35-Chinna Katha Kaadu Review: మూవీ రివ్యూ: 35- చిన్న కథ కాదు

కమర్షియల్ గా సినిమా హాల్స్ వద్ద కాసుల వర్షం కురుస్తుందో లేదో కానీ, చూసిన వారికి మంచి సినిమా చూసామన్న హర్షం మాత్రం కలగవచ్చు.

చిత్రం: 35- చిన్న కథ కాదు
రేటింగ్: 3/5
తారాగణం: నివేతా థామస్, విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, అరుణ్ దేవ్ పోతుల, అభయ్ శంకర్ దువ్వూరి, అనన్య మాడుగుల, భాగ్యరాజ, గౌతమి, కృష్ణతేజ
సంగీతం: వివేక్ సాగర్
కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి
నిర్మాత: సిద్ధార్థ్ రాళ్లపల్లి, సృజన్ యరబోలు
దర్శకత్వం: నందకిషోర్ ఈమని
విడుదల: 6 సెప్టెంబర్ 2024

చిన్న సినిమాలకి థియేటర్ వద్దే కాదు ఎక్కడా మంచి రోజులు లేవన్న అభిప్రాయం బలపడుతున్న తరుణంలో ఈ మధ్య కొన్ని చిన్న సినిమాలే అద్భుతాలు సృష్టించాయి. దాంతో కంటెంట్ బాగుంటే పేక్షకాదరణ ఉంటుంది అనే వాదన మళ్లీ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో “35 చిన్న కథ కాదు” అనే ఈ సినిమా ముందుకొచ్చింది. ఈ చిత్రం కూడా ఆ వాదనకి నిలబడుతుందా అనేది చూద్దాం.

ప్రసాద్ (విశ్వదేవ్) తిరుపతిలో ఒక బస్ కండక్టర్. అతని భార్య సరస్వతి (నివేతా థమాస్). వాళ్లకి ఇద్దరు కొడుకులు. అందులో పెద్దవాడు అరుణ్ (అరుణ్ దేవ్) లెక్కల్లో వీక్. వీక్ అనడం కంటే “జీరో” అనడం కరెక్ట్. ఎప్పుడూ జీరోకంటే ఎక్కువ మార్కులు రావతనికి. చదివేది ఆరో క్లాస్.

ఆ స్కూల్ కి చాణక్య వర్మ (ప్రియదర్శి) అనే లెక్కల టీచరొస్తాడు. అరుణ్ ని జీరో అనే పిలుస్తాడు. అవమానిస్తాడు. అతనితో స్నేహం చేస్తే మార్కులొచ్చేవాళ్ళు కూడా నష్టపోతారని స్నేహితుల్ని విడగొడతాడు. ఇలాంటి వాతావరణంలో లెక్కలంటేనే అసహ్యం పెరిగిపోతుంది అరుణ్ కి.

కానీ ఎలాగైనా 35 మార్కులైనా తెప్పించి తన కొడుకు పాస్ అవ్వాలని కోరుకుంటుంది తల్లి సరస్వతి. ఆమె స్వయంగా లెక్కలు చెప్పాలనుకుంటుంది. కానీ ఆమె టెంత్ ఫెయిల్. అయినా సరే పట్టుదలగా తాను నేర్చుకుని కొడుక్కి లెక్కలపై ఆసక్తి కలిగించి ప్రేమగా బోధిస్తుంది. ఆ తర్వాత ఏమౌతుందనేది కథ.

చాలాకాలం తర్వాత ఒక సంస్కారవంతమైన చిత్రం చూసిన అనుభూతి కలిగింది. సంభాషణల్లోనూ, పాత్రల చిత్రణలోనూ సంస్కారం కనపడింది. ఇందులో ఏ పాత్రా చెడ్డది కాదు. ఎవరి లెక్కలు వాళ్లవి, ఎవరి భావోద్వేగాలు వాళ్లవి.

