“మా దుస్తులు మా ఇష్టం” అనే ఆలోచన ధోరణి అమ్మాయిల్లో పెరిగింది. అయితే “ఇష్టాయిష్టాలన్నీ మీ ఇంట్లో చూసుకోండి. బయటికొచ్చిన తర్వాత కాస్త పద్ధతిగా మెలగండి” అని తమ చర్యల ద్వారా విమానయాన సిబ్బంది ఓ మోడల్‌కు హితవు పలికారు. దీంతో సదరు మోడల్ నొచ్చుకుంటూనే విమానయాన సిబ్బంది చెప్పినట్టు నడుచుకోవాల్సి వచ్చింది.
పొట్టి దుస్తులు ధరించిన తనను విమానంలో ఎక్కేందుకు సిబ్బంది అభ్యంతరం చెప్పడంపై సోషల్ మీడియాలో వాపోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఇసాబెల్లే ఎలెనార్ అనే ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌కు పొట్టి డ్రెస్ తంటా తెచ్చింది.
పొట్టి డ్రెస్ ధరించి జెట్‌స్టార్ ఎయిర్‌లైన్స్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నుంచి మెల్‌బోర్స్‌కు బయల్దేరారు. సదరు మోడల్ వేసుకున్న టాప్ మరీ పొట్టిగా ఉంది. మోడల్ బ్లూజీన్స్ , బ్లాక్ క్రాప్ టాప్ ధరించారు. దీంతో ఆమెని సిబ్బంది విమానం ఎక్కనివ్వలేదు.
టాప్ మరీ చిన్నదిగా ఉందని, చూడడానికే అసహ్యంగా ఉందని, ఓవర్ కోట్ ధరించాలని విమానయాన సిబ్బంది సూచించారు. ఒకవేళ కాదు కూడదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విమానంలోకి అనుమతించమని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో ఆ మోడల్ చేసేదేమీ లేక జాకెట్‌ను ధరించారు. ఈ విషయంపై తనకు తానుగా ఫేస్‌బుక్ పేజీలో ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు.
తన ఆవేదనకు ఆమె అక్షర రూపం ఎలా ఇచ్చారంటే…
“నేను విమానంలోకి అడుగుపెట్టగానే, అక్కడి సిబ్బంది ఏదో వెతకడం ప్రారంభించాడు. నా డ్రెస్ చూసి నన్ను జాకెట్ వేసుకోమని చెప్పినప్పుడు చలిగా ఉంటుందని అలా అన్నారేమో అనుకున్నా. కానీ నా టాప్ చిన్నగా ఉండటం వల్ల నన్ను విమానంలోకి ఎక్కించలేమని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను.
చివరికి నేను జాకెట్ వేసుకునేంత వరకు సీట్లో కూర్చోనివ్వలేదు. అంత మంది ప్రయాణికుల ముందు నన్ను అవమానించారు. నాపై వివక్ష చూపించారు. జెట్ స్టార్ ఆస్ట్రేలియా..ఇది 1921 లేదా 2021వ సంవత్సరమా?” అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారామె.