తమ స్వదేశంలో ఏ జట్టు అయినా టెస్టుల్లో అత్యంత పటిష్టమైనదే. అందులోనూ గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ స్వదేశంలో తిరుగులేని క్రికెట్ శక్తిగా ఎదిగింది. ఎక్కడెక్కడి ప్లేయర్లకూ తమ జట్టులో అవకాశం ఇస్తూ పటిష్టమైన జట్టును అయితే తయారు చేసుకుంది. ఇప్పుడు కూడా పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో ఇంగ్లండ్ ను ఎదుర్కొనడం మాటలేమీ కాదు. ఎంతటి లక్ష్యాన్ని అయినా ఏ మాత్రం ఒత్తిడిగా తీసుకోకుండా ఛేజ్ చేయగల సమర్థులైన బ్యాట్స్ మెన్ ఆ జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతూ ఉంటారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తిరుగులేని జట్టుగా ఉన్న ఇంగ్లండ్, అదే టెస్టుల విషయానికి వస్తే.. స్వదేశం వరకూ తమ పట్టును నిరూపించుకుంటూ వచ్చింది.
వన్డేల్లో కనిపించే ఆటగాళ్లు టెస్టుల్లో కనపడరు, టెస్టు జట్టు కెప్టెన్ వన్డే జట్టులో ఉండడు. ఇలాంటి మార్పు చేర్పులతో బండి నెట్టుకుంటూ వచ్చింది. అయితే ఇదే సమయంలో తిరుగులేని టెస్టు జట్టు కూర్పుతో ఉన్న ఇండియా వరస మ్యాచ్ లలో ఇంగ్లండ్ కు షాకులిచ్చింది. వాస్తవానికి ఫస్ట్ టెస్టులో కూడా టీమిండియాకు విజయావకాశాలు పుష్కలంగా కనిపించాయి. చివరి రోజు కురిసిన వర్షం అప్పుడు ఇంగ్లండ్ ను కాపాడింది. అయితే రెండో టెస్టులో చివరి రోజున వర్షం రాలేదు. దీంతో ఇంగ్లండ్ కు ఓటమి తప్పలేదు.
ఫస్ట్ టెస్టు పూర్తి కాగానే.. క్రికెట్ విశ్లేషకులు, ఇంగ్లండ్ టీమ్ లోని లోపాలను ఎంచారు. ఏమంత పటిష్టమైన టెస్టు జట్టు కాదు.. అని తేల్చారు. తమ దేశ జట్టును ఎప్పుడూ తన భుజాల మీద మోస్తూ, ప్రత్యర్థి జట్లను కించపరచడానికి కూడా వెనుకాడని పక్షపాత విశ్లేషకుడు, మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా తమ జట్టు కాస్త బలహీనంగా ఉందన్నాడు. బెన్ స్ట్రోక్స్ దూరం కావడాన్ని ప్రధాన బలహీనతగా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లలో ఇండియా గెలవకపోతే వేస్ట్ అన్నాడు. అలా.. ఒక్క ఆటగాడు దూరం కావడంతోనే తమ జట్టు బలహీనం అయిపోయినట్టుగా.. ప్రత్యర్థి జట్టు గెలవలేకపోతే అంతే అంటూ వాన్ తన లేకి తనాన్ని అప్పుడే బయటపెట్టుకున్నాడు.
ఇక రెండో టెస్టు ఓటమితో ఇలాంటి విశ్లేషకులు కిక్కురుమనడం లేదు. కేవలం ఓటమికి బాధ కాదు. కనీసం 60 ఓవర్ల పాటు డిఫెండ్ చేసుకోలేకపోవడం అనేది వారిని ఎక్కువగా బాధిస్తూ ఉండవచ్చు. గెలుపు కోసం ప్రయత్నించి ఎదురైన ఓటమి కాదు ఇది. ఎలాగూ డ్రా తప్ప మరో మార్గం లేదనే పరిస్థితుల్లో.. 60 ఓవర్ల పాటు నిలదొక్కుకుంటే డ్రాతో గట్టెక్కే పరిస్థితుల్లో ఎదురైన ఓటమి బ్రిటీషర్లను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ అంశంపై ఆ దేశ మాజీ క్రికెటర్, గొప్ప క్రికెట్ విశ్లేషకుడు జెఫ్రీ బాయ్ కాట్ మాట్లాడుతూ.. ఒకవేళ మీరు స్టుపిడ్ అయితే టెస్టు మ్యాచ్ ను గెలవలేరు అంటూ వ్యాఖ్యానించాడు. రూట్ సేనపై ఆయన అలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బ్యాట్స్మన్ గా రూట్ బాగా రాణించాడు. తొలి టెస్టు, రెండో టెస్టులో కూడా రూట్ తన సత్తా చూపించాడు. అయితే.. కెప్టెన్ గా అనుసరించిన వ్యూహాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి అతడి స్వదేశం నుంచి. ప్రత్యేకించి బుమ్రా- షమీల భాగస్వామ్యాన్ని వేరు చేయలేకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. వారిని ఎలా ఔట్ చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి.. షార్ట్ పిచ్ బంతులతో లక్ష్యంగా చేసుకోవడం ఏమిటంటూ.. బాయ్ కాట్ విరుచుకుపడ్డారు. అండర్సన్ కు బుమ్రా షార్ట్ పిచ్ బంతులేశాడని, ప్రతీకారంగా అలాంటి బంతులే వేయడం, మాటల యుద్ధానికి దిగడం.. దీన్నంతా బాయ్ కాట్ తీవ్రంగా తప్పు పట్టాడు. ఈ తీరుతో ఇంగ్లండ్ జట్టు తగిన ప్రతిఫలం చెల్లించుకుందనే విశ్లేషణ చేశారు.
ఇక ఈ ఓటమిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఒక థ్రిల్లింగ్ టెస్టు మ్యాచ్ భారత విజయంతో ముగిసిందంటూ పొడిపొడిగా స్పందించింది. అయితే సీరిస్ అప్పుడే అయిపోలేదు. ఇంకా మూడు టెస్టులు మిగిలే ఉన్నాయి కాబట్టి.. ఈ విజయం టీమిండియా తలకు కూడా ఎక్కకూడదు! స్వదేశంలో ఇంగ్లండ్ ను ఒకటీ రెండు మ్యాచ్ లలో తక్కువ అంచనా వేయడం కూడదేమో!