ఆ మధ్యన “శకుంతలాదేవి” బయోపిక్ వచ్చింది. లెక్కల విషయంలో అందులో అద్భుతాలేమైనా కనిపిస్తాయా అంటే పెద్దగా కనపడలేదు. కానీ ఇది అలాంటి బయోపిక్ కాకపోయినా లెక్కలతో, అంకెలతో కూడిన డైలాగులు, ఉదాహరణలు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి.

“ఓడిపోతామనే మైనస్ నుంచి గెలుస్తామనే ప్లస్ వైపు నడిచేటప్పుడు ఎదురయ్యే మజిలీ సున్నా” అనే లైన్ రెండు సార్లు వినిపిస్తుంది సందర్భోచితంగా. అయితే “నెంబర్ లైన్” తెలిస్తే తప్ప ఇది అర్ధం కాదు.

ఇవే కాకుండా అర్ధవంతమైన కోటబుల్ కోట్స్ లాంటి లైన్లు ఒకటి రెండు ఉన్నాయి.

“మంత్రి పోయాడని ఆట ఆపేస్తే సిపాయికి మంత్రి అయ్యే అవకాశం వచ్చేదా?”- ప్రాధమికంగా చెస్ ఆట తెలిసిన ఎవరినైనా ఈ లైన్ ఆకట్టుకుంటుంది. అందులో జీవనపాఠం కూడా ఉంది.

“మనిషి మాటకి విలువ వినడంతో కాదు పాటించడంతో వస్తుంది”- ఇది కూడా మంచి లైన్. అందరికీ అర్ధమవుతుంది.

అలాగే సున్నాకి ఒక పక్కన అంకె వేస్తే ఆ సంఖ్యబలం పెద్దదవడం, మరో పక్క వేస్తే చిన్నదవడం ఎందుకో ప్రాక్టికల్ గా ఒక సీన్లో చూపించడం చాలాబాగుంది. ఇది దర్శకుడు మెచ్యూర్ థాట్ కి నిదర్శనం.

ఇంత మెచ్యూరిటీ చూపిస్తూనే ఒక్కో చోట అమెచ్యూర్ గా అనిపించే సన్నివేశ కల్పనలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రిన్సిపాల్ మనవరాలైనంత మాత్రాన ఒక అమ్మాయి క్లాస్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసేసుకునే ట్రాక్ కన్విన్సింగ్ గా చెక్కలేదు. అలాగే అప్పటివరకు లెక్కల మాస్టారి వైపు ఉండే ఒక పిల్లవాడు ఎగ్జాం హాల్లో ఆ మాస్టారిపైనా, పిల్లలపైనా గట్టిగా “డోంట్ డిస్టర్బ్” అని అరిచే సీన్ కూడా అతికినట్టులేదు.

నివేతాకి సాయపడే పాత్రగా గౌతమి ఇంఫర్మేటివ్ గా ఉంది తప్ప ఎమోషనల్ కంట్రిబ్యూషన్ అందించలేదు. ప్రియదర్శి పాత్ర కూడా పూర్తిగా పాకానపడలేదు. అన్నిటికీ మించి కథంతా అక్కడక్కడే నడవడంవల్ల దాదాపు రెండున్నర గంటలు ఆసక్తికరంగా కూర్చోపెట్టడానికి దర్శకుడు సరైన హాస్యాన్ని పండించలేకపోయాడు. ఈ టెక్నికల్ మైనస్సులు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేవు.

చాలా సన్నివేశాలు మనసుని తాకుతాయి. జీవితంలో అవమానాన్ని సీరియస్ గా తీసుకున్నప్పుడే అది చాలెంజ్ గా మారుతుంది. దానిని ఎదుర్కోవాలనే సంకల్పం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలదు. ప్రధానంగా ఈ చిత్రంలోని అంతర్లీన సందేశం ఇదే.

ఈ కథని తెర మీద చూస్తూ మమేకమవడానికి అతిముఖ్య కారకురాలు నివేతా థామస్. హావభావాలతో చక్కని నటన కనబరిచింది. సగటు గృహిణిగా, తల్లిగా చాలా బాగా నప్పింది. అయితే ఆమె డబ్బింగులో అక్కడక్కడా తప్పులు దొర్లాయి. అవి లేకపోతే ఇంకా బాగుండేది.

