సినిమాను ఒక కళా రూపంగా చూస్తే.. అందులో మార్టిన్ స్కోర్సెసీ అనే హాలీవుడ్ దర్శకుడు ఒక గొప్ప కళాకారుడవుతాడు. ఏ స్థాయి కళాకారుడు అంటే.. ఒక బీతోవెన్, మరో షేక్స్పియర్, ఇంకో పికాసో.. వాళ్లంతా తమ తమ కళా రంగాల్లో ఏ స్థాయి ముద్రను, తమ వర్క్ తో ఎంత కీర్తిని సొంతం చేసుకున్నారో.. స్కోర్సెసీకి అదే స్థాయి ఘనత సొంతం అవుతుంది. సంగీతానికి బీతోవెన్, రచనకు షేక్స్పియర్, పెయింటింగ్ కు పికాసో… ఎలాగో సినిమాకు మార్టిన్ స్కోర్సెసీ అలా!
ఈ లివింగ్ లెజెండ్ గత కొన్ని దశాబ్దాల్లో మరపురాని సినిమాలను అందించారు. కొన్ని కమర్షియల్ హిట్స్ అయిన క్లాసిక్స్, మరి కొన్ని గొప్ప సినిమాలుగా ప్రశంసలు పొందినవి. సినీ దర్శకుల్లో విభిన్న తరాలను ఆకట్టుకున్న వాళ్లు అరుదు. ఎప్పుడో ముప్పై నలభై యేళ్ల కిందట క్లాసిక్స్ తీసిన వాళ్లు.. ఆ తర్వాతి తరాలను ఆకట్టుకోలేక వెనుకబడి పోతారు. వారు గతంలో తీసిన సినిమాల ఘనకీర్తి మాత్రమే తరచూ ప్రస్తావనకు వస్తూ ఉంటుంది.
వర్తమానంలో వారి గొప్ప సినిమాలు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ.. స్కోర్సెసీ అలాంటి దర్శకుడు కాదు. ఎప్పుడో తీసిన మీన్ స్ట్రీట్స్ తో మొదలుపెట్టి.. టాక్సీడ్రైవర్ వంటి సినిమాలతో ప్రపంచాన్ని ఎంతలా సర్ ప్రైజ్ చేశాడో.. మరో షట్టర్ ఐలాండ్, ఇంకో ఐరిష్ మ్యాన్ వంటి ఈ దశాబ్దపు సినిమాలతో కూడా అంతలానే సర్ ప్రైజ్ చేసిన దర్శకుడు స్కోర్సెసీ.
1967లో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి.. క్రమం తప్పకుండా గొప్ప సినిమాలను అందిస్తూ.. గత పదేళ్లలో షట్టర్ ఐలాండ్, ది వూల్ప్ ఆఫ్ వాల్ స్ట్రీట్, ది ఐరిష్ మ్యాన్ వంటి అరుదైన సినిమాలను అందించారు స్కోర్సెసీ. ప్రతి దశాబ్దంలోనూ కనీసం ఒక్క సినిమాతో అయినా సర్ ప్రైజ్ చేశాడు స్కోర్సెసీ. ఆ సర్ ప్రైజ్ లు సంచలనాలుగా నిలిచాయి. అలాంటి వాటిల్లో ఒకటి 'షట్టర్ ఐలాండ్'.
ఒక కన్ స్ట్రక్టివ్ మిస్టరీగా వందకు వంద మార్కులు పొందే సినిమా షట్టర్ ఐలాండ్. మిస్టరీని చేధించడం ఒక ఎత్తు, ఆ మిస్టరినీ కన్ స్ట్రక్ట్ చేయడం మరో ఎత్తు. దర్శకుడు ఒక మిస్టరినీ సృష్టిస్తే, హీరో దాన్ని చేధిస్తూ పోతాడు. ఏ థ్రిల్లర్ సినిమా అయినా ఇంతే. హీరో చేధించేందుకు అనుగుణంగా మిస్టరీ కన్ స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ.. తను సృష్టించిన మిస్టరీతో హీరోని ఒక వెర్రివాడుగా చూపించి, ప్రేక్షకుడికి ఆశ్చర్యాన్ని మిగిల్చి, ఒక షాకింగ్ క్లైమాక్స్ తో ఈ సినిమాను ముగిస్తాడు స్కోర్సెసీ.
ఒక వివాదాస్పద ఆసుపత్రిలో పరిశోధనకు వెళ్తాడు వార్ వెటరన్, యూఎస్ మార్షల్ టెడ్డీ డేనియల్స్. అతడి వెంట చుక్ అనే మరో మార్షల్ కూడా ఉంటాడు. మానసికంగా జబ్బు పడిన వారికి చికిత్సను అందించే ఆ ఆసుపత్రి ఒక చిన్న దీవిలో ఉంటుంది. ఆ దీవిని తమ సామ్రాజ్యంగా మార్చుకుని ఆ ఆసుపత్రి యాజమాన్యం ఎన్నో అకృత్యాలకు పాల్పడుతూ ఉందని, మనిషి మెదడుపై ప్రయోగాలను చేస్తోందని, దాని కోసం అక్కడి పేషెంట్లను ఉపయోగించుకుంటోందనే అభియోగాలు ఉంటాయి.
