తుపాన్‌పై తుపాను. వారం క్రితం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్ని తుపాను వణికించింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి ఆకాశం మేఘావృతమైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో శ్రీలంక, తమిళనాడులో బలమైన ఈదురు గాలులతో పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తమిళనాడుకు సమీపంలో ఉన్న తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు కూడా మొదలయ్యాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మళ్లీ తుపాను అనే మాట వినడానికి కూడా రైతులు భయపడుతున్నారు. వివిధ పంటలు పూత దశలో ఉన్నాయి. మబ్బులకే పంటలకు పురుగు పట్టే ప్రమాదం వుంది. ఇక ఎడతెరిపి లేని వర్షాలు కురిస్తే మాత్రం ఏడాది కష్టమంతా పోతుందని ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల్లో సాయంత్రానికి వర్షం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలున్నాయని వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
You want enjoy 9010471199