రూ.50 ల‌క్ష‌ల చుట్టూ చంద్ర‌గిరి రాజ‌కీయం

రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగిస్తుంద‌న్న ఆందోళ‌న‌తో నాని స‌తీమ‌ణి మీడియా ముందుకొచ్చి, త‌న‌దైన స్టైల్‌లో చెవిరెడ్డిపై విరుచుకుపడ్డారని చంద్రగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు.

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరిలో రూ.50 ల‌క్ష‌ల చుట్టూ రాజ‌కీయం తిరుగుతోంది. ఇటీవ‌ల చంద్ర‌గిరి పంచాయ‌తీ ఈవో మ‌హేశ్వ‌ర‌య్య ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. చిన్న‌గొట్టిగ‌ల్లుకు చెందిన కాంట్రాక్ట‌ర్ దినేష్‌కు సంబంధించి బిల్లులు చేసేందుకు రూ.50 వేలు ఇవ్వాల‌ని ఈవో ఈశ్వ‌ర‌య్య అడ‌గ‌డం, అంత ఇచ్చుకోలేన‌ని స‌ద‌రు వ్య‌క్తి చెప్పారు.

వాళ్లిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ‌లో ఎమ్మెల్యే స‌తీమ‌ణికి రూ.50 ల‌క్ష‌లు ఇచ్చి పోస్టులో కొన‌సాగుతున్నాన‌ని, రూ.50 వేలు ఇవ్వ‌డానికి ఇబ్బంది ప‌డితే ఎలా అని కాంట్రాక్ట‌ర్‌ను ప్ర‌శ్నించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. లంచాలు తీసుకోక‌పోతే త‌న కుటుంబం ఏమై పోవాల‌ని కాంట్రాక్ట‌ర్‌ను ఈవో ప్ర‌శ్నించడం, ఇత‌ర విష‌యాల్ని కాంట్రాక్ట‌ర్‌కు ఇచ్చిన చిప్ ద్వారా రికార్డ్ చేసి ఏసీబీ అధికారులు రికార్డ్ చేసిన‌ట్టు చెబుతున్నారు.

ఇదే అవ‌కాశంగా తీసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌మ అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో విస్తృతంగా ప్ర‌చారం మొద‌లు పెట్టార‌ని ఎమ్మెల్యే నాని భార్య సుధారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆధారాల‌తో చంద్ర‌గిరి ట‌వ‌ర్‌క్లాక్ వ‌ద్ద‌కు మంగ‌ళ‌వారం రావాల‌ని ఆమె స‌వాల్ విసిరారు. ఈ నేప‌థ్యంలో పులివ‌ర్తి సుధ ట‌వ‌ర్‌క్లాక్ వ‌ద్ద మీడియా స‌మావేశం నిర్వ‌హించి చెవిరెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు.

మొద‌ట చెవిరెడ్డికి త‌న సెల్‌ఫోన్ నుంచి కాల్ చేశారు. అయితే ఆయ‌న క‌ట్ చేయ‌డం, ఒక‌టికి రెండుసార్లు ఆమె డ‌యిల్ చేయ‌డం నాట‌కీయ‌త చోటు చేసుకుంది. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడ‌వాళ్ల‌తో రాజ‌కీయాలు చేయ‌డం ఏంట‌ని నిల‌దీశారు. తామెప్పుడైనా మీ కుటుంబంలోని మ‌హిళ‌ల‌తో రాజ‌కీయం చేశామా? అని ఆమె ప్ర‌శ్నించారు. చంద్ర‌గిరిలో చెవిరెడ్డి ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని ఆమె అన్నారు. త‌న ఉసురు చెవిరెడ్డికి త‌గులుతుంద‌ని శ‌పించారు.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని, 2029లో తాను పోటీ చేస్తాన‌ని ఆమె ప్ర‌క‌టించ‌డం విశేషం. అసెంబ్లీ స‌మావేశాల‌ప్పుడే వ్యూహాత్మ‌కంగా త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నాలు రాయిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. తాను భ‌య‌ప‌డ‌నన్నారు. ఇంట్లో కూచోన‌న్నారు. ప్రాణాలు తీయాల‌ని అనుకున్నోనికి మానాలు తీసేది పెద్ద లెక్క కాద‌ని చెవిరెడ్డిపై సుధారెడ్డి విరుచుకుప‌డ్డారు. ఇంకా తీరు మార్చుకోని అధికారులపై ఏసీబీ అధికారుల దాడి జ‌రుగుతుందని ఆమె హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. రానున్న రోజుల్లో ఇలాగే త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే… మ‌హిళ‌లు, అధికారుల‌తో మీ ఇంటికి వ‌స్తాన‌ని సుధారెడ్డి హెచ్చ‌రించారు.

పులివ‌ర్తి నాని భార్య సుధారెడ్డి త‌ర‌చూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా పులివ‌ర్తి కుటుంబ అవినీతిపై క‌థ‌నాలు వ‌చ్చాయి. నిజానిజాల సంగతేమో గానీ, సుధారెడ్డి కేంద్రంగా అవినీతి ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. వాటిని స‌హ‌జంగానే ప్ర‌త్య‌ర్థి అయిన చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. చంద్ర‌గిరి ఈవో ఫోన్ సంభాష‌ణ‌లో ఏముందో బ‌య‌టి ప్రపంచానికి తెలియ‌దు. కానీ ఎమ్మెల్యే స‌తీమ‌ణికి రూ.50 ల‌క్ష‌లు ఇచ్చాన‌ని, అదంతా రాబ‌ట్టుకోవాలి క‌దా అని ఈవో అన్న‌ట్టు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగిస్తుంద‌న్న ఆందోళ‌న‌తో నాని స‌తీమ‌ణి మీడియా ముందుకొచ్చి, త‌న‌దైన స్టైల్‌లో చెవిరెడ్డిపై విరుచుకుపడ్డారని చంద్రగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు.

4 Replies to “రూ.50 ల‌క్ష‌ల చుట్టూ చంద్ర‌గిరి రాజ‌కీయం”

Comments are closed.