రెండు రోజుల క్రితం “హద్దులు దాటితే చర్యలు” అంటూ జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో తన పార్టీ వాళ్లని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ హెచ్చరించినట్టుగా వుంది. అయితే టీడీపీ, జనసేన పార్టీల్లో మాత్రం ఆ ప్రకటనపై ఆసక్తికర, ఆశ్చర్యకర చర్చ జరుగుతోంది. పవన్‌కల్యాణ్ వార్నింగ్… జనసేనకు కాదని, ఆ పేరుతో టీడీపీని, చంద్రబాబుకు అని ఇరుపార్టీల నేతలు అంటున్నారు.
రాజకీయాల్లో తాను భిన్నమైన నాయకుడిని అని నిరూపించుకునేందుకు పవన్‌కల్యాణ్ పరితపిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే హద్దులు దాటితే చర్యలంటూ ఆయన హెచ్చరించారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రకాలుగా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నది టీడీపీ కార్యకర్తలు, నాయకులే అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ చంద్రబాబు నుంచి ఇంత వరకూ ఎలాంటి వార్నింగ్ లేదు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయనేది జగమెరిగిన సత్యమే. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నుంచి ఎలాంటి హెచ్చరిక లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని, చంద్రబాబును నేరుగా తిట్టలేక, తన పార్టీ వారికి హెచ్చరిక చేసినట్టు జనసేన నేతలు చెబుతున్నారు.
అధికారుల పనితీరును బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నది టీడీపీ నేతలే. అలాగే ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా రాష్ట్రమంతా అధికారిక కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. దీన్ని ప్రశ్నించేవారే కరువయ్యారు. అక్కడక్కడ జనసేన నాయకులు పాల్గొంటున్నారు. దీన్ని కట్టడి చేయడానికి పవన్‌కల్యాణ్ వార్నింగ్ పనికొస్తుంది. కానీ మిగిలిన చోట్ల మాటేంటి?
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై , అలాగే వారి ఆస్తులపై టీడీపీ దాడుల మాటేంటి? ఇవన్నీ ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చేవే. టీడీపీ దుశ్చర్యలు ప్రభుత్వానికి నెల రోజుల్లోనే చెడ్డ పేరు తీసుకొస్తే, ఇక ఐదేళ్లలో ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా చెడ్డ పేరంతా టీడీపీపైకి నెట్టేసేందుకు ఇప్పటి నుంచే పథక రచన చేశారని చెబుతున్నారు. ఆయన తాజా ప్రకటన కూడా అందులో భాగంగానే చూడాలని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
చంద్రబాబునాయుడు సీనియర్ నాయకుడైనప్పటికీ, తాను ఆదర్శవంతమైన లీడర్ అని చాటి చెప్పుకోడానికి ప్రతి ఘటనను పవన్ సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. పవన్‌కల్యాణ్ పైకి ఎన్ని మాట్లాడుతున్నప్పటికీ, టీడీపీ వైఖరిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో పవన్ ఘాటుగా స్పందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. అంత వరకూ తన అభిప్రాయాల్ని ఇలా సొంత పార్టీ పేరుతో పరోక్షంగా టీడీపీపై వెల్లడిస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు.