సినిమా ఏంటనేది టైటిల్ చూస్తేనే సగం అర్థమైపోతుంది. ఆడియన్స్ కూడా అలానే మెంటల్లీ ఫిక్స్ అయ్యారు. కానీ మేకర్స్ మాత్రం ఈ టైటిల్ కింద చాలా అంశాలు టచ్ చేయాలని చూశారు. ఫలితంగా షకీలా సినిమా తలాతోక లేని మూవీగా మిగిలిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ రోజు రిలీజైన ఈ సినిమాలో అసలు కంటే, కొసరే ఎక్కువగా కనిపిస్తుంది.
80, 90ల్లో ఇండస్ట్రీని ఓ ఊపుఊపిన షకీలా.. అప్పట్లో దక్షిణాదిలోనే అత్యథిక పారితోషికం తీసుకున్న నటిగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమె పోర్న్ సినిమాలు తీయలేదు, కేవలం అడల్ట్ సినిమాల్లో మాత్రమే నటించారు. అందుకే ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా “నాట్ ఏ పోర్న్ స్టార్” అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ కేవలం ఈ కోణానికే ఫిక్స్ అయి సినిమా తీస్తే బాగుండేది. కానీ ఆయన ఈ సినిమాలో ఇండస్ట్రీని పురుషాధిక్య ప్రపంచంగా చూపించాలనుకున్నాడు. షకీలాను ఓ సూపర్ స్టార్ గా చూపించాలనుకున్నాడు. బాడీ డబుల్ ఎలిమెంట్ కూడా చొప్పించాడు. తన బాడీ డబుల్ పాత్రకు, షకీలాకు ఉన్న సంబంధాన్ని చూడూపించాలనుకున్నాడు. దీనికితోడు షకీలా టీనేజ్ లో జరిగిన ఎపిసోడ్ తో “ఓ మహిళా మేలుకో” అనే కాన్సెప్ట్ ను కూడా తెరపైకి తీసుకొచ్చాడు.
ఇన్ని అంశాల మధ్య, పడుతూ లేస్తూ సాగుతున్న సినిమాకు ఎక్కడికక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ జోడించి సినిమాను మరింత కన్ఫ్యూజ్ చేసి పడేశాడు దర్శకుడు. దీనికి తోడు షకీలా పాత్రధారి వాయిస్ ఓవర్ తో ఫ్లాష్ బ్యాక్ కు, ప్రస్తుతానికి మధ్య లింకులు ఇచ్చే ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.
సముద్ర తీరంలో ఉండే ఓ చిన్న గ్రామంలో షకీలా ఉంటుంది. తండ్రి జాలరి. తల్లి అంతగా పేరు సంపాదించుకోలేని ఓ మాజీ జూనియర్ ఆర్టిస్టు. ఆరుగురు పిల్లల సంతానం. షకీలా పెద్దమ్మాయి. చిన్నప్పట్నుంచి షకీలాకు యాక్టింగ్ అంటే ఇష్టం. స్కూల్ లో ద్రౌపది పాత్ర పోషించి కప్ కూడా గెలుచుకుంటుంది. కానీ ఆమె ట్రోఫీ గెలుచుకొని ఇంటికొచ్చేసరికి, అప్పటికే క్షయతో బాధపడుతున్న తండ్రి మరణిస్తాడు. దీంతో కుటుంబం కొచ్చిన్ కు షిఫ్ట్ అవుతుంది. కుటుంబ పోషణ కోసం పెద్దకూతురు షకీలాను సి-గ్రేడ్ మూవీస్ వైపు మళ్లిస్తుంది స్వార్థపూరిత తల్లి.
తల్లి బలవంతంతో ఇష్టంలేకపోయినా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంది షకీలా. సిల్క్ స్మిత అకాల మరణంతో అప్పటికే ఆ సెగ్మెంట్ లో గ్యాప్ ఉంటుంది. షకీలా రాకతో మెల్లమెల్లగా సి-గ్రేడ్ సినిమాలు ఊపందుకుంటాయి. తన బాడీ డబుల్ సహకారంతో షకీలా లెక్కలేనన్ని అడల్ట్ సినిమాలు చేస్తుంది. ఒక దశలో సూపర్ స్టార్ త్రిపాఠి కంటే తన సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఏకంగా ఈమెకు గుడి కూడా కట్టేస్తారు ప్రేక్షకులు.
అయితే షకీలా సినిమాల వల్ల రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయని ఓవైపు పోలీసులు, మరోవైపు మీడియా హడావుడి చేయడంతో ఆ సెగ షకీలాకు కూడా తగులుతుంది. దీంతో ఒక దశలో షకీలా సినిమాలు తగ్గిపోతాయి. క్లైమాక్స్ కు వచ్చేసరికి సూపర్ స్టార్ సినిమా, షకీలా సినిమా పోటీ పడతాయి. ఇలా సింపుల్ గా చెప్పాల్సిన కథను, చుట్టూ తిప్పి రకరకాల ఎపిసోడ్స్, యాంగిల్స్ జతచేసి ఖూనీ చేశాడు రచయిత-దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్. సెక్సీ సింబల్ గా షకీలాను చూపించాలనే ప్రయత్నంలో ఆయన కొంత సక్సెస్ అయ్యాడు కానీ, కథ-సన్నివేశాలు రాసుకోవడంలో, స్క్రీన్ ప్లేలో అతడు ఫెయిల్ అయ్యాడు.
నటీనటుల విషయానికొస్తే.. షకీలా పాత్రధారి రిచా చద్దాను తీసిపారేయలేం. కొన్ని సన్నివేశాల్లో ఆమె చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. బాగా చేసింది. స్వార్థంతో కూడిన తల్లి, మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ మధ్య నలిగిపోయే పాత్రలో ఆమె బాగా నటించింది. కాకపోతే స్క్రీన్ ప్లే అతుకుల బొంతగా ఉండడంతో కొన్ని సందర్భాల్లో రిచా కూడా చేతులెత్తేసింది. అటు సూపర్ స్టార్ పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి కూడా ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. 90ల నాటి హీరోగా బాగా సూటయ్యాడు.
పురుషాధిక్య పరిశ్రమలో సక్సెస్ అయిన మహిళగా షకీలాను చూపించాలనేది దర్శకుడి ప్రయత్నం. కానీ ఈ పాయింట్ ను చెప్పడానికి దర్శకుడు తనకుతానే ఎన్నో చిక్కుముడులు వేసుకొని, విషయాన్ని సంక్లిష్టం చేశాడు. ఈ చిక్కుముడుల నుంచి సినిమాను కాపాడ్డం రిచా చద్దా, పంకజ్ త్రిపాఠి వల్ల కూడా కాలేదు. రెండు సూపర్ స్టార్ పాత్రలు పోషించే అవకాశం ఈ ఇద్దరు నటులకు దక్కింది. అంతకుమించి ఈ సినిమాలో ఇంకేం లేదు.