పిక్ ఆఫ్ ది డే.. నాగార్జున-రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నవ్వుతూ పలకరించారు హీరో నాగార్జున. అక్కడితో అయిపోలేదు. ఆయనకు శాలువా కప్పారు.

ఇండస్ట్రీ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సీఎంను కలిసేందుకు పరిశ్రమ నుంచి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, మరో 11 మంది ఆర్టిస్టులు వెళ్లారు. వీళ్లంతా సీఎంకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొంతమంది శాలువాలు కప్పితే, మరికొంతమంది పుష్పగుచ్ఛాలు అందించారు

అయితే ఇంతమందిలో అందర్నీ ఆకర్షించింది నాగార్జున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నవ్వుతూ పలకరించారు హీరో నాగార్జున. అక్కడితో అయిపోలేదు. ఆయనకు శాలువా కప్పారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇదంతా చూడ్డానికి రొటీన్ గా అనిపించొచ్చు. కానీ తెలంగాణ సర్కారుతో నాగార్జునకు నడుస్తున్న ‘రగడ’ గురించి తెలిస్తే ఇదెంత స్పెషల్ మూమెంటో మీకు అర్థమౌతుంది.

ఒకటి కాదు, ఏకంగా 2 అంశాలపై తెలంగాణ సర్కారుతో నాగార్జునకు ఇబ్బందులున్నాయి. వీటిలో ఒకటి ఎన్-కన్వెన్షన్ కూల్చివేత. రేవంత్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఏర్పాటుచేశారు. అది ఇలా ఏర్పాటైందో లేదో అలా ఎన్-కన్వెన్షన్ ను కూల్చేశారు. దీనిపై గతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కేసు కోర్టు పరిథిలో ఉంది. ఎన్-కన్వెన్షన్ అలానే శిథిలంగా, నిర్జీవంగా కనిపిస్తోంది.

ఇక మరో అంశం నాగార్జునపై, తెలంగాణ మంత్రి, రేవంత్ రెడ్డి క్యాబినెట్ సభ్యురాలు కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగార్జునపై, ఆయన కుటుంబంపై, హీరోయిన్ సమంతాపై కొండా సురేఖ అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాగార్జున, ఆయన కుటుంబం భగ్గుమంది. ఒక దశలో కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పిస్తారనే చర్చ కూడా సాగింది.

మంత్రి చేసిన కామెంట్స్ పై నాగార్జున చాలా హర్ట్ అయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొండా సురేఖపై క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం ఆ కేసు కూడా కోర్టు పరిథిలో ఉంది. వాయిదాలు నడుస్తున్నాయి.

ఇలా తెలంగాణ సర్కారుతో నాగార్జునకు 2 అంశాలపై తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. ఒకటి ఆర్థిక పరమైనది కాగా, రెండోది పరువు-ప్రతిష్ఠకు సంబంధించినది. అయినప్పటికీ ఆయన మీటింగ్ కు వచ్చారు. నవ్వుతూ రేవంత్ రెడ్డిని పలకరించారు. శాలువా కప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందుకే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

One Reply to “పిక్ ఆఫ్ ది డే.. నాగార్జున-రేవంత్”

Comments are closed.