రామ్ ఫిలాసఫీ పనిచేసినట్టు లేదు

“హోటల్ కు వెళ్లి బిర్యానీ తింటాం. మనకు నచ్చుతుంది. చుట్టుపక్కల నలుగురు బాగాలేదంటే మన మీద మనకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది అనే అభిప్రాయంతో ఉండాలి. అది బిర్యానీ అయినా, సినిమా…

“హోటల్ కు వెళ్లి బిర్యానీ తింటాం. మనకు నచ్చుతుంది. చుట్టుపక్కల నలుగురు బాగాలేదంటే మన మీద మనకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది అనే అభిప్రాయంతో ఉండాలి. అది బిర్యానీ అయినా, సినిమా అయినా, కెరీర్ అయినా ఇలానే ఉండాలి. నీకు నచ్చింది నువ్వు చేయి, పక్కోడి ఒపీనియర్ వల్ల నీ ఒపీనియర్ మార్చుకోవద్దు. పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్.”

డబుల్ ఇస్మార్ట్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తనదైన శైలిలో రామ్ చెప్పిన డైలాగ్ ఇది. రివ్యూలు పట్టించుకోవద్దు, స్వయంగా సినిమా చూసి ఓ అభిప్రాయానికి రండి అనేది రామ్ ఫిలాసఫీ. కానీ ఇప్పుడీ ఫిలాసఫీ వర్కవుట్ అయినట్టు లేదు.

రామ్ చెప్పినట్టు చూసుకుంటే, సినిమాకు కనీసం ఆక్యుపెన్సీ ఉండాలి. కానీ డబుల్ ఇస్మార్ట్ వైపు జనం తలెత్తి చూడడం లేదు. ఓవైపు బంగారంలాంటి లాంగ్ వీకెండ్ ఉన్నప్పటికీ, మరోవైపు విడుదలకు ముందు మంచి హైప్ జనరేట్ అయినప్పటికీ.. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ ను క్యాష్ చేసుకోలేకపోయింది.

రామ్ పిలుపు మేరకు డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రత్యర్థి మూవీ కంటే ఈ సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అయితే మరుసటి రోజు నుంచి రామ్ పిలుపు పనిచేయలేదు. ఎప్పుడైతే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందో, అప్పుడిక జనం వెనకడుగు వేయడం మొదలుపెట్టారు.

రామ్ పిలుపు మేరకు, ఫ్లాప్ అయిందని తెలిసినా కూడా థియేటర్ కు వెళ్లి అదేంటో చూద్దామనే ధైర్యాన్ని ప్రేక్షకులు ప్రదర్శించలేకపోయారు. ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ సినిమా తేరుకోవాలంటే మరో 30 కోట్లు రావాలి. రామ్ చెప్పినట్టు పక్కోడి గురించి, పకోడీ గురించి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు థియేటర్ కు వెళ్తే ఈ మొత్తం రాబట్టడం పెద్ద కష్టమేం కాదు.

9 Replies to “రామ్ ఫిలాసఫీ పనిచేసినట్టు లేదు”

Comments are closed.