ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న నేపథ్యంలో అగ్రహీరో రజనీకాంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రజనీకాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు.
కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. ఢిల్లీలో సోమవారం అవార్డును రజనీకాంత్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తన భావాలను పంచుకున్నారు.
చెన్నైలోని తన ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనను వరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆ అవార్డు తనకు దక్కుతుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ సమయంలో తన గురువు కె.బాలచందర్ మన మధ్య లేకపోవడం తనకెంతో బాధగా ఉన్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమకు సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైంది. సినీ పరిశ్రమలో అత్యున్నత సేవలందించిన వారిని ఈ అవార్డు వరిస్తుంది. అది రజనీకాంత్‌కు రావడం దక్షిణాది చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు.