టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి కుప్పంలో ఊహించని షాక్. కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కుప్పం బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించాల్సి వుంది. దాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఈ పరిణామాల్ని చంద్రబాబు అసలు ఊహించలేకపోయారు.
గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు చేసుకోలేదు. మొదటి రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో వైసీపీ శ్రేణులు కూడా తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
కుప్పం బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కుప్పంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. బస్టాండ్ సమీపంలోని టీడీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఇదిలా వుండగా కాసేపట్లో ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేయడంతో చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ విధ్వంసాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఆధ్వర్యంలో ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు బైఠాయించారు.
వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు దూసుకెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ దఫా కుప్పం పర్యటనలో చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చివరికి ప్రాంభించాల్సిన అన్యా క్యాంటీన్‌పై దాడికి దిగడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.