బన్నీ తో సినిమా వుంటుంది-కొరటాల

ప్రతి పాయింట్, ప్రతి కథ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అలవాటు

‘..మిర్చి సినిమా విడుదల తరువాత హీరో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో సినిమా చూశారు. విపరీతంగా నచ్చేసింది అందరికీ. చూస్తూ కేరింతలు కొట్టారు. ఆ తరువాత నన్ను పిలిచి, చెప్పారు. సినిమా చూసాను చాలా బాగుంది అని. అప్పటి నుంచి తాము ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ప్రయత్నిస్తున్నాం, త్వరలో ఆ రోజు వస్తుంది అని నమ్ముతున్నా’… అన్నారు దర్శకుడు కొరటాల శివ.

అయన ఎన్టీఆర్ తో రూపొందించిన ‘దేవర’ సినిమా విడుదల సందర్భంగా గ్రేట్ ఆంధ్రతో మాట్లాడారు. దేనికైనా టైమ్ రావాలని శివ అన్నారు. దేవర కథ కు సంబంధించిన లైన్ ఒకటి వుండేదని, ఆచార్య కన్నా ముందే దాన్ని ఎన్టీఆర్ కు చెప్పానని, ఒకె అన్నారని, అదే ఇప్పుడు మెటరీయలైజ్‌ అయిందని చెప్పారు. తన దగ్గర వున్న ప్రతి పాయింట్, ప్రతి కథ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అలవాటు అని వెల్లడించారు. ఒక్కోసారి చిన్న చిన్న కథలకు కూడా ఎన్టీఆర్ ఎగ్జ‌యిట్ అయి, తాను చేసేస్తా అంటారని, ఊరుకోండి స్వామీ, ఇది మీకు సరిపోదు అని తానే అంటూ వుంటానని వివరించారు. బేసిక్ గా ఎన్టీఆర్ కు కథలు అంటే అంత ఇష్టమని కొరటాల అన్నారు.

గతంలో తాను అనుకున్న ఎనిమిది కథల్లోని కథ ఇది కాదని, దేవర కథ వేరేది అని కొరటాల చెప్పారు. సినిమా సిజి ఎపిసోడ్ లు తీసిన తరవాత రెండు భాగాలు అనుకున్నామని, ముందుగానే కథ చాలా పెద్దది, రెండు పార్ట్ ల సినిమా అని ఐడియా వుందని, కానీ రెండు భాగాలు ఎందుకులే అని ఒక భాగంగా ప్రారంభించామని చెప్పారు. కానీ తరువాత అంత ఆర్గానిక్ గా రెండు భాగాలు వస్తుంటే, ఎందుకు ఇబ్బంది పడాలి అని ఆలోచన మార్చుకున్నామన్నారు.

రెండు భాగాలు చేయడానికి ముందే, స్క్రిప్ట్ రెండు ఇంటర్వెల్ లు, రెండు క్లయిమాక్స్ లు అనే మాదిరిగా వచ్చిందని, అందుకల్లే పని సులువు అయిందని అన్నారు

సెన్సారు తరువాత సినిమాను ట్రిమ్ చేయలేదని, పాట ప్లేస్ మెంట్ మార్చామని, అలాగే టైటిల్స్ చాలా ఎక్కువ వుండడం వల్ల ముందుగా 180 నిమిషాలు అని అనుకున్నామన్నారు. దేవర సినిమాలో ప్రతి పాత్ర నిడివి ఎంత అన్నది పక్కన పెడితే పవర్ ఫుల్ గా వుంటాయన్నారు. సినిమాలో సొరచేప సీన్ కావాలని ఇరికించలేదని, సినిమా చూస్తే అది అర్థం అవుతుందని అన్నారు.

మిర్చి తనకు మెమరబుల్ సినిమా అని, ప్రభాస్ తో తరువాత సినిమా కుదరకపోవడానికి కారణం, డేట్ లు దొరక్కే తప్ప మరేమీ కాదన్నారు. దేవీశ్రీప్రసాద్ తనకు ఎప్పటికీ మంచి మిత్రుడు అని, దేవర సినిమాకు సౌండింగ్ కీలకమని, దానికి అనిరుధ్ సెట్ అవుతాడన్న కారణంగా అతనితో వెళ్లామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

6 Replies to “బన్నీ తో సినిమా వుంటుంది-కొరటాల”

Comments are closed.