అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకూ పరిస్థితులు దయనీయంగా మారుతుండడంతో విదేశీయులు అప్రమత్తమయ్యారు. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ఆ దేశంలో మనుగడ సాగించడం కష్టమనే భావనతో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన దేశస్తులు కూడా మూట ముళ్లే సర్దుకుని సురక్షితంగా బయటపడేందుకు ఆలోచిస్తున్నారు. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్టు మన దేశం మంగళవారం ప్రకటించింది.
భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కాబుల్‌లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను వెంటనే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో వాయుసేన సి-17 విమానం కాబుల్ నుంచి బయల్దేరింది.
అఫ్గాన్‌లో చిక్కుకున్న భారత పౌరులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బతికి ఉంటే బలుసాకైనా తిని బతకొచ్చనే సామెత చందాన తాలిబన్ల పాలనకు భయపడి అప్గాన్ వాసులతో పాటు ఆ దేశంలోని విదేశీయులు కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు మార్గాలు వెతుకుతున్నారు.
ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోవడం చూస్తున్నాం. తాలిబన్ల పాలన ఎంతగా భయోత్పాతాన్ని సృష్టిస్తున్నదో ఆ దేశంలో ప్రస్తుతం నెలకున్న ఆందోళనకర పరిస్థితులే నిదర్శనం,