సాహోరే తెలుగు సినిమా

తెలుగోడి తెగువకీ, తెలివికీ యావద్భారతం దాసోహం! 'బాహుబలి' లాంటి బృహత్తర ప్రయత్నాలు ఒక్క రాజమౌళికే సాధ్యమా? తెలుగు సినిమావైపు యావద్భారత చిత్ర సీమ తలెత్తి చూడడానికి మళ్లీ ఒక శతాబ్ధం ఎదురుచూపులు అవసరమా? సరిహద్దులు…

తెలుగోడి తెగువకీ, తెలివికీ యావద్భారతం దాసోహం!
'బాహుబలి' లాంటి బృహత్తర ప్రయత్నాలు ఒక్క రాజమౌళికే సాధ్యమా? తెలుగు సినిమావైపు యావద్భారత చిత్ర సీమ తలెత్తి చూడడానికి మళ్లీ ఒక శతాబ్ధం ఎదురుచూపులు అవసరమా? సరిహద్దులు ఓసారి చెరిగిపోయాక, మన సత్తా ఎంతనేది ఎలుగెత్తి చాటుకున్నాక ఇంకా ప్రాంతీయ సినిమా పరిధులకి లోబడి సాగు చేయనేల? ఏం చేసినా 'సాహో' అంటూ సాగిలపడేట్టు చేయక!

ఇండియన్‌ సినిమా వ్యాపార సామర్ధ్యం మూడు వందల కోట్లకి కాస్త అటుగా వుందని బాలీవుడ్‌ ఫిక్స్‌ అయిపోయిన వేళ, ఇండియన్‌ మార్కెట్‌ మూడొందల యాభై కోట్ల నెట్‌ వసూళ్లు దాటడం గగనమని భావిస్తోన్న వేళ… భారతీయ సినీ విపణి ఎత్తు, వైశాల్యం, లోతు ఎంతో చూపెట్టింది బాహుబలి. ప్రపంచమంతా కాక ఒక్క ఇండియన్‌ మార్కెట్‌లోనే వెయ్యి కోట్లు రాలతాయని నిరూపించింది. ఒక 'దక్షిణాది' సినిమా కోసం ఉత్తరాది జనత బారులు తీరిపోతుందని, అంతవరకు హిందీ సినిమాకి కూడా తెలియని ఎత్తులు చూపిస్తుందని చాటుకుంది.

'బాహుబలి' లాంటి భారీ ప్రయత్నం తర్వాత ఏమి చేయాలి? ఏ హీరోని అయినా వెంటాడే ప్రశ్న ఇది. మామూలుగా అయితే అంత కష్టపడిన తర్వాత రిలాక్స్‌ అవ్వాలని చూస్తారెవరైనా. భారీ అంచనాలుంటాయి కనుక వాటిని తగ్గించి ఇమేజ్‌ని బ్యాలెన్స్‌ చేసే సినిమాలు చేయమంటారు అనుభవజ్ఞులైనా. కానీ బాహుబలితో వచ్చిన అడ్వాంటేజ్‌ని ఎందుకు వదులుకోవాలి? అయిదేళ్ల కష్టంతో చేరిన శిఖరం నుంచి దిగడానికి దారెటో ఎందుకు చూడాలి? బాహుబలితో భారతావనికి పరిచయం అయిన ముఖాన్ని మళ్లీ బలవంతంగా ఎందుకని రెండు రాష్ట్రాలకి పరిమితం చేయాలి?

ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌గా ఆలోచించాడు. తన మిత్రులైన యువి క్రియేషన్స్‌ అధినేతలు కూడా అదే బెస్ట్‌ డెసిషన్‌ అని ఫీలయ్యారు. బాహుబలితో వెయ్యి కోట్లు వచ్చినపుడు అందులో సగం పెట్టి మరో సినిమా చేస్తే అంత మంది జనం ఎందుకు ఆసక్తి చూపించరని అనుకున్నారు. బడ్జెట్‌ పరిమితులు లేకుండా, టైమ్‌ లిమిట్‌తో సంబంధమే లేకుండా సుజీత్‌ అనే యువ దర్శకుడికి స్వప్నాలకి, ఊహాశక్తికి పెట్టుబడి పెట్టారు. పది కోట్ల బడ్జెట్‌ కూడా చూడని దర్శకుడికి నాలుగు వందల కోట్లిచ్చారు. మిషన్‌ ఇంపాజిబుల్‌, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌, మ్యాడ్‌ మ్యాక్స్‌ లాంటి ఊహలపై హాలీవుడ్‌ దర్శకులకే పేటెంట్‌ రైట్స్‌ వున్నాయా? తలచుకుంటే అలాంటి అనుభవాన్ని ఇండియన్‌ స్క్రీన్‌పై ఇవ్వలేమా? సుజీత్‌ తనకిచ్చిన నమ్మకంపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు. హిందీ చిత్ర దర్శకులు కూడా ఊహించడానికి జంకుతోన్న ఒక అంతర్జాతీయ శ్రేణి యాక్షన్‌ సినిమాని తీర్చిదిద్దాడు.

