ఉక్కు ఉద్యమంలో బుక్కయిన జనసేనాని

ఇన్నాళ్లూ బీజేపీ, జనసేన ఒకేమాట, ఒకే బాట అంటూ తెగ బిల్డప్ ఇచ్చారు పవన్ కల్యాణ్. కొన్ని అంశాలపై మధ్యమధ్యలో పొరపొచ్చాలు వచ్చినప్పటికీ ఏ పార్టీ తాడు తెంచలేదు. గీత దాటలేదు. కానీ ఇప్పుడు…

ఇన్నాళ్లూ బీజేపీ, జనసేన ఒకేమాట, ఒకే బాట అంటూ తెగ బిల్డప్ ఇచ్చారు పవన్ కల్యాణ్. కొన్ని అంశాలపై మధ్యమధ్యలో పొరపొచ్చాలు వచ్చినప్పటికీ ఏ పార్టీ తాడు తెంచలేదు. గీత దాటలేదు. కానీ ఇప్పుడు ఎదురైన పరిస్థితి అలాంటిలాంటిది కాదు. ఇప్పుడిక తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.

బీజేపీతో అంటకాగాక ప్రత్యేక హోదా వద్దన్నారు, మత రాజకీయాలకు సై అన్నారు, బడ్జెట్ పై స్పందించకుండా నోరు కట్టేసుకున్నారు. తాజాగా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కూడా జనసేన మౌనాన్ని ఆశ్రయిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అందుకే చాలా తెలివిగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి మమ అనిపించారు జనసేనాని, అది కూడా తన చేతికి మట్టి అంటకుండా నాదెండ్ల మనోహర్ తో ఇప్పించారు.

జయంతులు, వర్థంతులకి కూడా పవన్ పేరుతో నేరుగా ప్రెస్ నోట్ విడుదల చేయడం ఆనవాయితీ. అలాంటిది అత్యంత కీలకమైన స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మాత్రం తన పేరు లేకుండా జాగ్రత్తపడ్డారు పవన్.

ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై బీజేపీ నేతలు పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. సుజనా చౌదరిలాంటి వాళ్లు మాత్రం.. ఇది గతంలో తీసుకున్న నిర్ణయమే, దీని వల్ల రాష్ట్రానికి, పరిశ్రమకు లాభం చేకూరుతుందే తప్ప నష్టం జరగదు అంటూ కబుర్లు చెబుతున్నారు. ఇప్పుడు జనసేన కూడా అదే మాట చెప్పాలి. అలా కుదరని పక్షంలో బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకొచ్చి ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలి.

ఆ రెండూ కాకుండా తటస్థంగా ఉండేందుకే జనసేన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే నాదెండ్ల మనోహర్ పేరుతో విడుదలైన ప్రెస్ నోట్ లో గోడమీద పిల్లివాటం ప్రదర్శించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు బీజం పడిందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. 

పాపం, బీజేపీకి ఏమీ తెలియదని, అప్పటి నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేయాల్సి వస్తోందని తెగ మొహమాట పడ్డారు. చివరిగా పవన్ కల్యాణ్ నేరుగా ప్రధానిని కలసి ఉక్కు ఫ్యాక్టరీ విషయంపై తమ అభ్యర్థన ఇస్తారని, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కేనంటూ సెలవిచ్చారు.

ఎక్కడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేకపోయారు, పైగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సైతం సాహసించారు. దీంతో జనసేన ఏపాటి రాజకీయం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబులాగే పవన్ కూడా ప్రత్యేక హోదాని పక్కనపెట్టి ప్యాకేజీతోనే సరిపెట్టుకున్నారనుకుందాం. 

కనీసం విశాఖ ఉక్కు విషయంలో కూడా నేరుగా స్పందించే దమ్ము, ధైర్యం పవన్ కు లేవా? ముందుగా స్పందించి ఇబ్బంది పడటం ఎందుకని ఆగిపోయారా..? పాతికేళ్ల ప్రస్థానం అంటే ఇదేనా.. ఇలాగేనా..? ఇప్పుడీ ప్రశ్నలు జనసైనికుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది