దేశంలో రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మరియు సామాజిక కార్యకర్తలపై గూఢచర్యం కోసం పెగాసస్ స్పైవేర్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్వి రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది.
29 మొబైల్ ఫోన్లను పరీక్షించగా, ఫోరెన్సిక్ విశ్లేషణలో ఐదు ఫోన్లు కొన్ని మాల్వేర్ల బారిన పడ్డాయని తేలింది, అయితే అది పెగాసస్ కాదా అనేది అస్పష్టంగా ఉందని ప్యానెల్ తెలిపింది.
పెగాసస్ అంశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడంలేదని కమిటీ తామ దృష్టికి తెచ్చినట్లు చీఫ్ జస్టిస్ వెల్లడించారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఈ కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు.