సినిమా రివ్యూ: లేడీస్‌ & జెంటిల్‌మెన్‌

రివ్యూ: లేడీస్‌ & జెంటిల్‌మెన్‌  రేటింగ్‌: 3/5 బ్యానర్‌: షిరిడి సాయి కంబైన్స్‌ తారాగణం: చైతన్య కృష్ణ, మహత్‌ రాఘవేంద్ర, శేష్‌ అడివి, కమల్‌ కామరాజు, నిఖితా నారాయణ్‌, స్వాతి దీక్షిత్‌, జాస్మిన్‌ భాసిన్‌,…

రివ్యూ: లేడీస్‌ & జెంటిల్‌మెన్‌ 
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: షిరిడి సాయి కంబైన్స్‌
తారాగణం: చైతన్య కృష్ణ, మహత్‌ రాఘవేంద్ర, శేష్‌ అడివి, కమల్‌ కామరాజు, నిఖితా నారాయణ్‌, స్వాతి దీక్షిత్‌, జాస్మిన్‌ భాసిన్‌, జీవా తదితరులు
కథ: సంజీవ్‌ రెడ్డి
మాటలు: నివాస్‌
సంగీతం: రఘు కుంచె
నేపథ్య సంగీతం: ఎం.ఆర్‌. సన్నీ 
కూర్పు: నవీన్‌ నూలి
ఛాయాగ్రహణం: జగన్‌ చావలి
నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి
కథనం, దర్శకత్వం: పి.బి. మంజునాథ్‌
విడుదల తేదీ: జనవరి 30, 2015

సోషల్‌ నెట్‌వర్క్‌ నేపథ్యంలో సాగే ‘లేడీస్‌ & జెంటిల్‌మెన్‌’ చిత్ర విశేషాల్లోకి వెళితే..

కథేంటి?

భర్త (కమల్‌ కామరాజు) తనని పట్టించుకోవడం లేదని విసిగిపోయిన భార్య (నిఖిత) తన పాత స్నేహితుడికి (శేష్‌) సన్నిహితమవుతుంది. వారిద్దరి మధ్య ఏదో ఉందని భర్త ఆమెని అనుమానిస్తాడు. ఇద్దరూ విడిపోతారు. కానీ ఆమె నమ్మిన ఆ స్నేహితుడు మంచివాడేనా? 

తనకి గాళ్‌ఫ్రెండ్‌ లేదని తెగ బాధ పడిపోయే కృష్ణమూర్తి (చైతన్య కృష్ణ) ఫేస్‌బుక్‌లో గాళ్‌ఫ్రెండ్‌ని వెతుక్కుంటాడు. అతనికి పరిచయమైన దీప (స్వాతి) ముద్దు పెట్టడానికి కూడా మెడికల్‌ సర్టిఫికెట్‌ అడుగుతుంది. ఫేస్‌బుక్‌లో చిగురించిన ఈ ప్రేమ సుఖాంతమవుతుందా? 

చిన్న ఉద్యోగం చేసుకునే విజయ్‌కి (మహత్‌) ఆశలెక్కువ. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి వివిధ ఫ్రాడ్‌ మార్గాలని నమ్ముకుని బాగా సంపాదిస్తాడు. కానీ అడ్దదారిలో సంపాదించిన డబ్బు అతడిని అందలం ఎక్కిస్తుందా?

కళాకారుల పనితీరు:

అమాయకుడైన పాత్రలో చైతన్య కృష్ణ నటన సహజంగా ఉంది. భర్త తనని పట్టించుకోవడం లేదని మాజీ ప్రియుడికి దగ్గరయ్యే పాత్రలో నిఖిత ఫర్వాలేదనిపించింది. ఎన్నారై పాత్రలో శేష్‌ పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. తన పాత్రకి అతను పూర్తి న్యాయం చేసాడు. మహత్‌ మునుపటి సినిమాలతో పోలిస్తే బెటర్‌గా పర్‌ఫార్మ్‌ చేసాడు కానీ తన ఫేస్‌లో క్యారెక్టర్‌కి కావాల్సిన కన్నింగ్‌నెస్‌ చూపించలేకపోయాడు. కమల్‌ కామరాజు, స్వాతి దీక్షిత్‌, జాస్మిన్‌ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

రఘు కుంచె స్వరపరిచిన పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. సన్నీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగున్నాయి. లో బడ్జెట్‌లో క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇచ్చారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోయినా కథపై భరోసా ఉంచిన నిర్మాతలని అభినందించాలి. నిర్మాతలు ఎం.వి.కె. రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి చాలా బోల్డ్‌గా ఈ చిత్రంపై ఇన్వెస్ట్‌ చేసారు. 

