ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలున్నాయి. అయితే ప్రధానంగా పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ చాయిస్‌లు లేవని, జగన్ లేదా చంద్రబాబు… వీళ్లిద్దరిలో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అన్ని వర్గాల ప్రజానీకం ఆదరణ పొందేందుకు రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలో బీసీ ఐక్యత సమగ్రాభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు.
ప్రత్యేకంగా అసెంబ్లీకి మాత్రమే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో తెలియదని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
ఏపీలో జగన్ లేదా చంద్రబాబును కాదని మూడో వ్యక్తి గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. మూడో నాయకుడు తన కోసం కాకుండా చంద్రబాబును సీఎం సీట్లో కూచోపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల అన్నారు. అందుకే ఆయన్ను తాము లెక్కలోకి తీసుకోవడం లేదని పవన్ గురించి సజ్జల సీరియస్ కామెంట్ చేశారు. సీఎం సీటును కోరుకోవడం లేదని ఆ మధ్య పవన్‌కల్యాణే చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్, పరోక్షంగా చంద్రబాబే సీఎం అని చెప్పకనే చెప్పారు. అందుకే వైసీపీ కూడా ఆయన్ను పరిగణలోకి తీసుకోలేదని అర్థం చేసుకోవచ్చు.