చంద్రబాబు మానసిక స్థితి ఏమిటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర సాధన తర్వాత ఎన్నికలను ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో ఒక మాట చెప్పారు. ‘రాష్ట్రం కోసం పోరాడుతున్న ఉద్యమ సమయంలో సీమాంధ్రుల గురించి మాట్లాడిన మాటలను తిట్లను…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర సాధన తర్వాత ఎన్నికలను ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో ఒక మాట చెప్పారు. ‘రాష్ట్రం కోసం పోరాడుతున్న ఉద్యమ సమయంలో సీమాంధ్రుల గురించి మాట్లాడిన మాటలను తిట్లను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఉద్యమ సమయంలో అనేకం చెబుతుంటాం.. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులందరూ కూడా మా బిడ్డలే. అందరినీ మేము సమానంగా చూసుకుంటాం’ అని కేసిఆర్ అన్నారు.

ఈ ఉదాహరణ ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. రణరంగంలో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు చూసుకునే విద్వేషపు చూపులు ఒక ఎత్తు! కానీ రణం ముగిసిన తరువాత, ఫలితం తేలిన తర్వాత తిరిగి సాధారణ సామరస్య వాతావరణం ఏర్పడాలి. లేకపోతే సామాజిక సంతులనం దారుణంగా దెబ్బతింటుంది. దీనికి ఉదాహరణగానే కేసీఆర్ మాటలు ఉన్నాయి. కానీ ఈ దేశ రాజకీయాల్లో 44 ఏళ్ల సీనియర్ అని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మహానుభావుడినని తన గురించి తాను డప్పు కొట్టుకునే నారా చంద్రబాబు నాయుడు.. కనీసం ఆ మాత్రపు ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది.

ఎన్నికల గోదాలో ఉన్నప్పుడు ప్రత్యర్థి మీద ప్రజలలో భయాలను పుట్టించడానికి వంద రకాల మాటలు మాట్లాడవచ్చు. అబద్దాలను కూడా ప్రచారం చేయవచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఒక దుర్మార్గ వైఖరితో ప్రవర్తించడం చూస్తుంటే.. ఆయన మానసిక స్థితి ఎలా ఉన్నదా అని అనుమానం పలువురికి కలుగుతుంది.

వృద్ధులకు ఇళ్ల వద్ద పెన్షన్ అందకుండా అడ్డుపడి పదుల సంఖ్యలో వారి ప్రాణాలను బలి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు. కొత్త పథకాలు కాకుండా రెగ్యులరుగా జరిగే పథకాలకి లబ్ధిదారులకు డబ్బులు బదిలీ చేయాలంటే ఆ పని జరగకుండా అడ్డుపడిన వ్యక్తి చంద్రబాబు. అలాగని చంద్రబాబు దుర్మార్గాలకు జగన్ ప్రభుత్వం బెదిరిపోయి కూర్చోలేదు. డిబిటి ద్వారా లబ్ధిదారులకు ఇవాళ నిధుల పంపిణీ కూడా చేసేసింది. అలాగే ప్రభుత్వం దాని పని అది చేసుకుంటూ పోతోంది. అలాంటి రెగ్యులర్ ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా తాను అడ్డుపడాలని చంద్రబాబు ఆశిస్తుండడం చిత్రంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ ధైనందిన కార్యకలాపాల తరహాలో ఈ-ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ వ్యవహారాన్ని షెడ్యూలు చేయగా.. అది కూడా జరగడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారు. కొత్త ప్రభుత్వం వస్తోన్నవేళ దానిని అప్ గ్రేట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. ప్రభుత్వం అసలు ఏ పని చేయకుండా స్తబ్దంగా కూర్చోవాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్లుగా ఉంది.

ఇది ‘నేనే  సీఎం పదవిలోకి రాబోతున్నాను’ అనే మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్న ధోరణికి నిదర్శనం. ఈ-ఆఫీసు మీద ఆయనకున్న అనుమానాలు ఏమిటో చెప్పడం లేదు, అందులో ఏ రకంగా తప్పు జరుగుతుందో చెప్పడం లేదు.. కానీ ఆ పని మాత్రం జరగడానికి వెళ్లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి బుద్ధిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.