Video: Ladies & Gentlemen Movie Public Talk 

సంజీవ్‌ రెడ్డి రాసిన కథ ఈ చిత్రానికి సంబంధించి హైలైట్‌. కాంటెంపరరీ ఇష్యూ కనుక సోషల్‌ నెట్‌వర్క్‌ అడిక్ట్స్‌ కనెక్ట్‌ అవుతారు. మూడు కథలు ప్యారలల్‌గా సాగుతున్నా కథనం పరంగా కన్‌ఫ్యూజన్‌ లేకుండా దర్శకుడు మంజునాథ్‌ కేర్‌ తీసుకున్నాడు. మొదటి సినిమా అయినప్పటికీ సినిమాని ఎక్కడా తడబాటు లేకుండా బాగానే హ్యాండిల్‌ చేసాడు. క్లయిమాక్స్‌లో డైరెక్షన్‌ ఆకట్టుకుంటుంది. కానీ అంత వరకు సినిమా చాలా ఫ్లాట్‌గా నడుస్తుంది. రెండు గంటల సినిమా అయినా కానీ లీజర్‌గా సాగుతుంటుంది. ఇలాంటి సినిమాలకి నెరేషన్‌ చాలా ఫాస్ట్‌గా ఉండాలి. అది ఇందులో మిస్‌ అయింది. 

హైలైట్స్‌:

  • కథ
  • క్లయిమాక్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • ఫ్లాట్‌ నెరేషన్‌
  • వీక్‌ ఫస్ట్‌ హాఫ్‌

విశ్లేషణ:

‘పొద్దస్తమానం ఆ ఫేస్‌బుక్‌లో పడి ఏడవకురా… కొత్తోళ్లని గుడ్డిగా నమ్మేయకురా..’ అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్తేనే విని తలకెక్కించుకోవడం పోగా… వాళ్లనే విలన్లలా చూస్తారు నేటి యువత. అలాంటిది సోషల్‌ నెట్‌వర్క్‌ లేదా ఇంటర్నెట్‌కి సంబంధించిన చేదు నిజాల్ని నిక్కచ్చిగా ఒక సినిమాలో చూపించేస్తే దానికి బానిసలైపోయిన వారు హర్టయ్యే అవకాశముంది. కానీ ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ రూపకర్తలు వినోదంతో యువతని ఆకట్టుకోవడానికో… సోషల్‌ నెట్‌వర్క్‌ నేపథ్యంలో అశ్లీలత జోడించి క్యాష్‌ చేసుకోవడానికో ప్రయత్నించలేదు. బయట ఏం జరుగుతుందనేది క్లియర్‌గా, ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పారు. దీని వల్ల జరిగే అనర్ధాలేమిటనేది కళ్లకి కట్టారు.

Video: Ladies & Gentlemen Movie Public Talk 

రెగ్యులర్‌ సినిమాల్లో ఉండే సోకాల్డ్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కానీ, నవ్వించడానికి పని కట్టుకుని చేసే ఎటెంప్ట్స్‌ కానీ ఇందులో లేవు. పూర్తిగా సబ్జెక్ట్‌ బేస్డ్‌గా సినిమా నడుస్తుంది. పాత్ర చిత్రణ, మూడు కథలకి కావాల్సిన సంఘర్షణ… అన్నిటికీ మించి అన్ని కథలకీ సరైన ముగింపు ఈ చిత్రంలో ప్రధాన బలంగా నిలిచాయి. అయితే స్టోరీని ముందుకి నడిపించడంలో వేగం చూపించలేదు. ప్రథమార్థం వరకు కథ చాలా నిదానంగా, ఫ్లాట్‌గా సాగిపోతుంది. ద్వితీయార్థంలో కూడా అదే మందకొడితనం కనిపించినా కానీ క్లయిమాక్స్‌కి తగ్గ బిల్డప్‌ బాగా సెట్‌ చేసుకున్నారు. ఒక దాంతో ఒకటి సంబంధం లేని మూడు కథల్ని ఒక చోటకి చేర్చడంలో… అలా మూడు కథలు సమాంతరంగా నడుస్తున్నా కానీ ఎక్కడా కన్‌ఫ్యూజన్‌ కలిగించకపోవడంలో దర్శక, రచయితలు బాగా సక్సెస్‌ అయ్యారు. 

ముఖ్యంగా ఈ చిత్ర పతాక సన్నివేశం అదిలిస్తుంది, కదిలిస్తుంది… అమితంగా ఆకట్టుకుంటుంది. క్లయిమాక్స్‌ని ఎంత బాగా తెరకెక్కించారంటే… అంతకుముందు కనిపించిన బలహీనతల్ని కూడా క్షమించేసేంతగా. లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌ ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పడం లేదు కానీ మొదలైన దగ్గర్నుంచి చివరి వరకు అడ్డదారులు తొక్కకుండా కథకి న్యాయం చేసింది. మర్చిపోలేని సందేశంతో ఇలాంటి మైకంలో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటోన్న వారిని తట్టి లేపింది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఎలాంటి ఫలితం సాధిస్తుందనేది పక్కనపెడితే ఎంచుకున్న కంటెంట్‌కి జస్టిఫికేషన్‌ మాత్రం జరిగింది. ఇది ఆర్థికంగానూ లాభపడితే ఇలాంటి ప్రయత్నాలు చేసే వారికి మరింత ఉత్సాహమొస్తుంది. 

బోటమ్‌ లైన్‌: గుడ్‌ ఎటెంప్ట్‌.. లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌!

గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri