ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఇటీవలే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేసి కౌన్సిల్ సమావేశాన్ని తానే అధ్యక్షత వహించి నడిపించారు.
ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ సీటుకే ఎర వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, గత ఎన్నికల్లో టీడీపీకి 13 సీట్లు వచ్చాయి. వైసీపీ 15 సీట్లతో మెజారిటీ సాధించి చైర్‌పర్సన్ పదవిని గెలుచుకుంది. అయితే ఐదేళ్ల టెర్మ్‌లో ఇద్దరికి చైర్‌పర్సన్ సీటును పంచాలన్న ఆలోచనతో మొదట ఒకరిని ఎంపిక చేశారు. తరువాత మరొకరికి అవకాశం ఇచ్చారు.
అయితే మొదట చైర్‌పర్సన్‌గా చేసిన ఇద్దరూ ఆ తరువాత వైసీపీ పట్ల గుర్రుగా ఉండి, ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత పార్టీని వీడారు. ఇప్పుడు ఈ ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరు చేరితే కౌన్సిల్‌లో టీడీపీ-జనసేన కూటమి బలం 15కి పెరుగుతుంది. ఎక్స్ అఫీషియో ఓటుతో 16కి చేరుతుంది.
దాంతో నర్సీపట్నం మున్సిపాలిటీ కూటమి పరం అవుతుందని భావిస్తున్నారు. ఇక కూటమి తరఫున ఎస్సీ రిజర్వు మహిళా కోటాలో తమ పార్టీలో చేరిన వారినే చైర్‌పర్సన్‌గా గెలిపించుకుని, వైఎస్ చైర్మన్ పదవిని అయ్యన్నపాత్రుడు రెండవ కుమారుడు రాజేష్‌కు దక్కేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అయ్యన్న తరువాత ఆ కుటుంబంలో పెద్ద కుమారుడికి పార్టీ పదవి తప్ప ప్రజా ప్రతినిధిగా అవకాశం రాలేదు. చిన్న కుమారుడు కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆయనను వైఎస్ చైర్మన్ చేయడం ద్వారా మరో వారసుడిని తయారు చేయాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
Good