ఈ మధ్య టాలీవుడ్ లో కథలకు కరువు వచ్చి పడింది. అదే టైమ్ లో ఒకరి కథ మరొకరు కొట్టేసారంటూ వివాదాలు కూడా పెరిగాయి. జస్ట్ లైన్ తెలిస్తే చాలు దాన్ని పట్టుకుని తలా ఒకరు తలో కథ అల్లేసుకోవడం కామన్ అయింది. అలాంటివి సమస్య కాదు. ఎందుకంటే మాతృక అనేది ఏ కొరియన్ లోనో, ఇంకేభాషలోనో వుంటుంది.
అదికాకుండా సినిమా చాన్స్ కోసం కథ పట్టుకుని తిరుగుతూ వుంటారు ఔత్సాహికులు. వారి కథలు కొట్టేయడం కూడా జరుగుతూ వుంటుంది. చాలా మంది ఏమీ చేయలేరు. లేటెస్ట్ గా ఇలాంటి వివాదం ఒకటి బయటకు వచ్చింది. కల్కి సినిమా కథ తనదే అంటున్నాడు కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత. ఆయన గతంలో రాజశేఖర్ తో మహంకాళి అనే సినిమా చేసారు. అది మధ్యలో ఆగిపోయింది.
ఆ టైమ్ లోనే తాను కల్కి టైటిల్ తో కథ చెప్పానని, స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చానని, అయితే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడు చేయలేమని అప్పట్లో చెప్పారని తెలిపారు. దాంతో తాను ఆ విషయం వదిలేసి, తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నానని, ఇప్పుడు తీరా చూస్తే అదే కథను చిన్న చిన్న మార్పులు చేసి సినిమాగా తీసేసారని సదరు కార్తికేయ బాధపడుతున్నారు.
ఈ విషయమై రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసానని, తన కథ అసోసియేషన్ లో 2009లో రిజిస్టర్ అయిందని వివరించారు. అసోసియేషన్ కమిటీ కల్కి యూనిట్ ను చర్చలకు రమ్మనమని అడిగినా రావడం లేదట.
ఏదో విధంగా కాలయాపన చేస్తున్నారట. చిత్ర నిర్మాత సి కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తాము ఓ వెబ్ సైట్ లో కథ కొన్నామని కల్కి యూనిట్ చెబుతోందట. ఏ వెబ్ సైట్ లో కొన్నారని అడిగితే లింక్ పంపారట. కానీ ఆ లింక్ క్లిక్ చేస్తే, అక్కడ ఏమీ లేదట.
తన కథ రిజిస్ట్రేషన్ తో ఫుల్ కాపీ వుందని, కల్కి యూనిట్ నుంచి తాను డబ్బులు ఆశించడం లేదని, కథ తనది అనే పేరు కావాలని కార్తికేయ కోరుకుంటున్నాడు. అతని కథ కాపీ కొట్టనపుడు, కల్కి యూనిట్ సినిమా చూపించి, వివాదం లేకుండా చేసుకోవచ్చు కదా? మరి ఎందుకు ఈ దాగుడు మూతలు ఆడుతున్నారో?