బాహుబలి హీరో మలి చిత్రం కనుక మొదట్లో ఆసక్తి సహజం. అయితే ఆ ఆసక్తిని ప్రతి ప్రోమోతో పెంచుకుంటూ పోవడం సిసలైన గొప్పతనం. సాహోని జస్ట్‌ బాహుబలి తదుపరి చిత్రంలా చూడడం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు దానినో అద్భుతంలా, అనితరసాధ్యంగా చూడడం జరుగుతోంది. అందుకే ఈ చిత్రాన్ని మిగిలిన సినిమాలతో సంబంధం లేకుండా ట్రేడ్‌ చూస్తోంది. ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా సాహోని ఏ భాషలోను చూడడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే సాహోకి కేవలం తెలుగు సినిమాలే కాదు… ఏ భాషలో అయినా దారిచ్చేయడం జరిగింది. మదగజం నడిచి వస్తోంటే బాట మొత్తం క్లియర్‌ చేసినట్టుగా అంతటా సాహోకి ఎర్ర తివాచీ స్వాగతం లభిస్తోంది.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే… తెలుగు రాష్ట్రాలలో బాహుబలి 2కి జరిగిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కంటే దీనికే ఎక్కువ జరిగింది. ఆ బిజినెస్‌ని దాటాలంటే రాజమౌళికి కూడా ఇద్దరు సూపర్‌స్టార్లు అవసరం అని ట్రేడ్‌ భావిస్తోన్న వేళ అంత అక్కర్లేదని, ప్రభాస్‌కి ఒక్క సినిమా అనుభవం వున్న దర్శకుడు తోడయితే చాలని రుజువైంది. తెలుగు రాష్ట్రాలని దాటి చూస్తే సాహో ప్రభంజనానికి ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. కేవలం హిందీ వెర్షన్‌ ఒక్కటే వంద కోట్లు పైగా పలికింది. బ్రేక్‌ ఈవెన్‌ అవ్వడానికే రెండు వందల కోట్ల పైచిలుకు నెట్‌ వసూళ్లు అవసరమని తెలిసినా అది ఆడుతూ పాడుతూ కొట్టేస్తుందనే నమ్మకం వారిది.

హిందీ వెర్షన్‌ డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులే ఎనభై అయిదు కోట్లు పలికాయి. హీరో ఎవరో తెలియని వారికి ఈ వార్త తెలిస్తే సాహో ఏదో సల్మాన్‌ లేదా అమీర్‌ఖాన్‌ చిత్రమనిపిస్తుంది. తెలుగు, తమిళ శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులకి నిర్మాతలు ఎంత అడుగుతున్నారో తెలిస్తే మతి పోతుంది. అక్షరాలా నూట పది కోట్లు ప్రైస్‌ ట్యాగ్‌ తగిలించి సాహో బృందం మీలో లక్కీ ఫెలో ఎవరో తేల్చుకోమంటోంది. నూట పాతిక కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచే రాగా, ఇరవై ఏడు కోట్లు కర్నాటక నుంచి, మరో పాతిక కోట్లు తమిళనాడు నుంచి వచ్చి పడ్డాయి. కేరళ నుంచి ఆరు కోట్లకి ఆఫర్‌ వున్నా నిర్మాతల రేటు ఎనిమిది కోట్ల దగ్గర వుంది. ఓవర్సీస్‌ నుంచే అరవై అయిదు కోట్లు వచ్చాయంటే సాహోపై వున్న అంచనాలకి అవధులు ఏమిటో అర్థమవుతోంది.

సాహో ఈ స్థాయిలో సంచలనం కావడానికి బాహుబలి ఫ్యాక్టర్‌ కూడా దోహదపడిందనడంలో సందేహం లేదు కానీ… పరిమితులు పెట్టుకోకుండా యూనివర్సల్‌ అప్పీల్‌ వున్న సినిమా తీస్తే, అన్ని కోట్లు వెచ్చించే తెగింపు, ఆ కోట్లని తెరమీదకి తీసుకొచ్చే తెలివీ సొంతమయితే భాషతో సంబంధం లేకుండా భారతావని దాసోహమంటుందని సాహోతో రుజువయింది. ఈసారి కూడా తెలుగు సినిమా ఔరా అనిపించేస్తే ఇక తెలుగు సొబగులు ఎల్లవేళలా దేశమంతటా శోభిల్లడానికి మార్గం సుగమం అవుతుంది. ఇంకొన్ని కలలకి కంచెలు తొలగిపోతాయి. వందల కోట్ల పెట్టుబడికి భయాలు వదిలిపోతాయి. సరికొత్త ప్రయత్నాలకి భుజం తట్టే చేతులు పెరిగిపోతాయి. అనుభవమెంత అంటూ ఎదురయ్యే ప్రశ్నలు సమాధానపడతాయి.

అందుకే సాహో జస్ట్‌ ఒక సినిమా కాదు… తెలుగు సినిమాకి మైలురాయి కాగల సత్తా, సామర్ధ్యం దాని సొంతం. తెలుగు సినిమా మార్కెట్‌ని నలుదిశలా వ్యాప్తి చెందేట్టు చేయగలగడం దానికి సాధ్యం. ఆగస్ట్‌ 30 కోసం కోట్లాది నోట్లే కాదు… ఎన్నో కోట్ల జతల కళ్లు, అంతకు రెట్టింతల ఆశలు, కలలు కూడా ఎదురుచూస్తున్నాయనేది నిజం.
-గణేష్‌ రావూరి

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..