసుకుంది. నాగచైతన్య కెరీర్‌లో అతి పెద్ద విజయంగా నిలిచిన ఈ చిత్రం సమ్మర్‌కి కావాల్సిన శుభారంభాన్ని అందించింది.
ఫ్లాప్‌లు వస్తే బంచ్‌లుగా వచ్చినట్టు సక్సెస్‌లు కూడా వరుస కట్టాయి. మజిలీ తర్వాత విడుదలైన 'చిత్రలహరి' సాయిధరమ్‌తేజ్ ఫ్లాప్స్‌కి బ్రేక్ వేసి డీసెంట్ సక్సెస్ అందుకుంది. మరుసటి వారమే విడుదలైన 'జెర్సీ' ఈ యేడాదిలో ఇంతవరకు వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఎమోషనల్, క్లాస్ కాంటెంట్ కావడంతో 'జెర్సీ' ఆర్థికంగా ఘన విజయాన్ని అందుకోలేకపోయినా మంచి విజయాన్ని సాధించి ఏప్రిల్‌లో మొమెంటమ్ కొనసాగించింది. ముఖ్యమైన చిత్రాలన్నీ సక్సెస్ కాగా ఈ నెలలోనే విడుదలైన 'ప్రేమకథా చిత్రమ్ 2' లాంటివి మాత్రం ఎలాంటి సౌండ్ లేకుండా గాయబ్ అయ్యాయి.
అనువాద చిత్రాలన్నీ మిస్‌ఫైర్ అవుతోన్న టైమ్‌లో లారెన్స్ 'కాంచన' సిరీస్‌కి మాత్రం కళ తగ్గలేదని ఇంకోసారి రుజువయింది. 'కాంచన 3' కాంటెంట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
సమ్మర్+సూపర్‌స్టార్ = హయ్యస్ట్ గ్రాసర్
సంక్రాంతి తర్వాత భారీ సినిమాలు రాని లోటు ఎట్టకేలకు మహర్షి తీర్చింది. మహేష్ స్టార్‌డమ్‌తో పాటు సమ్మర్ రిలీజ్ అడ్వాంటేజ్ ఈ యావరేజ్ కాంటెంట్‌కి కవచంగా నిలిచింది. మహర్షి అంతకుముందు మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలని పోలి వుందనే రిపోర్ట్స్ వచ్చినా, కాంటెంట్ కూడా ఎట్ బెస్ట్ యావరేజ్ అని అంతా ముక్తకంఠంతో చెప్పినా ఈ చిత్రం బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చుకోవడంతో పాటు మహేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించింది. నాన్-బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందనే అంచనాలని అందుకోలేకపోయిన ఈ చిత్రం విచిత్రంగా మహేష్‌బాబు స్ట్రాంగ్ ఏరియా అయిన ఓవర్సీస్‌లో మాత్రం లాస్ వెంఛర్ అయింది.
అల్లు శిరీష్‌కి 'ఏబిసిడి' మరో డిజప్పాయింట్‌మెంట్ కాగా, బెల్లంకొండ ఫ్లాప్‌ల లిస్టులో 'సీత' కూడా చేరిపోయింది. విడుదలకి ముందు ఆసక్తికరంగా కనిపించిన ఈ చిత్రం కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. మేలో రిలీజ్ అయిన సినిమాలలో 'ఫలక్‌నుమా దాస్' తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రభావం చూపించగలిగింది.
ఇంటర్వెల్ వీక్!
2019 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే దశకి చేరుకున్న టైమ్‌లో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిపోయింది. సమ్మర్‌లో భారీ సినిమా ఒక్కటే విడుదలైన లోటు జూన్‌లో కొట్టొచ్చినట్టు కనిపించింది. విడుదలైన సినిమాలకి లాంగ్ రన్ లేకపోవడంతో, మేలో వచ్చిన చెప్పుకోతగ్గ సినిమాలు ఫెయిలవడంతో జూన్‌లో ఘన విజయాలు అవసరమయ్యాయి. కానీ జూన్‌లో అలాంటి సినిమా ఒక్కటీ రాకపోవడంతో సినిమా బిజినెస్ మళ్లీ డల్ అయింది. ఆర్‌ఎక్స్ 100 హీరో 'కార్తికేయ' కాన్ఫిడెన్స్‌ని దెబ్బ తీసే రేంజ్‌కి 'హిప్పీ' డిజాస్టర్ అయింది. సెవెన్, ఫస్ట్ ర్యాంక్ రాజు లాంటి చిత్రాలు కనీస ప్రభావం చూపించలేకపోయాయి.
జూన్ రిలీజ్‌లలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల మన్ననలు అందుకుని విజయాన్ని సాధించింది. తాప్సీ నటించిన 'గేమ్ ఓవర్'కి, 'మల్లేశం'కి ప్రశంసలు దక్కాయి. జూన్ చివరి వారంలో కల్కి, బ్రోచేవారెవరురా' చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
ఈ యేడాది ఫస్ట్ హాఫ్‌లో కొన్ని విజయాలు వచ్చినా కానీ ఓవరాల్‌గా బాగా డిజప్పాయింట్ చేసినట్టే అనాలి. ద్వితియార్ధంలో సాహో, సైరా లాంటి అల్ట్రా హై బడ్జెట్ చిత్రాలకి తోడు మన్మథుడు 2, వెంకీ మామ, డియర్ కామ్రేడ్ తదితర క్రేజీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి కనుక ఈసారి సెకండ్ హాఫ్ అదరగొడుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
-గణేష్ రావూరి