కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకున్నాయి. కరోనాపై జగన్ దృక్పథం మారలేదు. కరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాల విమర్శలు తప్పితే, జనం మాత్రం అలా భావించడం లేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని జగన్ ఆదుకున్న తీరు ప్రత్యర్థి పార్టీ శ్రేణుల ప్రశంసలు అందుకుంది.
అయితే జగన్ నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడ్డం కొందరికి అసలు రుచించడం లేదు. అలాంటి నిజాలను పట్టుకుని చిలువలు పలువలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వాళ్లకు కాలమే తగిన బుద్ధి చెప్పడం తెలిసిందే. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. గతంలో వివాదమైన అంశాన్ని మరోసారి జగన్ ప్రస్తావించడం ఈ సమావేశ ప్రత్యేకత.
కరోనా మూడో దశ వస్తుందో, లేదో తెలియకపోయినా… ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నారు. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ మనం అప్రమత్తంగానే ఉండాలని స్పష్టం చేశారు.
కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని మరోసారి జగన్ పునరుద్ఘాటించారు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్నప్పుడు జగన్ ఇదే మాట అంటే… ప్రతిపక్షాలు పెద్ద వివాదాస్పదం చేసిన సంగతి తెలిసిందే. కరోనాను జగన్ లైట్ తీసుకున్నారని, ప్రజల ప్రాణాలు పోతుంటే ఆయనకు పట్టడం లేదంటూ విమర్శలు గుప్పించారు.
కానీ జగన్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకపోగా గట్టిగా నిలబడ్డారు. అనంతర కాలంలో తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ, చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా…కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని చెప్పాల్సి వచ్చింది. దీంతో అంత వరకూ జగన్‌ను ఆడిపోసుకున్న నోళ్లన్నీ మూతపడ్డాయి.
ఈ నేపథ్యం లో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని …ఆ మహమ్మారితో సహజీవనం చేయక తప్పదని జగన్ చెప్పడం విశేషం. తనను ఎవరో ఏదో అనుకుంటారనే భయం లేకుండా, ఏదైనా తాను నమ్మిన దాన్ని ముక్కుసూటిగా చెబుతారనేందుకు ఇదే నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.