రష్మిక… గోల్డెన్ హ్యాండ్ ఆఫ్ టాలీవుడ్ అనే ఇమేజ్ ఉంది ఈ పిల్లకి. ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప.. ఇలా ఈమె కెరీర్ లో హిట్సే ఎక్కువ. మధ్యలో డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాప్ వచ్చినప్పటికీ రష్మిక కెరీర్ పై అదేమంత ప్రభావం చూపించలేదు. ఇన్నాళ్లకు రష్మికకు మరో ఫ్లాప్ వచ్చింది. అదే ఆడవాళ్లు మీకు జోహార్లు.
శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా రష్మికకు కలిసిరాలేదు. అలా ఈ ఏడాదిని ఫ్లాప్ తో మొదలుపెట్టింది ఈ బ్యూటీ. పుష్పతో 2021కు మంచి ముగింపు ఇచ్చిన ఈ చిన్నది.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో 2022కు శుభారంభం అందుకోలేకపోయింది.
ఈ సినిమాలో ఆద్య పాత్ర తనకు బాగా నచ్చిందని, తన మనసుకు దగ్గరగా ఉందని, అందుకే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని రిలీజ్ కు ముందు రష్మిక ప్రకటించుకుంది. కానీ సినిమాలో ఆమె పాత్రకు అంత వెయిట్ లేదనే విషయం తేలిపోయింది. కేవలం రెమ్యూనరేషన్ విషయంలో ఆశపడి ఆమె ఈ సినిమా ఒప్పుకుందనే ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఉంది ఈ సినిమా.
ఒక ఫ్లాట్ స్టోరీలైన్ ను హిలేరియస్ గా చెప్పడంతో దర్శకుడు కిషోర్ తిరుమల ఫెయిల్ అయ్యాడు. పాత్రలు ఎక్కువ, కథ తక్కువ అన్నట్టు తయారైంది ఈ సినిమా. చూడ్డానికి డైలీ సీరియల్ లా ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి.