ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అప్ఘనిస్తాన్ పరిణామాల గురించి అమెరికా స్పందించింది. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశంపై స్పందించారు. ఒకే మాటతో బైడెన్ అక్కడ జరుగుతున్న పరిణామాలతో ఇక తమకేం మాత్రం పట్టింపు లేదని తేల్చి చెప్పారు. అప్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన అమెరికాకు లేదని బైడెన్ అన్నారు. అప్ఘన్ లో అమెరికా అడుగు పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ అలాంటి మిషన్ ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాపై జరిగిన 9/11 దాడుల దోషులను, సూత్రధారులను శిక్షించడానికే అమెరికా అప్ఘన్ లో దిగిందని అంటున్నారు బైడెన్. తమ లక్ష్యం నెరవేరిందని, దీంతోనే అప్పుడు అప్ఘన్ ను సంకీర్ణ సేన సైన్యాలు పూర్తిగా ఖాళీ చేస్తున్నాయని బైడెన్ వ్యాఖ్యానించారు. అప్ఘన్ ను తాలిబన్లు దాదాపుగా ఆక్రమించేయడం, అక్కడ నుంచి బయట పడే అవకాశం ఉన్న వాళ్లు.. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అక్కడ నుంచి బయటపడే అవకాశాలను వెదుక్కొంటూ ఉండటం, బయటపడే అవకాశం లేని వారు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తూ ఉండటం.. వంటి పరిణామాలు హైలెట్ అవుతున్నాయి.
ఇప్పటి వరకూ తాలిబన్లు సామాన్య ప్రజలపై పడలేదు. కేవలం పోలీసులు, సైన్యంతోనే వారి పోరాటం సాగింది. ఈ పోరాటంలో వారు పై చేయి సాధించడంతో.. ఇక ప్రజలు వారు తమ కనుసన్నల్లో బతకాలనే ఆదేశాలు ఇవ్వడమే తరువాయి. ఇప్పటికే 15 యేళ్ల వయసు పై బడిన బాలికలు, 45 వయసు లోపు వితంతవుల జాబితాను అప్ఘన్ లు కొన్ని ప్రాంతాల్లో రూపొందిస్తున్నారట. వారిని తమ ముఠాలోని వారికి ఇచ్చి పెళ్లిళ్లు చేస్తామంటున్నారట.
అయితే.. పెళ్లి అనేది పేరుకు మాత్రమే అని, వారందరినీ తాలిబన్లు సెక్స్ బానిసలుగా మార్చుకుంటారనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట. తమ ముఠాలోకి చేరడానికి యువతను ప్రేరేపించడానికి కూడా తాలిబన్లు అమ్మాయిలనే ఎరగా వేసే ఉద్దేశాలు ఇక్కడ స్పష్టం అవుతాయి. అప్ఘన్ ను తాము ఇస్లామిక్ ఎమిరేట్స్ గా మారుస్తామని తాలిబన్లు ప్రకటించేశారు. ఇప్పటికే మొన్నటి వరకూ అధికారం చెలాయించిన అధ్యక్షుడితో సహా అనేక మంది పరార్ అయ్యారు. అక్కడ ప్రజాస్వామ్యం మాటే ఉండదని, పూర్తిగా తాలిబన్ల కనుసన్నల్లోనే క్రూరమైన పాలన సాగబోతోందని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. ఇకపై అక్కడ ఏం జరిగినా తమకు సంబంధం లేదన్నట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్ స్పందించారు.