అక్కడ మెంటల్ పేషెంట్లపై సాగే ప్రయోగాలపై బయట రకరకాల ప్రచారాలు సాగుతూ ఉంటాయి. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నేపథ్యంలో.. కొత్త ప్రయోగాలకు అమెరికా ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నాయనే అనుమానాలుంటాయి. అలాంటి ఒక సంచలన మిస్టరీని చేధించడానికి హీరో, అతడి సహచరుడు షట్టర్ ఐలాండ్ లో దిగుతారు.
వారు షట్టర్ ఐలాండ్ కు ప్రయాణం సాగించే సీన్లు అద్భుతంగా చిత్రీకరించారు. తుఫాన్ వాతావరణంలో వారు సముద్రంలో ప్రయాణిస్తూ షట్టర్ ఐలాండ్ ను చేరే సీన్, దాని సౌండింగ్ ను వర్ణించడానికి మాటలు చాలవు. థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ మరింత అద్భుతంగా ఉంటుంది.
ఆ ఆసుపత్రి నుంచి మాయమైన ఒక పేషెంట్ గురించి ఈ డిటెక్టివ్ ల పరిశోధన ప్రారంభం అవుతుంది. పేషెంట్ నంబర్ 67 గురించి వివరాలు కావాలని కోరతారు. అయితే వీరికి ఆసుపత్రి వర్గాలు పెద్ద సహకారం అందించవు. దీంతో వీరిలో మరిన్ని అనుమానాలు రేగుతాయి. వీరు అక్కడ అడుగుపెట్టగానే ఒక డాక్టర్ మాయమవుతాడు.
ఆ ఆసుపత్రి వార్డెన్ వెకేషన్ కు అంటూ వెళ్లిపోతాడు. ఆసుపత్రి వర్గాలు వీరికి రికార్డులు అందించవు. తిరిగి వెళ్లిపోదామనుకుంటే భయంకరమైన తుఫాను వీరిని దీవిని దాటనివ్వదు. ఆసుపత్రిలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
ఆసుపత్రి వాతావరణంలో టెడ్డీకి మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. విపరీతమైన తలనొప్పి అతడిని కుదిపేస్తుంది. ఆసుపత్రి వాతావరణం పడక మీకు అలా అనిపిస్తోందంటూ అక్కడి డాక్టర్లు తమ మెడిసిన్స్ ఇస్తాయి. ఆ మెడిసిన్స్ తీసుకోగానే కలతతో కూడిన నిద్రలోకి జారుకుంటాడు టెడ్డీ. ఆ నిద్రలో భయంకరమైన కలలు వస్తుంటాయి. మరణించిన తన భార్య, రెండో ప్రపంచ యుద్ధంలో తను చూసిన దారుణ మారణకాండ.. ఇవన్నీ గుర్తుకు వస్తూ అతడికి ప్రశాంతత లేకుండా చేస్తుంటాయి.
టెడ్డీ ద్వారా ఆసుపత్రి రహస్యాలు బయటకు వెళ్లకుండా యాజమాన్యం ఏదో కుట్ర చేస్తూ ఉందనే అనుమానాలు కలుగుతాయి. అందుకే అతడికి ఏవో భయంకరమైన మందులు ఇస్తున్నారని, తనను మానసిక రోగిగా తయారు చేసే కుట్రతో వారు ముందులు ఇస్తున్నారనే అనుమానాలు టెడ్డీకి కూడా కలుగుతాయి. వారు ఇచ్చే మందులు తీసుకోవద్దని అక్కడి పేషెంట్లు టెడ్డీకి సూచిస్తారు.
తమ ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెడ్డీ అక్కడి పేషెంట్లను ఇంటర్వ్యూ చేస్తాడు. ఎవ్వరూ నోరు మెదపరు. అయితే ఒక లేడీ పేషెంట్ మాత్రం ఎవ్వరి కంటా పడకుండా ఒక కాగితం మీద 'రన్' అని రాసి టెడ్డీకి అందిస్తుంది. అక్కడ నుంచి పారిపొమ్మని ఆమె అతడికి సూచిస్తుంది. దీంతో అక్కడ ఏదో జరుగుతోందనే అనుమానాలు మరింత బలపడతాయి.
ఐలాండ్ లో కొన్ని రహస్య గదులున్నాయని, వాటిలో పేషెంట్ల మీద ప్రయోగాలు జరుగుతున్నాయని సూఛాయగా టెడ్డీకి తెలుస్తుంది. దాని అంతు చూడటానికి తన సహచరుడు చుక్ తో సహా సెర్చింగ్ మొదలుపెడతాడు. వీరిద్దరూ ఐలాండ్ లో రహస్య స్థావరాలను వెదుకుతూ చెరో వైపు వెళ్తారు. కొంతసేపటికి చుక్ శవం కనిపిస్తుంది టెడ్డీకి. ఒక ఎత్తైన కొండ నుంచి చుక్ తీరం లోకి పడిపోయినట్టుగా అతడి శవం కనిపిస్తుంది.