విశ్వదేవ్ రాచకొండ కూడా పాత్రకి తగ్గట్టుగా సరిగ్గా సరిపోయాడు. సటిల్ గా చేస్తూనే అవసరమైనంత మేరకు ఎమోషన్ ని పండించాడు.

నివేతా తర్వాత ఆకట్టుకున్న నటుడు అరుణ్ దేవ్. బాలనటుడిగా మంచి పరిపక్వమైన నటన ప్రదర్శించాడు. అభయ్ దువ్వూరి, అనన్య మాడుగుల కూడా మంచి ఈజ్ తో చేసారు.

ప్రియదర్శి నుంచి ప్రేక్షకులు ఇంకా ఆశిస్తారు. ఇక్కడ అతను చేసింది సరిపోలేదు. భాగ్యరాజా, గౌతమి వారి వారి పాత్రల్లో ఓకే.

టెక్నికల్ గా సంగీతం, పాటల్లోని సాహిత్యం కూడా బాగుంది. మాంటేజ్ సాంగ్స్ గా వినిపించినా సందర్భోచితంగా కథను నడిపే విధంగా, ఫీల్ అందించే రీతిగా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. కెమెరా పనితనం కూడా బాగుంది.

ప్రధమార్ధం మందకొడిగా సాగుతూంటుంది. పిల్లల నడుమ సన్నివేశాలు, జీరో మీద ఓవర్ ఫోకస్ వల్ల కథ ముందుకు నడుస్తున్న ఫీల్ రాదు. పైగా చాలా సేపు ఏదో బాలలచిత్రం చూస్తున్న ఫీలింగొస్తుంది.

ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథలో సంఘర్షణ, ఆ తర్వాత ఎదురయ్యే అడ్డంకుల వల్ల ప్రధానపాత్రలు తమ చాలెంజులో పాసవుతారా లేదా, అయితే ఎలా అవుతారు అనే ఉత్కంఠ కలుగుతుంది. క్లైమాక్సు మనసుని కదిలించింది.

తల్లి తన పిల్లవాడికి చదువు చెప్పి గట్టెక్కించే ప్రయత్నం చేసిన కథతో ముందుకొచ్చిన ఈ చిత్రం టీచర్స్ డే రోజు రాత్రే స్పెషల్ షోలతో విడుదలవడం సమంజసంగా ఉంది. కథకంటే కథనం ఒక మెట్టు పైన ఉంది. కథనం కంటే నేపథ్యసంగీతం మరో మెట్టు పైన ఉంది. వీటన్నిటికంటే నివేతా పర్ఫార్మెన్స్ మరొక్క మెట్టు పైనుంది. కమర్షియల్ గా సినిమా హాల్స్ వద్ద కాసుల వర్షం కురుస్తుందో లేదో కానీ, చూసిన వారికి మంచి సినిమా చూసామన్న హర్షం మాత్రం కలగవచ్చు.

బాటం లైన్: సంస్కారవంతమైన చిత్రం

19 Replies to “35-Chinna Katha Kaadu Review: మూవీ రివ్యూ: 35- చిన్న కథ కాదు”

  1. Bacchan , Double ismart, Raayan , Indian 2, GOAT లాంటి పనికిమాలిన సినిమాలు చూడడం కంటే ఈ సినిమా చూడడం Best

  2. ఇదేదో మలయాళీ కథల లాగ సింపుల్ గ కథనం మీద నడిపినట్టున్నారు. అయినా ఎనభై లో నడిచిన కథలు ఇప్పుడు హిట్ అవవడం గ్రేట్. ఈ రోజుల్లో ఆరేళ్లకే కాన్వెంట్ లలో పడేసి తమ బాధ్యత నెరవేర్చుకునే తల్లుల్లో , ఈ తరహా వాళ్ళు తక్కువే.

  3. So happy for the director…..he is a CA by profession……maaku GMCS ani CA course lo oka training ki 2 days teacher ga vacharu….5 min late ga vachamani 4 hrs class ki allow cheyyaledu……time sense and basic responsibility Leni varante aayanaki chiraku😃

Comments are closed.