హీరోయిన్ల సంపద గురించి కూడా మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి. హీరోయిన్లు కూడా ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. అలాగే వారి పారితోషికాలు కూడా ఒకటీ రెండు సినిమాల్లోనే కోట్ల రూపాయలకు చేరిపోతున్నాయి. ఈ క్రమంలో ఒకటీ రెండు హిట్లున్న హీరోయిన్లే.. ఖరీదైన కార్లను, విల్లాలను కలిగి ఉండటం జరుగుతోంది. మరి ఈ అంశం గురించినే ప్రస్తుత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కియరా స్పందించింది. మీరెంత రిచ్..? అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.
రిచ్ అనే మాటకు ఆమె డబ్బు, కార్లను సమాధానంగా ఇవ్వలేదు. మీరెంత రిచ్ అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, 'అది రిచ్ నెస్ కు మీరు ఇచ్చే నిర్వచనం మీద ఆధారపడి ఉంటుంది. నా వరకూ అయితే విలువల్లోనూ, ఎమోషన్స్ లోనూ నేను చాలా రిచ్' అంటూ సమాధానం ఇచ్చింది కియరా. రిచ్ అనగానే డబ్బు గురించినో, పారితోషికం గురించినో మాట్లాడకుండా.. ఇవ్వదగిన సమాధానాన్ని ఇచ్చింది ఈ నటీమణి.
ఇక మీకు స్నేహితులెవరంటే.. తన స్టేటస్ కు తగ్గట్టుగా ఏ బిగ్ షాట్స్ పేర్లనో చెప్పలేదు కియరా. ప్రస్తుతం కియరాకు ఇండస్ట్రీలో స్నేహితుల లోటు ఉండదు. సక్సెస్, అందం ఉన్న ఆమెకు బోలెడంత మంది సెలబ్రిటీలు స్నేహితులు అవుతారు. వారి పేర్లను చెప్పుకోవడం ఆమెకు కూడా స్టేటస్ సింబల్ అవుతుంది. అయితే కియరా మాత్రం.. తన స్కూల్ డేస్ అమ్మాయిల పేర్లను చెప్పింది. తమ బ్యాచ్ అంటూ వాళ్లతో తన స్నేహం గురించి ప్రస్తావించింది.
ఇక తన అసలు పేరు గురించి కూడా స్పందించింది. ఈమె అసలు పేరు అలియా అధ్వానీ. అయితే ఈమె నటిగా ప్రయత్నాలు చేసే సమయానికే అలియా భట్ కు చాలా గుర్తింపు ఉంది. కన్ఫ్యూజన్ వద్దని ఈమె తన పేరును కియరాగా మార్చుకుంది. కొత్తగా గుర్తింపు సంపాదించుకోవడం, ఓన్ ఐడెంటెటీగా పేరు మార్పు తనకు ఉపయోగపడిందని కియరా అంటోంది. ఇన్ స్టాగ్రమ్ లో ఈమె తన పేరును కియరా అలియా అద్వానీ అని పెట్టుకుంది.
ఇక తన సహచర నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కియర ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందిస్తూ.. అతడు తనకో మంచి స్నేహితుడంటూ చెప్పుకుంది ఈ హీరోయిన్.