అగ్రిగోల్డ్ బాధితులకు రెండవ విడతగా వైసీపీ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. దాంతో ఏపీవ్యాప్తంగా ఉన్న బాధితులకు స్వాంతన చేకూరింది. అదే సమయంలో టీడీపీ నుంచి రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అగ్రి గోల్డ్ బాధితులను వైసీపీ సర్కార్ మోసం చేస్తోందని తమ్ముళ్ళు ఒక్క లెక్కన ఆరోపిస్తున్నారు. వారి విషయంలో ఏమీ న్యాయం చేయడంలేదని కూడా అంటున్నారు. అంటే అగ్రి బాధితులకు నష్టపరిహారం ఇవ్వడమే తప్పా అని వైసీపీ నేతలు తిరిగి ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే అగ్రి గోల్డ్ ఆస్తులుగా జప్త్ చేసినవి ముప్పయి అయిదు వేల కోట్ల దాకా ఉంటాయని టీడీపీ నాయకులు అంటున్నారు. వాటిని వేయవచ్చు కదా అని అంటున్నారు. మరో వైపు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే అగ్రి గోల్డ్ ఆస్తులు ముప్పయి వేల కోట్ల పై మాటే అని చెబుతున్నారు.
నిజంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. అగ్రి గోల్డ్ కుంభకోణం జరిగింది తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడే. నాడు ఇదే పని చేసి ఉంటే అందరికీ న్యాయం జరిగేది, టీడీపీకే పేరు వచ్చేది కదా. మరి అయిదేళ్ళూ ఏమీ చేయకుండా ఇపుడు బాధితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నా కూడా ఆడిపోసుకోవడమేంటి అన్న ప్రశ్నని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇక్కడ తమ్ముళ్లు ఆలోచనలు అన్నీ కూడా అగ్రి గోల్డ్ ఆస్తుల మీద ఉన్నాయి కానీ బాధితుల మీద లేవని కూడా అంటున్నారు. అగ్రి గోల్డ్ బాధితులకు టీడీపీయే న్యాయం చేసిందని చెప్పడమే అసలైన విడ్డూరంగా కూడా ఉంది మరి. మరి దీని అర్ధమేంటో తెలుగు తమ్ముళ్ళు చెప్పాలి. మొత్తానికి అగ్రి గోల్డ్ పేరిట తమ్ముళ్ళు విమర్శలు చేస్తూ అగ్గి రవ్వలే కురిపిస్తున్నారు.