తన సహచరుడిని ఎవరో హత్య చేశారని అర్థం అవుతుంది. తీరా తీరం వరకూ వెళితే అక్కడ నుంచి శవం మాయమై ఉంటుంది. తిరిగి హాస్పిటల్ వద్దకు వచ్చి.. జరిగినది చెబితే, అసలు చుక్ ఎవరు? అని ప్రశ్నిస్తాడు ప్రధాన అధికారి. ఇన్వెస్టిగేషన్ కు నీవొక్కడే వచ్చావు, నీతో పాటూ మరెవరూ రాలేదు కదా? అని ఆ అధికారి ప్రశ్నించే సరికి టెడ్డీకి తలతిరిగిపోతుంది!
తనతో పాటు వచ్చిన ఒక యూఎస్ మార్షల్ నే వారు చంపేసి, శవాన్ని మాయం చేసి.. ఒక్కడే వచ్చావంటూ చెబుతున్న వారి కన్నింగ్ నెస్ తో టెడ్డీ అదిరిపడతాడు.
ఇలా సాగే ఈ అపరాధ పరిశోధన కథలో.. అసలైన ట్విస్ట్ క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అది హిచ్ కాక్ సినిమాలను తలపింపజేస్తుంది. ఒక కథను మనకు చెబుతూ… అనూహ్యమైన మలుపుతో, అప్పటి వరకూ చూపించిన మొత్తం కథ వెనుకే ఒక ట్విస్ట్ ను పేర్చి ఉండటం హిచ్ కాక్ స్టైల్.
వెర్టిగో వంటి హిచ్ కాక్ సినిమాను తలపింపజేస్తుంది షట్టర్ ఐలాండ్ కూడా. అపరాధ పరిశోధకుడిగా అవతారం ఎత్తిన ఈ టెడ్డీ ఎవరు? అనే అంశంలో క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ సర్ ప్రైజ్ గా నిలుస్తుంది.
చివర్లో తను ఎవరో , ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిందీ హీరోకి వివరిస్తారు వైద్యులు. వారు చెప్పే విషయాలతో అతడు కన్వీన్స్ అయితే అతడు కోలుకున్నట్టు. వారు వివరంగా చెప్పే సరికి టెడ్డీ కన్వీన్స్ అవుతాడు. తనకున్న మానసిక జబ్బును అర్థం చేసుకుంటాడు. తన భార్య, తన పిల్లలు గుర్తుకు వస్తారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో మరణించిందీ అర్థం అవుతుంది. దాని వల్ల తను డిస్ట్రబ్ అయ్యి ఆసుపత్రి పాలైన వైనం గుర్తుకు వస్తుంది.
చికిత్స తీసుకుంటానంటాడు. భ్రమల నుంచి బయటకు వచ్చి గతమంతా గుర్తు చేసుకోవడంతో అతడికి అంతా బాగయిపోయిందని వైద్యులు కూడా భావిస్తారు. అందుకు వారు మరో పరీక్ష పెడతారు. కానీ తనకు వైద్యం అందించే డాక్టర్ ను మళ్లీ చుక్ అని పిలుస్తూ, ఆసుపత్రిలో ఏదో జరుగుతోందని దానిపై పరిశోధించడానికి టెడ్డీ మళ్లీ రెడీ అయిపోవడంతో సినిమా ముగుస్తుంది!
సినిమా ఒక మిస్టరీగా సాగినంతసేపూ, ప్రేక్షకులు హీరో వైపు నిలుస్తూ అతడు దేన్నో చేధించబోతున్నాడు, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని అంతిమంగా ఎలాంటి మిస్టరీని బయటపెడతాడు అనే ఫీలింగ్ మునివేళ్ల మీద నిలబెడుతుంది. తాము ఒక స్టన్నింగ్ థ్రిల్లర్ ను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.
మనుషుల మెదళ్ల మీద ప్రయోగాలు చేసే ఒక ఆసుపత్రి, దాని వెనుక దాగున్న కుట్రలను బయటకు తీసే డిటెక్టివ్ కథ బోలెడన్ని మలుపులతో అదరగొడుతుంది. అయితే హీరో విషయంలో ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్ ఫీలింగ్ పోగొడుతూ.. అతడి మీదే సానుభూతి కలిగేలా చేస్తుంది.
ఆ రకంగా చూస్తే క్లైమాక్స్ కాస్త నిరాశే. అయితే.. కొన్ని రోజుల పాటు వెంటాడే ఒక సైకాలాజికల్ థ్రిల్లర్ ను చూసిన ఫీలింగ్ ను పుష్కలంగా అందిస్తుంది 'షట్టర్ ఐలాండ్'.
-జీవన్ రెడ్డి.బి