ఉత్తరాంధ్రలో అన్నీ కలిపేస్తారా?

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఆయన పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుని కూడా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకుని వస్తామని…

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఆయన పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుని కూడా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకుని వస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వంశధార నదితో గోదావరిని కలిపేస్తామని నదుల అనుసంధానంతో అంతా సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విజయనగరంలో ఉందని ఈ ఎయిర్ పోర్టు పూర్తి అయితే విశాఖ, విజయనగరం జిల్లాలు పూర్తిగా కలిసిపోతాయని బాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట దాకా రోడ్డు కనెక్టివిటీని పెంచుతామని దాంతో శ్రీకాకుళం జిల్లా కూడా విశాఖ విజయనగరంలతో కలసిపోతుందని అన్నారు.

అభివృద్ధిలో భాగంగా జిల్లాలు కలుస్తాయి నదుల అనుసంధానంతో అంతా ప్రగతి సాధ్యపడుతుందని అన్నారు. అయితే గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం నుంచి అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం దార్లపూడి దాకా గోదావరి జలాలు వచ్చేందుకు కొత్తగా కార్యాచరణ రూపొందిస్తే 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని లెక్క వేశారు.

దాంతో అనకాపల్లి జిల్లా దాకా గోదావరి జలాలు పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా వస్తాయి. దాంతో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇది మొదటి దశ. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే మొత్తం శ్రీకాకుళం జిల్లా దాకా గోదావరి నీరుని తీసుకెళ్ళవచ్చు అన్నది ప్రాజెక్ట్ లో ఉంది.

అలాగే విశాఖ సిటీకి తాగు నీరు, పరిశ్రమలకు నీరు కూడా ఇవ్వవచ్చు. అయితే ఈ రెండో దశ పనులకు ఎంత ఖర్చు అవుతుందన్నది ఎస్టిమేషన్ వేయలేదు. ముందు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే అనకాపల్లి దాకా పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి గోదావరి నీరు వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలి. ప్రాజెక్ట్ పనులు అప్పుడు పరుగులు పెడతాయని అంటున్నారు. 

నిధుల కొరతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తుంది అన్న దానిని బట్టే ఇవన్నీ ముందుకు కదిలే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ తీసుకుంటే తొలి దశలో పూర్తికి 2026 జూన్ నెల వరకూ పడుతుంది. అందుకోసం అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అని అంచనా వేశారు. రెండో దశ ఆ తరువాత ఉంటుంది. మరో అయిదు వందల ఎకరాలు కూడా ఎయిర్ పోర్టుకు ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇవన్నీ ఒక రూపు దాల్చాలంటే భారీ ఎత్తున నిధుల విడుదల చేయాల్సి ఉంది.