వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది పర్వదినాన ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆమంచి మధ్య తీవ్రస్థాయిలో విబేధాలున్నాయి. బలరాం టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు చీరాల బాధ్యతల్ని జగన్ అప్పగించారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆమంచి చాలా కాలంగా అయిష్టంగా ఉన్నారు. దీంతో వైసీపీ నుంచి ఆయన బయటికొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భావజాలానికి సరిపోతుందని వైసీపీలో చేరానన్నారు. సీఎం వైఎస్ జగన్‌తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని ఆమంచి తేల్చి చెప్పారు. వైసీపీలో తనకు సముచిత స్థానం కల్పించారన్నారు. పర్చూరు నుంచి పోటీ చేయాలని తనకు వైసీపీ అధిష్టానం సూచించిందన్నారు. కానీ చీరాలే తనకు సరైందని భావించి, వైసీపీ నుంచి బయటికొచ్చినట్టు ఆమంచి కృష్ణమోహన్ వెల్లడించారు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని చీరాల ప్రజలు తనకు సూచించారన్నారు. అందుకే షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి, చీరాల నుంచి పోటీ చేస్తానని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. ఘన విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.